ఒక హత్య.. రైలు పట్టాలపై ముగిసిన నాలుగు ప్రాణాలు
ఏఓ హత్య కేసులో ఏ1 నిందితుడు భార్య, పిల్లలతో ఆత్మహత్య
నిందితుడి కదలికలపై నిఘా లేకపోవడంతోనే ఈ దారుణం
పోలీసులు అప్రమత్తంగా ఉండి ఉంటే.. ఆ కుటుంబం బతికి ఉండేది
పోలీస్ శాఖ అవినీతే వల్లే ఆ కుటుంబంలో పెను విషాదం
జల్సాలు.. అప్పులు.. ఆస్తి వివాదం.. ఒక హత్య. చివరకు నాలుగు ప్రాణాలను మింగేసింది. హత్య కేసులో నిందితుడిగా మారిన వ్యక్తి అరెస్ట్ భయంతో తన ప్రాణం తీసుకోవడమే కాదు, ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని ఇద్దరు చిన్నారులను, తనను నమ్ముకుని వచ్చిన భార్యను కూడా మరణం వైపు నడిపించాడు. బావ హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం.. ఓ కుటుంబాన్ని పూర్తిగా తుడిచి పెట్టేసిన విషాదం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ముగ్గురు చేసిన తప్పేంటి?. అభం శుభం తెలియని ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు, భర్తే లోకంగా భావించిన ఓ భార్య. వీరికి హత్య కేసుతో సంబంధం లేదు. కానీ నేరం చేసిన వ్యక్తి తను శిక్షను తప్పించుకోవాలని చూసి.. తన కుటుంబానికే శాశ్వత శిక్ష విధించాడు. భావావేశంలో తీసుకున్న నిర్ణయంతో నాలుగు జీవితాలు రైలు పట్టాలపై ముగిశాయి.
నెల్లూరు: బుచ్చిరెడ్డిపాళెం వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్యోదంతం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఆస్తి కోసం మేనబావను హత్య చేసిన బావమరిది హరికృష్ణ ఉదంతం వెలుగులోకి రావడం, ఉలిక్కి పడిన నిందితుడు హరికృష్ణ కుటుంబంతో కలిసి ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ రెండు కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలి్చంది. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పోలీస్‌శాఖ అవినీతి, నిర్లక్ష్యం వెరసీ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు హరికృష్ణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ఘోర కలికి కారణమైంది.
ఆ రోజే స్పందించి ఉంటే..
వ్యవసాయశాఖ అధికారి శ్రీహరి హత్య జరిగిన రోజే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఉంటే.. ఈ రోజు ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసును ఆ రోజే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలోనే కాదు.. ప్రస్తుతం దర్యాప్తు దశలో కూడా పోలీస్ శాఖ నిర్లిప్తత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ కదలికలపై నిఘా పెట్టలేకపోయారు. హరికృష్ణ తన కుటుంబ సభ్యులతో టచ్‌లోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. భార్యాపిల్లలు ఆమె పుట్టింట్లో ఉండగా, మంగళవారం తెల్లవారుజామున వచ్చి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హరికృష్ణ, అతని కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్, కదలికలపై నిఘా ఉండి ఉంటే.. అభం శుభం తెలియని చిన్నారులతోపాటు జీవితాన్ని పంచుకున్న భార్య బతికుండేది. వారేం తప్పు చేశారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన రోజునే హరికృష్ణ తాను చనిపోతున్నానంటూ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చినా.. పోలీస్‌శాఖ నిర్లిప్తతగా వ్యవహరించిందని జిల్లా ప్రజలు నిందిస్తున్నారు.
హత్య కేసులో ఇరుక్కుని.. కుటుంబాన్ని బలి తీసుకుని
జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చులు బాగా పెట్టేవాడు. అంతే స్థాయిలో అప్పుల పాలయ్యాడు. మేనబావ కాక చెల్లి భర్త అయిన బావ ఆస్తిని కాజేయాలని బావ హత్య కేసులో ఏ–1 నిందితుడిగా మారాడు. చివరకు పోలీసులు గాలిస్తున్నారని అరెస్ట్‌కు భయపడి తనతోపాటు అభం శుభం తెలియని చిన్న పిల్లలు, భార్యతో సహా రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వాడు. గ్రామంలో చురుగ్గా ఉండే శ్రీహరి స్థానిక రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా ఉండేవాడు. అయితే ఏఓ శ్రీహరి రెండో వివాహానికి హరికృష్ణ చెల్లెలను ఇచ్చారు.
శ్రీహరి మేనమామ కూడా కావడం వల్ల ఇద్దరి మధ్య ఆస్తి వ్యవహారాలు ఉండేవి. ఈ క్రమంలో శ్రీహరిని హరికృష్ణ అంతమొంచాడని పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసులో హరికృష్ణకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా ఏ–1 నిందితుడిగా ఉన్న హరికృష్ణ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ కేసులో ఇరుక్కుని తన జీవితాన్ని నాశం చేసుకోవడంతోపాటు కుటుంబాన్ని కూడా బలి తీసుకున్నాడు. బుచ్చిరెడ్డిపాళెం ఏఓ శ్రీహరి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హతుని బావమరిది కుడుముల హరికృష్ణ (32) ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌కు వెళ్లి భార్య ప్రణతి (29), కుమార్తె మూగాంబిక (5), కుమారుడు కౌశిక్(3)లతో కలిసి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘోరకలి తోటపల్లిగూడూరు మండలం వరిగొండ పంచాయతీ రావులవారి కండ్రికలో విషాదం నెలకొంది.
వెంటాడిన అమావాస్య
ఏఓ శ్రీహరి గత నెల 15వ తేదీన అమావాస్య నాడు హత్యకు గురయ్యాడు. సరిగ్గా నెల తిరగకుండానే అదే అమావాస్య అయిన 14వ తేదీ మంగళవారం హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం యాదృచ్చికంగానే భావిస్తున్నారు.
తెల్లవారు జామున ఇంటికొచ్చి..
హరికృష్ణ మంగళవారం తెల్లవారు జామున ఇంటికొచ్చాడు. భార్య ఇద్దరు పిల్లలను తన వెంట తీసుకుని సింగరాయకొండకు వెళ్లాడు. అక్కడే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల భయం పట్టుకుని అరెస్ట్ చేస్తే బయటకు రావడం కష్టంగా మారుతుందని తన భార్య, పిల్లలు దిక్కులేని వారవుతారనే ఉద్దేశంతోనే హరికృష్ణ అఘాయిత్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది.


