- ప్రభుత్వంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
తాడేపల్లి: తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతోపాటు ఎరువుల కొరతతో రైతాంగం అల్లాడిపోతుంటే కనీసం రివ్యూ కూడా నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా అని వైఎస్సార్‌సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి నిలదీశారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి పంటలు వేసుకున్న రైతులకు కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి యూరియా కోసం వెళ్లి రైతులు అసువులు బాసిన రైతుల మరణాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాల్లో ఉన్న రైతులను గాలికొదిలేసి, రాజధాని నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని లూఠీ చేయడంలో నిమగ్నమయ్యారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో ఏం రంగం చూసినా వెనుకబాటుతనమే కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రశ్నిస్తుంటే తట్టుకోలేక తప్పుడు కేసులు పెట్టి వేధించడం, ప్రశ్నించే గొంతులను నొక్కడమే ధ్యేయంగా సోషల్ మీడియాని కట్టడి చేయాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పే ధైర్యం లేక వ్యక్తిగత దూషణలకు దిగుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించే చంద్రబాబు కుట్రను అర్థం చేసుకున్నాం కాబట్టే వీటన్నింటినీ సంస్కారంతో భరిస్తున్నామని చెప్పారు. కానీ తప్పుడు కేసులకు భయపడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వర్షాభావ పరిస్థితులపై ముందస్తు ప్రణాళిక లేదు
రాష్ట్రంలో ఎలినినో ఎఫెక్ట్ వల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ 6 నెలల ముందే హెచ్చరించింది. అయినా ఈ ప్రభుత్వం కనీసం ముందస్తు ప్రణాళిక రూపొందించుకోకుండా రైతులను గాలికి వదిలేసింది. ఖరీఫ్ సీజన్ మొదలై ఒకటిన్నర నెల గడుస్తున్నా.. ఇంతవరకు విత్తన సాగు లేక రైతులు దయనీయ స్థితిలో ఉన్నారు. మే నెలలోనే విత్తన సరఫరా జరగాల్సి ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి పంటలు వేసుకున్న రైతులకు కనీసం ఎరువులు కూడా సప్లై చేయలేని చేతకాని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
శ్రీకాకుళంలో ఎరువుల కోసం వెళ్లిన మహిళ చనిపోవడం అత్యంత విచారకరం. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదు. రాష్ట్రంలో పశుగ్రాస కొరత తీవ్రమవుతోంది. రైతులకు అందాల్సిన ఉంచిత పంటల బీమా, సున్నా వడ్డీ రుణాలు, పెట్టుబడి సాయంపై ఈ ప్రభుత్వం కనీసం అధికారులతో ఒక్క రివ్యూ కూడా నిర్వహించలేదు. వ్యవసాయ శాఖ మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయకపోవడం దురదృష్టకరం.
రాజధాని నిర్మాణాల పేరిట వేల కోట్ల దోపిడీ
రాజధాని పేరుతో రూ.50వేల కోట్లు అప్పులు తెచ్చి, ప్రజల నెత్తిన భారం వేస్తూ మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరిట దోపిడీ చేస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలో కేవలం 10 లక్షల చదరపు అడుగులతో రూ. 670 కోట్లలో అద్భుతమైన సచివాలయం నిర్మించుకున్నారు. కానీ ఇక్కడ 52 లక్షల చదరపు అడుగులతో సచివాలయం ఎందుకు కడుతున్నారు? ప్రస్తుతం ఉన్న తాత్కాలిక సచివాలయమే 6.8 లక్షల చదరపు అడుగులు ఉంది. అది సరిపోవడం లేదా? చదరపు అడుగుకు రూ. 20వేల చొప్పున ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు.
సంవత్సరానికి కేవలం 40 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల కోసం వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌ను చదరపు అడుగుకు రూ. 4,500 ఖర్చుతో నిర్మిస్తుంటే, ఇక్కడ అన్ని వనరులు ఉచితంగా ఉన్నా రూ. 20వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? మేము అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వైఎస్సార్సీపీ రాజధానికి వ్యతిరేకం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ హయాంలోనే వాస్తవ అభివృద్ధి
దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞం వల్లే ఇవాళ గ్రామాలు పచ్చగా ఉన్నాయి. పోలవరం సహా ఏ ప్రాజెక్టు చూసినా వైఎస్సార్ పేరే వినిపిస్తుంది. వైఎస్ జగన్ రెడ్డి గారి హయాంలోనే గ్రామ సచివాలయాలు వచ్చాయి, 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది. నిన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి కేంద్రం నుండి 100 సీట్లు మంజూరు కావడం జగన్ దూరదృష్టికి నిదర్శనం. నూతన పోర్టుల నిర్మాణం కూడా ఆయన వల్లే సాధ్యమైంది.
గతంలో జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఫ్రీబీస్ అంటూ విమర్శించారు. జగన్ పేద ప్రజల చదువు, ఆరోగ్యం, మహిళల ఆర్థిక స్థితిగతుల కోసం నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు వేశారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం ఎకరా 99 పైసల చొప్పున భూములను ధనవంతులకు దోచిపెడుతోంది. మీవి అవినీతి ఫ్రీబీస్ అయితే, జగన్ సామాన్యుడికి చేసిన సహాయం.
ముఖ్యమంత్రి స్థాయికి తగని బూతుల పురాణం
దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడనంతటి అసభ్యకరమైన భాషను, బూతులను చంద్రబాబు వేదికలపై మాట్లాడుతున్నారు. వయసులో తన కొడుకు సమానమైన వైఎస్ జగన్ గారు ఇప్పటికీ చంద్రబాబు గారిని 'పెద్దమనిషి' అని, 'గౌరవ ముఖ్యమంత్రి' అని సంబోధిస్తారు. కానీ చంద్రబాబు గారు కింది స్థాయి నేతలకు కూడా బూతులు నేర్పిస్తూ వ్యవస్థలను దిగజారుస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో రూ. 3.36 లక్షల కోట్ల అప్పులు చేస్తే, కేవలం రెండుళ్లలోనే చంద్రబాబు రూ. 3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు. అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకనే ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వ అవినీతిపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేస్తున్నారా లేదా?
ప్రజాస్వామ్య విధ్వంసం - సోషల్ మీడియాపై ఉక్కుపాదం
నిన్న గంట సేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే.. అందులో 90శాతం సమయం కేవలం సోషల్ మీడియాను ఎలా అణచివేయాలి, ప్రశ్నించే వారిపై ఎలాంటి కేసులు పెట్టాలి అనేదానిపైనే చర్చించారు. మిగిలిన 10 నిమిషాలు భూములు ఎలా పంచుకోవాలనే దానికి కేటాయించారు. ప్రశ్నించిన వారిని హింసించడం, యూట్యూబర్స్ ఇళ్లకు పోలీసులను పంపి భయభ్రాంతులకు గురి చేయడం చూస్తుంటే తాలిబాన్ల పరిపాలన మేలనేలా ఉంది. నాగార్జున యాదవ్ ఎప్పుడో రెండేళ్ల క్రితం మాట్లాడిన మాటలకు ఇప్పుడు చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారు.
క్రాంతి అనే దళిత యువకుడు పోలీసుల వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. జ్ఞానేశ్వరి అనే చిన్నారి అదృశ్యమై 30 రోజులు దాటినా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. లాకప్‌లో మరణించిన సాయికృష్ణ కేసు ఈ ప్రభుత్వం మెడకి చుట్టుకుంది. వీటన్నింటికీ సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
వాటిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారనే కోపంతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వ్యక్తిగత దూషణలు చేసినా సంస్కారంతో భరిస్తాం. కానీ, ప్రజా సమస్యలపై వైఎస్సార్‌సీపీ ఎప్పటికీ ఆపదని గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.


