బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవదానం | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌డెడ్‌ అయిన యువకుడి అవయవదానం

Jul 15 2026 1:22 AM | Updated on Jul 15 2026 1:22 AM

పరవాడ: గాజువాక–అనకాపల్లి జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఎల్‌. భాస్కరరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మునగపాక మండలం నాగులాపల్లి గ్రామానికి చెందిన మారిశెట్టి చిన్నారావు (27) గాజువాకలో ఆన్‌లైన్‌ ఎలక్ట్రికల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా, గాజువాక–అనకాపల్లి జాతీయ రహదారిపై మూడు మదుంల సమీపంలో ఒక్కసారిగా కుక్క వాహనానికి అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతనికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మొదట అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. అనంతరం మృతదేహాన్ని కిమ్స్‌–ఐకాన్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య మారిశెట్టి లోకేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement