బోటు ప్రమాద మత్స్యకార కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
మృత్యువుతో పోరాడి ప్రాణాలు నిలుపుకున్న బాధితుడు కారి చిన్నాకు ఓదార్పు.. అండగా ఉంటాం.. న్యాయం జరిగేలా పోరాడతాం..
ఈ ప్రభుత్వం స్పందించకపోతే మన ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని హామీ
మాట నిలుపుకుని మా ఎదుటకు వచ్చారంటూ సాష్టాంగ నమస్కారం చేసిన చిన్నా
సాక్షి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను, మృత్యువుతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్న కారి చిన్నాను మంగళవారం జబ్బర్‌తోటలోని వారి నివాసంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ‘నేనున్నాను.. అధైర్య పడకండి‘ అంటూ కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ప్రమాదం జరిగి 10 రోజులు అయినా ప్రభుత్వం నుంచి ఏ మంత్రి కూడా ఓదార్చే ప్రయత్నం చేయలేదంటూ బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షల (రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు) అరకొర సాయంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులకు మరింత సాయం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ప్రభుత్వం స్పందించకుంటే, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అలాగే, చిన్నాకు కొత్త బోటును సమకూర్చడంతో పాటు, బాధిత కుటుంబాల పిల్లల చదువు బాధ్యతను తామే స్వీకరిస్తామని జగన్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం బాధితులకు వైఎస్సార్‌సీపీ నుంచి కూడా ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధిత మత్స్యకార కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ సంభాషణ ఇలా సాగింది.
వైఎస్ జగన్: ఆరోగ్యం ఎలా ఉంది? ప్రమాదం జరిగినప్పటి నుంచి వైద్యసేవలు సక్రమంగా అందాయా అన్నా..?
మత్స్యకార బాధితుడు కారి చిన్నా : ఆరోగ్యం బాగానే ఉందన్నా. వైద్యసేవలు బాగానే అందాయన్నా..
వైఎస్ జగన్: బోటు ప్రమాదం ఎలా జరిగింది?
కారి చిన్నా: మేము జూలై 1వ తేదీన హార్బర్ నుంచి 30 నుంచి 35 నాటికల్ మైళ్ల దూరం వేటకు వెళ్లాం. రెండు రోజుల పాటు వేట బాగానే సాగింది. ఇంటికి తిరుగు ప్రయాణంలో తీరానికి మరో 10 నాటికల్ మైళ్ల దూరం ఉందనగా తుపాను గాలులు, రాకాసి అలల ప్రభావంతో బోటు బోల్తా పడింది. మా అన్నయ్య కొడుకు నీటిలో పడిపోయాడు. మా అన్నయ్య చిన్నయ్య ఏడుస్తూ వాడిని కాపాడటానికి వెంటనే నీళ్లలోకి దూకాడు. అలా వాళ్లిద్దరూ మా కళ్లముందే సముద్రంలో కలిసిపోయారు.
బోటు మునుగుతోంది.. రాత్రి 9 గంటల ప్రాంతంలో మునుగుతున్న బోటుపై రెండు లైఫ్ బాయ్ ఫోర్సులను (రక్షణ వలయాలు) పట్టుకుని గడిపాం. కానీ, తెల్లవారే సరికి చీకట్లో అలలు ధాటికి ఒకరు కొట్టుకుపోయారు. చాలా దూరంలో చైనా వాణిజ్య నౌక (షిప్) వెళ్లడం చూసి మిగిలిన నలుగురం ఈదుకుంటూ వెళ్తున్నాం. ఒకరు అలల తాకిడికి మిగతా వారు సముద్రంలో కలిసిపోయారు. 15 కిలోమీటర్ల దూరం మృత్యువుతో పోరాడుతూ వెళ్లి నేను ఆ చైనా షిప్ ‘లంగర్’ (యాంకర్) పట్టుకున్నాను. నా కేకలు విని షిప్ పైనున్న చైనా సిబ్బంది కాపాడారు.
వైఎస్ జగన్: ప్రభుత్వం సహాయక చర్యలు అందలేదా?
