తిరుపతిలో దివ్యశ్రీ, సైబర్‌సిటీ కన్సార్షియంకు 21.10 ఎకరాలు
చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు
తిరుపతి వన్ ప్రాజెక్టు ముసుగులో భారీదోపిడీ
సాక్షి, అమరావతి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే చంద్రబాబు కూటమి సర్కారు దందాకు ఈసారి కలియుగ వైకుంఠం తిరుపతి వేదికైంది. రూ.వెయ్యికోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రూ.19 కోట్లకే ఇచ్చేశారు. తిరుపతి కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో, రూరల్ మండలం దామినీడులోని 21.10 ఎకరాల విలువైన ప్రభుత్వభూమిని తిరుపతి వన్ ప్రాజెక్టు పేరుతో దివ్యశ్రీ హోల్డింగ్స్, సైబర్‌సిటీ బిల్డర్స్ కన్సార్షియంకు కారుచౌకగా కట్టబెడుతూ ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ నంబరు 417 జారీచేసింది.
ఈ భూమిని ముందుగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి బదలాయించి అటునుంచి ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా పకడ్బందీ స్క్రిప్టు రాశారు. కలెక్టరేట్‌కు సమీపంలోని ఈ ప్రైమ్‌ల్యాండ్ బహిరంగ మార్కెట్ విలువ ఎకరా దాదాపు రూ.50 కోట్లని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. అంటే 21.10 ఎకరాల విలువ రూ.వెయ్యికోట్లకుపైనే. అలాంటి భూమిని ఎకరా కేవలం రూ.90 లక్షల చొప్పున మొత్తం రూ.19 కోట్లకే దివ్యశ్రీ, సైబర్‌సిటీ కంపెనీలపరం చేశారు.
మార్చి ఐదోతేదీ జరిగిన ఏపీ ల్యాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఏపీఎల్‌ఎంఏ) సమావేశం ఈ భూమి ధరను ఎకరాకు రూ.2.25 కోట్లుగా నిర్ధారించి, మొత్తం రూ.47.47 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేసింది. కానీ నెల తిరక్కుండానే ఏప్రిల్ ఏడోతేదీ జరిగిన ఎస్‌ఐపీబీ భేటీలో ఆ రేటుకు కత్తెరేసి ఎకరా రూ.90 లక్షలకు తగ్గించారు. ఏపీఎల్‌ఎంఏ చెప్పిన ధరతో పోల్చినా ఖజానాకు 28.5 కోట్ల నష్టం. మార్కెట్ ధరతో పోలిస్తే రూ.980 కోట్లకుపైనే దోపిడీ.
డబ్బు రాకముందే రిజిస్ట్రేషన్
ఈ భూమి రేటు బుక్ వాల్యూ ప్రకారం రూ.90 లక్షలు ఉంది కాబట్టి ఆ రేటే ఖరారు చేసి జీవోలో పొందుపరచాలని దివ్యశ్రీ, సైబర్‌సిటీ కన్సార్టియం ఎస్‌ఐపీబీని కోరింది. సర్కారు అక్షరం పొల్లుపోకుండా అదే చేసింది. ప్రభుత్వభూమి ధరను కొనే ప్రైవేటు కంపెనీలే నిర్ణయించడం బాబు పాలనలోనే సాధ్యమైంది. పైగా ఈ కంపెనీల కోసం రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఏ నిబంధనలను సడలించారు. ఖరారు చేసిన అత్తెసరు డబ్బూ ప్రభుత్వ ఖాతాలో పడకముందే డెవలపర్ల పేరిట లీజు/సేల్ డీడ్‌లు రిజిస్టర్ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. షరతులతో కూడిన సేల్‌డీడ్ పేరుతో మొత్తం 21.10 ఎకరాలను ఒకేదెబ్బకు దివ్యశ్రీ, సైబర్‌సిటీకి కట్టబెట్టేందుకు లైన్‌క్లియర్ చేశారు.
ముఖ్యనేత తనయుడికి కమీషన్లు?
ఈ ప్రాజెక్టుకు అల్ట్రా మెగా హోదా ఇచ్చి 15 ఏళ్లపాటు నికర ఎస్‌జీఎస్‌టీ వందశాతం తిరిగి ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.40 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ఐదేళ్లు పరిశ్రమల టారిఫ్‌పైనే కరెంటు సరఫరాకు అంగీకరించి ఆ రెండు కంపెనీలపై రాయితీల వర్షం కురిపించారు. ఒకవైపు భూమి కారుచౌక.. మరోవైపు పన్నుల మాఫీ. ఈ కారుచౌక కేటాయింపు వెనుక ముఖ్యనేత తనయుడికి రూ.వందల కోట్ల కమీషన్ల ఒప్పందం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.


