వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

వాహనాల మధ్య ఇరుక్కుపోయి..

జిల్లాలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. జాతీయ రహదారిపై లారీలు సృష్టించిన బీభత్సం కారణంగా పెందుర్తి పరిధిలో ఓ వ్యాపారి, ఆరిలోవ పరిధిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెందుర్తి : ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై సరిపల్లి వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యాపారి కీర్తి మాణిక్యాలరావు (56) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన మాణిక్యాలరావు శనగ పొట్టు వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన ఒక బొలేరో వాహనంలో లోడ్‌తో అనకాపల్లి, ఆనందపురం ప్రాంతాల్లో అన్‌లోడ్‌ ముగించుకుని తిరిగి గొల్లప్రోలు బయలుదేరారు. వాహనం సరిపల్లి వద్దకు చేరుకోగానే, ముందున్న లారీని తప్పించే క్రమంలో బొలేరో డ్రైవర్‌ నాగరాజు వాహనాన్ని కాస్త పక్కకు ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక లారీ అదుపుతప్పి బొలేరోను బలంగా ఢీకొట్టింది. దీంతో బొలేరో వాహనం ముందుకు దూసుకెళ్లి, ముందున్న మరో లారీని ఢీకొట్టింది. రెండు లారీల మధ్య బొలేరో వాహనం నలిగిపోవడంతో, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మాణిక్యాలరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ నాగరాజు స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మృతునికి భార్య లలిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరిలోవ: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో రోణంకి బంగారయ్య (75) అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆరిలోవ సీఐ ఎస్‌.శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పైనాపిల్‌ కాలనీకి చెందిన బంగారయ్య, మంగళవారం సాయంత్రం సాగర్‌ నగర్‌ లోని అంధ బాలికల పాఠశాలలో పనిచేస్తున్న తన కుమార్తెను తీసుకురావడానికి టీవీఎస్‌ ఎక్సెల్‌పై బయలుదేరారు. జాతీయ రహదారిపై విశాఖ వ్యాలీ స్కూల్‌ జంక్షన్‌ వద్ద ఆయన కుడివైపునకు తిరుగుతుండగా, వెనుక నుంచి మధురవాడ వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బంగారయ్యను ఆరిలోవ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ధర్మేంద్ర సత్వరమే స్పందించి చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు పాపారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ మధ్యలో ఇరుక్కున్న ద్విచక్ర వాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement