ఆక్వా రైతులను పరామర్శించనున్న వైఎస్సార్‌సీపీ అధినేత
ఫీడ్ ధరల పెంపు, గిట్టుబాటు ధరల సమస్యలపై రైతులతో ముఖాముఖి
ఆక్వా రైతులను కలిసిన అనంతరం కిర్లంపూడికి జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి అండగా నిలవనున్నారు. ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరగడం, ఉత్పత్తి వ్యయాలు అధికమవడం, రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, విద్యుత్ చార్జీల భారం, ఎగుమతుల్లో సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.
ఇందుకోసం వైఎస్ జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో సమావేశమవుతారు. అనంతరం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ పద్మనాభం భౌతికకాయం వద్ద నివాళి అర్పిస్తారు.


