ముద్రగడ పద్మనాభం మృతిపై ప్రముఖుల సంతాపం | Condolences pour in from political leaders after Mudragada Demise | Sakshi
Sakshi News home page

ముద్రగడ పద్మనాభం మృతిపై ప్రముఖుల సంతాపం

Jul 14 2026 8:37 PM | Updated on Jul 14 2026 8:49 PM

Condolences pour in from political leaders after Mudragada Demise

మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్‌ మాధవ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో కొనసాగుతూ ప్రజా సమస్యలపై తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గుర్తింపు పొందారని పేర్కొన్నారు. 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికై ప్రజా ప్రతినిధిగా సేవలందించడమే కాకుండా, శాసనసభ సభ్యుడిగా, కాకినాడ లోక్‌సభ సభ్యుడిగా ప్రజలకు సేవ చేశారని గుర్తుచేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు, సామాజిక అంశాలపై ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు పీవీఎన్ మాధవ్. 

ముద్రగడ పద్మనాభం ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రజా జీవితంలో ముద్రగడ పాత్ర చిరస్మరణీయం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ముద్రగడ పద్మనాభం పోషించిన పాత్ర చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. దేశంలో ఎంతో ప్రభావం చూపించిన విలక్షణ నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప నాయకులు ముద్రగడ అని అన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని అన్నారు. ముద్రగడ పద్మనాభం మరణం రాజకీయ రంగానికి తీరని లోటని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు. 

కాపుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు
మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం పట్ల బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ దుఃఖాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ప్రజా జీవితంలో ఆయన తనదైన ముద్ర వేసి, కాపు సామాజిక వర్గ హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఆయన రాజకీయ ప్రస్థానం చిరస్మరణీయమైనదన్నారు.

ఆయన మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు హరీష్‌రావు. 

ఆయన మరణం ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది..
మాజీ మంత్రి  ముద్రగడ్డ పద్మనాభం మరణపై రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆయన మరణ వార్త ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని సంతాపం వ్యక్తం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement