ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం
అప్పటివరకు ఇంటింటికి బీఎల్‌వోలు సందర్శన.. ముసాయిదా ఓటర్ల జాబితా ఈ నెల 31న ప్రకటన
అభ్యంతరాలు, క్లెయిమ్‌లకు వచ్చే నెల 30 వరకు గడువు
అభ్యంతరాలు, క్లెయిమ్‌ల పరిష్కారం సెప్టెంబర్ 28కి పూర్తి
అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రకటన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పది రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన మేరకు మంగళవారంతో సర్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే వివిధ రాజకీయ పార్టీలతో పాటు అధికార యంత్రాంగం గడువు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సర్ గడువును పది రోజుల పాటు అంటే ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం ప్రకటించింది. 24వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటింటి సందర్శనలు చేయనున్నారు.
ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 21వ తేదీనే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా ఇప్పుడు సర్ గడువు పొడిగింపుతో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ఈ నెల 31న చేయనున్నారు. ముసాయిదా బాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించేందుకు వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. అభ్యంతరాలు, క్లెయిమ్స్ పరిష్కారం సెపె్టంబర్ 28కి పూర్తి చేయనున్నారు.
అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. సర్ గడువు పొడిగింపు షెడ్యూల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని, అధికారులకు, ఉద్యోగులకు తెలియజేయడంతో పాటు రాజకీయ పార్టీలకు కూడా సవరించిన షెడ్యూల్‌ను గురించి లిఖిత పూర్వకంగా తెలిజేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించింది.


