ఆక్వా రైతు ఆక్రోశం | Falling count prices and huge increase in feed rates | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతు ఆక్రోశం

Jul 15 2026 4:00 AM | Updated on Jul 15 2026 4:00 AM

Falling count prices and huge increase in feed rates

దిగజారిన కౌంట్‌ ధరలు.. భారీగా పెరిగిన ఫీడ్‌ రేట్లు 

ఏకపక్షంగా టన్నుకు రూ.16 వేలు పెంచిన ఫీడ్‌ కంపెనీలు.. అవంతి, బీఎమ్మార్, సంధ్య సహా మెజార్టీ ఫీడ్‌ కంపెనీలన్నీ టీడీపీ నేతలవే.. 

కౌంట్‌కు రూ.80 వరకు కోతపెట్టిన ప్రాసెసింగ్‌ కంపెనీలు.. పవర్‌ ఫ్యాక్టర్‌ నిబంధనలతో విద్యుత్‌ సబ్సిడీకి సర్కారు ఎగనామం 

వైరస్‌లు, వాతావరణ ప్రభావంతో ఆక్వా రైతులు విలవిల.. పెరిగిన పెట్టుబడి వ్యయం.. దక్కని గిట్టుబాటు ధరలు 

మొక్కుబడి సమీక్షలతో సరి.. మొద్దునిద్రలో బాబు సర్కార్‌.. క్రాప్‌ హాలిడే వైపు అడుగులు వేస్తున్న ఆక్వా రైతన్నలు 

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి గణనీయమైన ఆదా­యాన్ని తెచ్చిపెట్టే ఆక్వారంగం చంద్రబాబు సర్కారు నిర్వాకంతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రూ.వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే ఆక్వా రంగం కకావికలం కావడంతో రైతుల గుండె చెరువైంది. కూటమి సర్కారు చేష్టలుడిగి చూస్తుండటంతో ఫీడ్, ప్రాసెసింగ్‌ కంపెనీలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కనివినీ ఎరగని రీతిలో ఓవైపు మేత ధరలు ఆకాశాన్నంటుతుంటే రొయ్యల కౌంట్‌ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. 

జోన్, నాన్‌ ఆక్వాజోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా యూనిట్‌ రూ.1.50కే ఆక్వాకు సబ్సిడీ విద్యుత్‌ అందిస్తామన్న హామీని చంద్రబాబు అటకెక్కించడమే కాదు.. అమలులో ఉన్న సబ్సిడీ విద్యుత్‌ కనెక్షన్లకు ‘పవర్‌ ఫ్యాక్టర్‌’ నిబంధనల పేరిట కోతలు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. రెండేళ్లుగా చంద్రబాబు సర్కార్‌ అసమర్థత, కంపెనీల సిండికేట్‌ మాయాజాలం మధ్య చిక్కుకుని ఆక్వా రైతు విలవిల్లాడిపోతున్నాడు.  

కౌంట్‌ ధరల్లో ఎడాపెడా కోత 
ఈ – ఫిష్‌ డేటా ప్రకారం రాష్ట్రంలో 1.62 లక్షల మంది రైతులు 5.72 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేçస్తున్నారు. ఏటా 10 లక్షల టన్నులకుపైగా దిగుబడులొస్తున్నాయి. ఆక్వా సాగుదారుల్లో నూటికి 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వైరస్‌లు, వాతావరణ ప్రభావంతో కనీస దిగుబడులు కూడా రాని దుస్థితిలో కూరుకుపోయారు. ఓ వైపు దిగుబడులు నేలచూపులు చూస్తున్నాయి. మరొక వైపు పెరిగిన లీజు, ఫీడ్, విద్యుత్‌ చార్జీల కారణంగా 100 కౌంట్‌కు రావాలంటే కిలోకు రూ.250, 50 కౌంట్‌కు రూ.300, 30 కౌంట్‌కు రూ.350కి పైగా ఖర్చవుతోంది.

ట్రంప్‌ సుంకాల పేరిట కౌంట్‌ ధరలు గత ఏడాది కిలోకి రూ.30–70 మేర తగ్గించగా, పశ్చిమాసియా యుద్దం బూచితో మళ్లీ రూ.30–80 మేర తగ్గించేశాయి. మూడు నెలల క్రితం కిలో రూ.275 పలికిన 100 కౌంట్‌ ప్రస్తుతం రూ.235కి దిగజారింది. అందులో కూడా రూ.10–15 మేర కోతలేస్తూనే ఉన్నారు. మరొకవైపు గతంలో కౌంట్‌కు, కౌంట్‌కు మధ్య రూ.30–50 మేర వ్యత్యాసం ఉండేది. నేడు కంపెనీల సిండికేట్‌ కారణంగా ఆ వ్యత్యాసం కేవలం రూ.10–30కి పరిమితం కావడంతో ఆక్వా రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. 

మేత ధర టన్నుకు రూ.16 వేలు పెంపు 
లీజు ధరలను బట్టి టన్ను ఉత్పత్తికి వెనామీ రొయ్యలకు రూ.2.90 లక్షలు, టైగర్‌ రొయ్యలకు రూ.4 లక్షలు, చేపలకు రూ.1.10 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. రొయ్యల సాగులో రూ.1.50 లక్షలు, చేపల సాగులో రూ.75 వేల వరకు మేత కోసం రైతులు ఖర్చు చేస్తుంటారు. 2023లో రొయ్యల మేత ధర టన్ను రూ.72 – 80 వేలు ఉండగా ప్రస్తుతం పెరిగిన ఫీడ్‌ ధరల కారణంగా వెనామీ ఫీడ్‌ రూ.1.13 లక్షలు, టైగర్‌ ఫీడ్‌ రూ.1.26 లక్షలకు చేరింది. 

ఆక్వా రైతులకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టాన్ని చంద్రబాబు సర్కార్‌ నిర్వీర్యం చేయడంతో ఫీడ్‌ కంపెనీలు దోపిడీకి పాల్పడుతున్నాయి. అప్పడా చట్టానికి విరుద్ధంగా గడిచిన 5 నెలల్లో మేత ధరలు టన్నుకు రూ.16 వేలు చొప్పున పెంచాయి. సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో రూ.4 వేలు తగ్గించేందుకు అంగీకరించిన కంపెనీలు 24 గంటలు తిరక్కుండానే యూటర్న్‌ తీసుకున్నాయి. టన్నుకు రూ.2 వేలకు మించి తగ్గించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాయి. మరొకవైపు ఆక్వా సాగులో ఉపయోగించే పరికరాల ధరలను కంపెనీలు ఇటీవలే భారీగా పెంచేశాయి. 

ఒక్కో ఏరియేటర్‌ సెట్‌పై రూ.3 వేలు, సాధారణ, ప్రీమియం మోటార్లపై రూ.1,000కిపైగా పెంచారు. ఆక్వా రైతులకు సబ్సిడీపై ఏరియేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్స్, మోటార్లు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి చంద్రబాబు ప్రభుత్వం ఎగనామం పెట్టింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఐదేళ్ల పాటు అర్దరూపాయి కూడా పెరగని రొయ్యల సాగులో ఉపయోగించే మందుల రేట్లు ఇప్పుడు రెండేళ్లలో 30 శాతం పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో సీడ్‌ ధరలు 35 నుంచి 33 పైసలకు తగ్గిస్తే ఇప్పుడు మళ్లీ 35 పైసలకు పెంచేశారు.  

విద్యుత్‌ సబ్సిడీకీ ఎగనామం 
జోన్, నాన్‌జోన్, విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా సాగు చేసే ప్రతీ రైతుకు యూనిట్‌ రూ.1.50కే విద్యుత్‌ సరఫరా చేస్తామంటూ ఇచ్చిన హామీకి చంద్రబాబు  నీళ్లు వదిలారు. పవర్‌ ఫ్యాక్టర్‌ పేరిట ఉన్న విద్యుత్‌ కనెక్షన్లకు కోత పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. మరోవైపు సర్‌చార్జీ, సర్దుబాటు చార్జీలంటూ ఎడాపెడా బాదేస్తున్నారు.  మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో సబ్సిడీకి అర్హత పొందిన రైతులు మినహా ఈ రెండేళ్లలో కొత్తగా ఏ ఒక్క రైతు విద్యుత్‌ సబ్సిడీ పొందలేని దుస్థితి నెలకొంది. 

సబ్సిడీ పొందే రైతులు సైతం అదనపు చార్జీల పేరిట యూనిట్‌ రూ.2.50కుపైగా చెల్లిస్తున్నారు. ఇక సబ్సిడీ వర్తించని రైతులకు వాస్తవంగా యూనిట్‌ రూ.3.85 పైసలకే విద్యుత్‌ సరఫరా చేయాల్సి ఉండగా, రూ.5కు తక్కువ కాకుండా బిల్లులొస్తున్న పరిస్థితి నెలకొంది. ఓవర్‌ లోడ్, అదనపు చార్జీల పేరిట ఒక్కో సర్వీసుకు రూ.8 వేల నుంచి రూ.12వేల వరకు అదనపు భారం పడుతోందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. 

ఐదేళ్లలో రూ.3,804 కోట్ల సబ్సిడీ  
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 2019లో అధికారం చేపట్టిన మరుక్షణం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యూనిట్‌ రూ.1.50కే ఆక్వా రైతులకు విద్యుత్‌ సరఫరాకు శ్రీకారం చుట్టింది. టీడీపీ హయాంలో ఎగ్గొట్టిన రూ.309.95 కోట్ల బకాయిలను సైతం చెల్లించింది. అస్తవ్యస్థంగా ఉన్న ఆక్వా జోనేషన్‌ను చక్కదిద్దింది. జోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు సాగుదారులందరికీ యూనిట్‌ రూ.1.50 విద్యుత్‌ సబ్సిడీని వర్తింప చేసింది. ఆక్వా చెరువులకు 64,735 కనెక్షన్లు ఉండగా జోన్‌ పరిధిలో ఉన్న 54,033 సర్వీస్‌లకు సబ్సిడీ విద్యుత్‌ను సరఫరా చేశారు. 

84 శాతం కనెక్షన్లకు సబ్సిడీ విద్యుత్‌ సరఫరా చేయగా దాదాపు 95 శాతం మంది రైతులు లబ్ధి  పొందారు. పాత బకా­యిలతో సహా 2019–24 మధ్య ఐదేళ్లలో ఆక్వా సబ్సిడీ రూపంలో రూ.3,804 కోట్లు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ఆక్వా రైతులకు రక్షణ కోసం అప్సడా, ఏపీ ఫిష్‌ ఫీడ్, సీడ్‌ యాక్ట్‌లను తెచ్చింది. పెంచిన ఫిష్‌ ఫీడ్‌ ధరలను మూడుసార్లు ఉపసంహరింపచేయడం ద్వారా టన్నుకు రూ.8,600 వరకు రైతులపై భారం పడకుండా ఆదా చేశారు. 15 రోజులకు ఒకసారి రొయ్య ధరలను సమీక్షించి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కృషి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement