సాక్షి, కాకినాడ: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (జులై 14) హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ మరణవార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.
ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయన ప్రాథమిక పాఠశాల విద్య స్వగ్రామంలోనే సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మున్సుబ్‌గా పని చేయగా, తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలంగా ఉండేవారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని నిరుపేదలు, దళితులకు ఆయన అత్యంత అభిమాన నాయకుడిగా నిలిచారు.
మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ముద్రగడ వీర రాఘవరావు అత్యంత ఆప్తుడు. 1977లో వీర రాఘవరావు మరణించిన తర్వాత, నీలం సంజీవరెడ్డి సూచన మేరకు ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిరుపేదలు, గిరిజనులు, బీసీలు పద్మనాభంలో ఆయన తండ్రి రూపాన్ని చూసుకుని భారీ మెజారిటీతో గెలిపించారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1978, 1983, 1985, 1989 శాసనసభ ఎన్నికలలో వరుసగా నాలుగు సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, కాకినాడ నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా కూడా దేశ రాజధానిలో అడుగుపెట్టారు.
రాజకీయ పదవుల కంటే కూడా కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలంటూ ముద్రగడ పద్మనాభం చేసిన పోరాటాలు ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి.కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన జీవిత కాలంలో ఏకంగా ఏడుసార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు.2016లో తుని వేదికగా ఆయన నేతృత్వంలో నిర్వహించిన 'కాపు ఐక్య గర్జన' సభ అక్కడ జరిగిన రైల్వే ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఊపేసింది. ఈ ఘటనతో కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఆయన జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. తద్వారా కాపు సామాజిక వర్గానికి తిరుగులేని ఉద్యమ నేతగా ముద్రగడ చరిత్రలో నిలిచిపోయారు.


