వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతిపై వైఎస్సార్‌సీపీ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మృతి పట్ల బొత్స సత్యనారాయణ సంతాపం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పోరాటం అద్భుతమని చెప్పారు. కాపుల కోసం ఆయన చేసిన ఉద్యమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు.
వైవీ సుబ్బారెడ్డి సంతాపం
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసిన నాయకుడిగా, కాపు సమాజ హక్కుల కోసం జీవితాంతం అంకితభావంతో పనిచేసిన వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్మరణీయులని అన్నారు. ప్రజా జీవితంలో ఆయన ప్రదర్శించిన నిబద్ధత, ఉద్యమ స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్ర రాజకీయాలకు, ముఖ్యంగా కాపు సమాజానికి తీరని లోటని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
జూపూడి ప్రభాకరరావు దిగ్భ్రాంతి
ముద్రగడ పద్మనాభం మృతిపై దళిత ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ప్రగాఢ సంతాపం తెలిపారు. కాపు ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ప్రముఖ ప్రజానేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసిన ధీశాలి నాయకుడిగా, కాపు సమాజ హక్కులు, ఆత్మగౌరవం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా ముద్రగడ పద్మనాభం చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.
వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర సంతాపం
కాపు ఉద్యమ నేత,మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి హఠాన్మరణం పట్ల మాజీ మంత్రి,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని,సంతాపాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ముద్రగడ పద్మనాభం గారు తన జీవితాంతం ప్రజల కోసం,ప్రత్యేకించి కాపు సామాజికవర్గ హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు.రాజకీయాల్లో ఆయన నిబద్ధత,నిష్కల్మషమైన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా,ప్రజా ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.ముద్రగడ పద్మనాభం గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ,వారి కుటుంబ సభ్యులకు,అభిమానులకు వెలంపల్లి శ్రీనివాసరావు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు
ముద్రగడ మృతి తీరని లోటు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ముద్రగడ్డ పద్మనాభం మరణవార్త తనను ఎంతో కలచివేసిందని, ఆయన మృతి ప్రజా ఉద్యమాలకు, నగర రాజకీయాలకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. విజయవాడ నగరంతో ముద్రగడ్డ పద్మనాభంకు దశాబ్దాల కాలంగా ఎంతో విడదీయరాని, ప్రత్యేకమైన అనుబంధం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత తరం నాయకుల్లో ఆయనలాంటి నిబద్ధత, నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తిని చూడటం చాలా అరుదు అని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారన్నారు. విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మి, దానికి కట్టుబడి జీవించిన ధీరుడు ముద్రగడ్డ పద్మనాభం అని ఆయన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మల్లాది విష్ణు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి కొండంత ధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
అనిల్ కుమార్ యాదవ్ దిగ్భ్రాంతి
ముద్రగడ పద్మనాభం మృతి వైఎస్సార్‌సీపీకితీరని లోటని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఒక మంచి ఉద్యకారుడిని కోల్పోవడం చాలా బాధాకరమని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
కేకే రాజు సంతాపం
ముద్రగడ పద్మనాభం మృతిపై విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు సంతాపం తెలిపారు. రాష్ట్రం అనుభవజ్ఞుడైన నేతను కోల్పోయిందని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముద్రగడ జీవిత కాలం కృషి చేశారని తెలిపారు. ముద్రగడ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.
--


