ఉపాధ్యాయుల పికెటింగ్‌తో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పికెటింగ్‌తో ఉద్రిక్తత

Jul 15 2026 1:04 AM | Updated on Jul 15 2026 1:04 AM

ఉపాధ్యాయుల పికెటింగ్‌తో ఉద్రిక్తత

ఉపాధ్యాయ నాయకులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

భీమవరం: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భీమవరం కలెక్టరేట్‌ వద్ద మంగళవారం ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించిన పికెటింగ్‌ రణరంగంగా మారింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఉదయం 10 గంటలకే చేరిన ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ గేట్‌ వద్ద నేలపై బైఠాయించారు. ఇదే సమయంలో జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ కారులో రావడంతో గేటు వద్ద అడ్డుతొలగాలని, కారుకు దారి ఇవ్వాలని సిబ్బంది కోరడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంగీకరించలేదు. తాము పికెటింగ్‌ చేపట్టామని కొద్దిసేపు దారికి అడ్డుతొలిగేది లేదని ఎమ్మెల్సీ గొర్రా గోపీమూర్తి, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్‌.సాయి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. దీంతో భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎ.రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి కలెక్టరేట్‌ గేటు వద్ద అడ్డుతొలగాలంటూ ఆదేశించారు. కారులోనే జేసీ కొద్దిసేపు బయట నిలబడాల్సి వచ్చింది. పోలీసులు పెద్ద సంఖ్యలో చేరి పికెటింగ్‌లో కూర్చున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో ఎక్కించడానికి ప్రయత్నించగా మిగిలిన ఉపాధ్యాయులు అడ్డుకున్నారు. బలవంతగా పోలీసులు వారిని అదుపులోనికి తీసుకున్నారు. దీంతో మిగిలిన ఉపాధ్యాయులు మరింత భీష్మించి అక్కడి నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేయడంతో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు ఉపాధ్యాయులను బలవంతంగా ఈడ్చుకెళ్లడంతో కొందరికి గాయాలయ్యాయి. ఉపాధ్యాయులు ఏమాత్రం తగ్గకపోవడంతో భీమవరం డీఎస్పీ రఘువీర్‌విష్ణు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సీఐ రమేష్‌ నేతృత్వంలో పోలీసులు పికెటింగ్‌ను భగ్నం చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో జేసీ కల్పశ్రీ మరో మార్గంలో తన చాంబర్‌కు చేరుకున్నారు. పోలీసులు చేసేది లేక పికెటింగ్‌ ముగిసేవరకూ అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గోపీమూర్తి, సాయిశ్రీనివాస్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తమను మోసం చేసిందని ఇప్పటికై నా దిగిరాకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement