నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

Jul 15 2026 1:04 AM | Updated on Jul 15 2026 1:04 AM

నేడు భీమవరానికి వైఎస్‌ జగన్‌

ఆక్వా రైతుకు అండగా

భీమవరంలో భారీ ఏర్పాట్లు

ఉండి బైపాస్‌ రోడ్డులో ఆక్వా రైతులతో సమావేశం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అడ్డగోలుగా మేత ధరల పెంపు.. రోజురోజుకు పతనమవుతున్న గిట్టుబాటు ధర... విద్యుత్‌ చార్జీల భారం వెరసి ఆక్వా రంగం కోలుకోలేని దెబ్బతీశాయి. వీటన్నింటికి తోడు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఆక్వా రైతులు క్రాప్‌ హాలిడే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచి భరోసా ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బుధవారం భీమవరంలో రైతులతో నిర్వహించే సమావేశానికి సర్వం సిద్ధమైంది. ఆక్వా రైతుల సాధక బాధకాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10 గంటలకు భీమవరంలోని లూథరన్‌ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి 10.30 గంటలకు ఉండి రోడ్డులో జరిగే రైతుల సమావేశానికి హాజరై సభలో రైతులతో మాట్లాడతారు. ఆక్వా రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే ఆక్వా సాగు అధికంగా ఉన్న అన్ని జిల్లాల్లో రైతులు నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఆక్వా రైతులకు మద్దతుగా అనేక చోట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. ఈ పరిణామాల క్రమంలో బుధవారం జరిగే సమావేశంలో ప్రధానంగా మేత ధరల పెంపు, రొయ్యలతో పాటు చేపలకు గిట్టుబాటు ధర, ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరగడం, ఫీడ్‌ కంపెనీల ధరలు పెంచి రైతులపై అదనపు భారం మోపడం వంటి వాటిపై క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి వారికి బాసటగా నిలవనున్నారు.

తరలిరానున్న ఆక్వా రైతులు

మరోవైపు చలో భీమవరానికి ఉమ్మడి పశ్చిమతో పాటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఆక్వా రైతులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో భీమవరంలో భారీగా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణం వరకు పార్టీ శ్రేణులు స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, ఎమ్మెల్సీ, పార్టీ ప్రోగ్రామ్స్‌ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు, దూలం నాగేశ్వరరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్యనేతలు మంగళవారం సభా ప్రాంగణం, హెలీప్యాడ్‌, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement