ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి | YS Jagan expresses profound grief over the demise of Mudragada Padmanabham | Sakshi
Sakshi News home page

ముద్రగడ మృతిపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి

Jul 14 2026 7:53 PM | Updated on Jul 14 2026 8:20 PM

YS Jagan expresses profound grief over the demise of Mudragada Padmanabham

సాక్షి,తాడేపల్లి: ప్రముఖ కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

ఆ ట్వీట్‌లో మా పార్టీ సీనియర్‌ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం.

ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు.

ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 

అంతకుముందు ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘ముద్రగడ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రజలకోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయం. ముద్రగడ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని వెల్లడించారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement