ఉపాధ్యాయుల రణగర్జన | Teachers hold rallies across the state | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల రణగర్జన

Jul 15 2026 4:29 AM | Updated on Jul 15 2026 4:29 AM

Teachers hold rallies across the state

చంద్రబాబు ప్రభుత్వ తీరుకు నిరసనగా కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

చంద్రబాబు సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, కలెక్టరేట్ల ముట్టడి  

12వ పీఆర్సీ ప్రకటించాలి 

30 శాతం ఐఆర్‌ ఇవ్వాలి 

పెండింగ్‌ డీఏలు, బకాయిలు వెంటనే చెల్లించాలి.. ఇన్‌సర్వీస్‌ టెట్‌ మినహాయింపుపై స్పందించాలి  

సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: తమ ఆర్థిక, సర్వీసు ప్రయోజనాలను దెబ్బ­తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అపరిష్కృతంగా ఉ­న్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కదం తొక్కా­రు. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) పిలుపు మేర­కు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించి.. కలెక్టరేట్లను ముట్టడించా­రు. తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకపోగా.. వివిధ మార్గాల్లో వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని.. 30% మధ్యంతర భృతి(ఐఆర్‌) ప్రకటించాలని, 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్‌ ఉన్న 5 డీఏలు, సరెండ­ర్‌ లీవ్‌ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశా­రు. కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం 23(1)కు సవరణ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కరోనా సమయంలో చనిపోయిన ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఏకీకృత సర్వీ­సు రూల్స్‌ అమలుతో పాటు 2025 సాధారణ బదిలీల్లో స్థా­న­చలనం కల్పించిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్‌ చేయాలన్నారు. 

ఇన్‌ సర్వీస్‌ టెట్‌ మినహాయింపుపై ప్రభుత్వ విధానం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులు మూడు గంటలకు పైగా కూర్చొని ఏకధాటిగా కంప్యూటర్‌లో పరీక్ష రాయగలరా? అని నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా­మని హెచ్చరించారు. ఫ్యాప్టో చైర్మన్‌ లంకలపల్లి సాయి శ్రీనివాస్‌ నేతృత్వంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్ట­రేట్‌ వద్ద నిరసన తెలపగా.. పోలీసులు అడ్డుకొని ఆయనతో పాటు జిల్లా చైర్మన్‌ విజయరామరాజును అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement