వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మత్స్యకారులకు అండగా తాను ఉన్నానని మరోసారి భరోసా ఇచ్చారు. విశాఖలోని జబ్బర్‌తోటలో బాధిత మత్స్యకార కుటుంబాలను ఆయన మంగళవారం పరామర్శించిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్ జగన్ 2020 మేలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులను ఆదుకునేందుకు రూ.10 వేలు ఆర్థికసాయం అందిస్తున్నామని ప్రకటించారు. బటన్ నొక్కి మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 10 వేల చొప్పున వైఎస్ జగన్ జమ చేసేవారు.
గతంలో ఎన్నడూ లేని రీతిలో వేట నిషేధ సమయంలో సాయం అందడంతో మత్స్యకారులు సంతోషంగా ఉండేవారు. అప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ మత్స్యకారులకు ఇంత సాయం అందించలేదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రాకముందు డీజిలుపై లీటరు మీద రూ.6 సబ్సిడీ ఇస్తే, వైఎస్సార్‌సీపీ సర్కారు రూ.9కు పెంచింది. ఈ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది వైఎస్సార్‌సీపీ సర్కారు. డీజిల్ సబ్సిడీని మరిన్ని బోట్లకు అందించింది. దాదాపు 20 వేల బోట్లకు రూ.130 కోకు పైగా సబ్సిడీ ఇచ్చింది. డ్రిల్లింగ్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు ఉపాధి అందించింది.
అలాగే, ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్ సబ్సిడీని అందించింది. దాదాపుగా రూ.3,500 కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. ఈ ఆరు పథకాలలకు మొత్తం రూ.4,913 కోట్లు అందించింది. ఇవికాకుండా నవరత్నాలు ద్వారా అందించిన సాయం అదనం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కాని, ఫిషింగ్ హార్బర్ లేదా, ల్యాండింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, పోర్టుల నిర్మాణాలు చేసింది. తీరం వెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచింది. బ్లూ ఎకనామీని పెంచేలా చర్యలు తీసుకుంది. ఇవేగాక, మత్స్యకారుల కోసం ఇంకా ఎన్నో కార్యక్రమాలను వైఎస్ జగన్ చేపట్టారు. అందుకే ఆయనకు మత్స్యకారులు ఇవాళ కూడా జేజేలు కొట్టారు.

మరోవైపు, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అప్పట్లో ఓఎన్జీసీ పైపులైను కారణంగా ఉపాధి కోల్పోయిన 23,459 కుటుంబాలకు ఐదో విడతగా రూ.161.86 కోట్లను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమచేశారు. దాంతో ఐదు విడతల్లో రూ.647.44 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం మత్య్సకారుల ఖాతాల్లో జమ చేసినట్లయ్యింది.
రాజ్యాధికారంలో వాటా..
సామాజికంగానూ, ఆర్థికంగానూ వెనుకబడిన మత్స్యకారులను వైఎస్ జగన్ అన్ని రకాలుగా ఆదుకున్నారు. రాజ్యాధికారంలో వాటాను పంచారు. ఆర్థికంగా చేయుతనిచ్చారు. ఎప్పుడూ లేని విధంగా మత్స్యకార వర్గానికి 4 ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. మత్స్యకార సామాజికవర్గంలోని 14 ఉప కులాలను విభజించి ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు టీటీడీ బోర్డులో మత్స్యకారులకు చోటే దక్క లేదు. తొలిసారిగా మొదట మల్లాడి కృష్ణారావుకూ, రెండవసారి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ కుమార్‌కూ టీటీడీ సభ్యులుగా అవకాశం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల్లో మత్స్యకారుల సామాజిక వర్గానికి అత్యధిక పదవులు ఇచ్చారు.