కారి చిన్నా: జూలై 4వ తేదీ రాత్రంతా బోటును పట్టుకునే ఉన్నామన్నా. ప్రభుత్వం నుంచి సహాయక చర్యలు చేపడతారనే మరుసటి రోజు ఉదయం వరకూ ఉన్నాం. కనీసం మా మత్స్యకార బోటు అసోíసియేషన్ వారికి చెప్పినా వచ్చేవారన్నా.. నలుగురైదుగురం బతికేవాళ్లం.
వైఎస్ జగన్: బాధపడకు అన్నా.. ప్రభుత్వం నుంచి నీకు సాయం అందిందా?
కారి చిన్నా: మునిగిన బోటు నా సొంతందే అన్నా.. అది మునిగిపోయింది. బోటు పరిహారం గానీ, నాకు ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ప్రభుత్వం అందజేయలేదన్నా..
వైఎస్ జగన్: ప్రభుత్వం సాయం అందించేలా ఒత్తిడి తీసుకొస్తా.. నష్ట పరిహారం ఇవ్వకుంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే రూ.కోటి పరిహారంతో పాటు కొత్త బోటు కోసం డబ్బులు ఇస్తాం. ధైర్యంగా ఉండు.
కారి చిన్నా: ఆ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నన్ను మీరు ఫోన్‌లో పరామర్శించారు. మూడు రోజుల తర్వాత వస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చారు. చాలా ధైర్యంగా ఉందన్నా.. మా మత్స్యకారులందరి ధైర్యం మీరేనన్నా.. (మాట నిలుపుకుంటూ మా ఎదుటకు వచ్చారని వైఎస్ జగన్ రాగానే చిన్నా సాష్టాంగ నమస్కారం చేశారు.)
వైఎస్ జగన్: స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు మిమ్మల్ని కలిసి ఆర్థిక సాయం అందజేస్తారు.
దమయంతి (గల్లంతైన మత్స్యకారుడు కారి గరగయ్య భార్య) : రెండేళ్ల పిల్లోడిని, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడన్నా.. (కన్నీటి పర్యంతమైంది)
వైఎస్ జగన్: తల్లీ.. బాధ పడకమ్మా..
దమయంతి: మేమెలా బతకాలో తెలియడం లేదన్నా.. నేనే నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా. నా పిల్లోడిని చదివించుకోలేని పరిస్థితి. నా భర్త లేని జీవితం చాలా భయంగా ఉందన్నా.
వైఎస్ జగన్ : మిమ్మల్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోకపోతే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మీకు కోటి రూపాయల పరిహారంతో పాటు ఈ పిల్లోడి చదువు బాధ్యతను కూడా తీసుకుంటాం. ఆధైర్య పడకమ్మా. నీకు అన్నివిధాల వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.
దమయంతి : నా భర్త డెత్ సర్టిఫికెట్ త్వరగా వచ్చేలా చూడాలన్నా. అది వస్తే పింఛనుకు దరఖాస్తు చేసుకుంటాను. ప్రభుత్వం ఇచ్చే ఆ డబ్బులతో ఏదో కుటుంబాన్ని పోషించుకుంటానన్నా. నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నానన్నా.
వైఎస్ జగన్ : ఇవన్నీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఒక వేళ ఈ ప్రభుత్వం చేయకపోతే మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే మీకు అండగా నిలుస్తుంది. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అధైర్యపడకమ్మా.. మీ అన్నయ్యగా నేనున్నా.
నర్సియమ్మ (గల్లంతైన మత్స్యకారుడు కారి సీతోడు భార్య) : జగన్ బాబూ.. ఎవరూ మా బాధలను పట్టించుకోకపోయినా నీవు వచ్చావు. నాకు చాలా ధైర్యంగా ఉంది బాబూ..
వైఎస్ జగన్: మీ కోసమే వచ్చాను. మీ కుటుంబాలను ఆదుకుంటాను.
నర్సియమ్మ: నా భర్త గల్లంతయ్యి పది రోజులు దాటింది. నా భర్త ఉన్నాట్లా..? లేనట్లా..? ప్రభుత్వం నుంచి అధికారంగా ఏ సమాచారం లేదు. ఒక వేళ చనిపోయి ఉంటే కనీసం పిండ ప్రదానం, దినకార్యం కూడా చేసుకోలేకపోయాం. ప్రభుత్వం నుంచి ఒక్క మంత్రి కూడా మా దగ్గరికి ఇలా భరోసా కల్పించడానికి రాలేదు.
వైఎస్ జగన్: మత్స్యకారులంటే ఈ ప్రభుత్వానికే నిర్లక్ష్యం. మీకు అండగా వైఎస్సార్‌సీపీ, మీ జగన్ ఉంటాడు.
నర్సియమ్మ: నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడికి పెళ్లి అయింది. చిన్నోడికి ఇంకా పెళ్లి కాలేదు. అన్ని బాధ్యతలు తానే మోయాలి. ప్రభుత్వం నుంచి నా చిన్న కొడుక్కు ఏదైనా ఉద్యోగం కల్పిస్తే నా కుటుంబాన్ని కాపాడినట్లు అవుతుంది బాబూ..
వైఎస్ జగన్ : బాధ పడకమ్మా. ఈ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం. మనం అధికారంలో లేము. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగం కల్పిస్తాం. అప్పటి వరకు మీకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నీ భర్తకు పరిహారంగా రూ.కోటితో పాటు మీ చిన్నకొడుక్కు ఉపాధి కూడా కల్పిస్తాం.
వైఎస్ జగన్ : తల్లీ బాధపడకు.. మీ జగనన్న అండగా నిలుస్తాడు..
లక్ష్మీ (గల్లంతైన మత్స్యకారుడు రగుతు బండియ్య భార్య): నాకు ముగ్గురు ఆడపిల్లలు. పెద్ద పాపకు పెళ్లి చేశాను. మరో ఇద్దరు పిల్లల బాధ్యత మోయాలి. నా భర్త గల్లంతయ్యి ఆచూకీ లేకుండా పోయాడు. ఈ బరువు బాధ్యతలు నాపై పెట్టేశాడు. ప్రభుత్వం నుంచి మా కుటుంబాన్ని ఆదుకునే వారెవ్వరూ లేరు.
వైఎస్ జగన్ : అధైర్యపడకమ్మా.. ఈ మొద్దు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాను. మీకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాం. అప్పటికీ ఈ ప్రభుత్వంలో మార్పు రాకపోతే.. మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే నీకు రూ.కోటి పరిహారంతో పాటు అన్ని విధాలా ఆదుకుంటాం.
లక్ష్మీ: చాలా సంతోషం అన్నా.. అదేవిధంగా నా భర్త డెత్ సర్టిఫికెట్ త్వరితగతిన వచ్చేలా చేస్తే.. పింఛనుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. బాధలో ఉన్న మమ్మల్ని ఓదార్చిందుకు వచ్చిన నీవు నిండు నూరేళ్లు బాగా ఉండాలన్నా..
వైఎస్ జగన్ : మీకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుంది. మీ జగనన్న ఉంటాడమ్మా..
ఇదే రీతిలో వైఎస్ జగన్.. గల్లంతైన మత్స్యకారులు కారి చిన్నయ్య భార్య కె.మౌనిక, మేధా చిన్న అమ్మోరు భార్య మాసినమ్మ, అమర అప్పలరాజు భార్య ఎ.లక్ష్మిలను పరామర్శించి, ధైర్యం చెప్పారు. తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
మత్స్యకార కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సహాయం
చిన్నాకు సహా ఒక్కో కుటుంబానికి రూ.7 లక్షలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకార కుటుంబాలతో పాటు ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబానికి కూడా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి పార్టీ తరఫున రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందివ్వాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. ఇ చ్చిన మాట మేరకు తమ కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడమే కాకుండా ఆర్థిక సహాయం సైతం ప్రకటించడంపై బాధిత కుటుంబాలు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాయి.
బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించడాన్ని మత్స్యకార సంఘాల నాయకులు స్వాగతించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేశ్‌కుమార్, మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలా గురువులు, పార్టీ మత్స్యకార విభాగం జిల్లా అధ్యక్షుడు పేర్ల విజయచందర్, మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకీరామ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఎక్కడికక్కడ ఆంక్షలు.. వీధుల్లో బారికేడ్లు
భద్రత పేరుతో నిర్బంధం.. అయినా పోటెత్తిన జనం
వైఎస్ జగన్ పర్యటనలో సర్కారు పెద్దల డైరెక్షన్.. పోలీసుల యాక్షన్
విశాఖ విద్య/డాబాగార్డెన్స్ : బోటు ప్రమాదంలో విశాఖకు చెందిన మత్స్యకారులు గల్లంతై రోజులు గడుస్తున్నా, వారి జాడ తెలీక తల్లడిల్లుతున్న మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పడానికి వ చ్చిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులను ముందు పెట్టి అడ్డుకోజూసింది. ఈ క్రమంలో విశాఖ పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. జబ్బర్‌తోట పరిసర ప్రాంతాల వీధుల ప్రవేశ మార్గాలను మంగళవారం ఉదయం 7 గంటల నుంచే బారికేడ్లు పెట్టి మూసి వేశారు.
సుమారు 500 మంది పోలీసులను ఎక్కడికక్కడ మోహరించారు. ఏవీఎన్ కాలేజీ అప్, రెల్లి వీధి జంక్షన్, సమీప వీధులను బ్లాక్ చేశారు. వీధుల్లో షాపులను మూసి వేయించారు. సున్నితమైన ప్రాంతం కావడంతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశామని పోలీసులు వారి చర్యలను సమర్థించుకోవడం గమనార్హం. ఇన్ని అడ్డంకులు సృష్టించినా పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్‌ను చూసేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాగా, చంద్రబాబు సర్కారు బాధితులు పలువురు వైఎస్ జగన్‌కు వినతి పత్రాలు అందజేశారు.
హెల్ప్ మీ.. జగనన్నా..
విశాఖ జబ్బర్ తోటలో వంకా నరేష్ భార్య అమ్మాజి ఓ చిన్నోడి ఫొటోతో ‘హెల్ప్ మీ’ అని ప్లకార్డు పట్టుకుని ఉండటం చూసి వైఎస్ జగన్ దగ్గరకు రమ్మని పిలిచారు. ‘అన్నా.. నా భర్త ఫిషింగ్ హార్బర్‌లో కూలీ. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు గగన్ (7) కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వైద్యులు ఎడమ వైపు కిడ్నీ తీసివేయాలన్నారు. కుడివైపు కిడ్నీకి ఇన్‌ఫెక్షన్ పట్టిందని చెప్పారు. అన్నం తిన్నా బాబుకు అరగడం లేదు. నా కష్టం మీతో చెప్పుకోవాలని ఇలా బోర్డు పట్టుకున్నాను’ అని చెప్పింది. ఆమె కష్టాన్ని విన్న జగన్.. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకి ఈ సమస్యను అప్పగించారు.
బర్మా కాందిశీకుల భూమిని కబ్జా చేస్తున్నారన్నా..
విశాఖ ఉత్తర నియోజకవర్గం 49 వార్డులోని కప్పరాడలో సర్వే నెంబర్ 13లో బర్మా కాందిశీకుల భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైందని, దీని వెనుక నియోజకవర్గ ఎమ్మెల్యే పాత్ర ఉందని బాధితులు వైఎస్ జగన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రోద్బలంతో కొందరు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా వేసి విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. 3 ఎకరాల భూమిని ఆక్రమించడానికి ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న ప్రయత్నాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విశాఖలో భూ దందాలు పెరిగి పోయాయని వాపోయారు. 49వ వార్డు మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు, బర్మా కాందిశీకుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఎ.నర్సింహులు, ప్రధాన కార్యదర్శి దీపక్, మహిళా ప్రతినిధులు మంగ, ప్రసన్న తదితరులు వినతి పత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా రైతులు యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలో యూరియా బస్తా కోసం వెళ్లిన కాంతమ్మ అనే మహిళా రైతు తొక్కిసలాటలో మృతి చెందారని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
ఈ నెల 10వ తేదిన టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం మండలం పెద్దలవునిపల్లి రైతు సేవా కేంద్రం వద్ద ఈ ఘటన జరిగిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం దీనిని సాధారణ మరణంగా చిత్రీకరించి ఆ నిరుపేద మహిళా రైతు కుటుంబానికి అన్యాయం చేసిందని వివరించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాటం చేస్తున్నామని చెప్పారు.


