ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల్లో వసూళ్లు
క్లెయిమ్ మొత్తాన్ని బట్టి 5–10 శాతం వరకూ డిమాండ్
కొందరు అధికారులు, సిబ్బంది, బయటి వ్యక్తుల చేతివాటం
ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ విధానాన్ని అతిక్రమించి సెటిల్‌మెంట్లు
గగ్గోలు పెడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు
సాక్షి, అమరావతి : మెడికల్ రీయింబర్స్‌మెంట్ (ఎంఆర్) కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్‌ఎస్) బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోతుండడంతో పథకం కింద ఉచిత వైద్యసేవలు అందించడానికి నెట్‌వర్క్ ఆస్పత్రులు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో.. సొంతంగా డబ్బు చెల్లించి ఉద్యోగులు, పెన్షనర్లు చికిత్సలు పొందుతున్నారు.
ఆ బిల్లుల కోసం ఎంఆర్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలన సమయంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లోని కొందరు అధికారులు, ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రూ.50 వేలలోపు జిల్లా పరిధిలో, రూ.50 వేలు పైబడిన ఎంఆర్ దరఖాస్తులను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా స్రూ్కటినీ చేస్తారు. ఈ నేపథ్యంలో.. ఉద్యోగులు, పెన్షనర్లు పెట్టుకునే ఎంఆర్ మొత్తాన్ని బట్టి ట్రస్ట్‌లో వసూళ్లకు పాల్పడుతున్నారు.
5 నుంచి 10 శాతం వరకు..
రాష్ట్రంలో ఈహెచ్‌ఎస్ పథకంపై 22 లక్షల మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారు. చంద్రబాబు సర్కారు తీరుతో వీరంతా ఈహెచ్‌ఎస్ కింద ఉచిత వైద్యసేవలు అందక నానా అవస్థలు పడుతున్నారు. అప్పులుచేసి వైద్యం చేయించుకుని ఎంఆర్‌కు పెట్టుకుంటే ఆ బిల్లుల మంజూరులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోందని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
క్యాన్సర్, కిడ్నీ, లివర్, గుండె, మెదడు సంబంధిత ఇతర పెద్ద జబ్బులకు సంబంధించి చికిత్స వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇలా పెద్ద మొత్తంలో ఎంఆర్‌కు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ట్రస్ట్‌లో కొందరు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికి భారీగా కోతల్లేకుండా బిల్లులు ఇచ్చేందుకు ట్రస్ట్‌లోని ఒకరిద్దరు అధికారులు, ఎగ్జిక్యూటివ్స్, బయటి వ్యక్తులు ముఠాగా ఏర్పడి 5–10 శాతం మేర కమీషన్ వసూలుచేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఫిఫోను అతిక్రమించి సెటిల్‌మెంట్లు..
నిజానికి.. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (ఫిఫో) విధానంలో క్లెయిమ్స్‌ను సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే, కమీషన్ల డీల్స్ కుదిరిన క్లెయిమ్‌లను ఫిఫోను అతిక్రమించి వేగంగా సెటిల్‌మెంట్ చేస్తున్న ఘటనలు ఉంటున్నాయి. ఈ తంతును పసిగట్టిన పైస్థాయి అధికారులు ఎంఆర్ స్రూ్కటినీలో పలు మార్పులు తీసుకొచ్చారు. అయినా ఈ ముఠా వసూళ్ల దందాకు చెక్ పడలేదు.
మరోవైపు.. గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఎంఆర్ ఉత్తర్వుల గడువు ముగియడంతో ఏప్రిల్ నుంచి కొత్త దరఖాస్తులు స్వీకరించడంలేదు. అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పాత దరఖాస్తుల పరిశీలనను ఇటీవల చేపట్టారు. వీటి పరిశీలన అనంతరం ఆమోదించిన ఎంఆర్ బిల్లు చెల్లింపులను ప్రభుత్వం ఆలస్యంచేస్తోందని ఉద్యోగులు, పెన్షనర్లు మండిపడుతున్నారు. మొత్తం రూ.40 కోట్లకు పైగా ఎంఆర్ బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే, జూలైలో సగం రోజులు గడిచినా ఎంఆర్ పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై వీరు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


