అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా ప్రసన్న నియామకం చెల్లదు | Notices to Governor Secretary Prasanna Kumar | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా ప్రసన్న నియామకం చెల్లదు

Jul 15 2026 4:19 AM | Updated on Jul 15 2026 4:19 AM

Notices to Governor Secretary Prasanna Kumar

హైకోర్టులో న్యాయవాది కనక లింగేశ్వరరావు పిటిషన్‌ 

అర్హతలు లేనప్పటికీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు 

ఇందుకోసం మాజీ రిజిస్ట్రార్ గా పేర్కొన్నారు 

వాస్తవానికి ఆయన సుప్రీంకోర్టులో ఓఎస్‌డీగా మాత్రమే పనిచేశారు 

స్పందించిన హైకోర్టు.. గవర్నర్‌ కార్యదర్శి, ప్రసన్న కుమార్‌కు నోటీసులు  

సాక్షి, అమరావతి: చట్టం నిర్దేశించిన అర్హతలు లేనప్పటికీ శాసన సభ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను నియమించారని, ఏ అధికారంతో ఆయన పదవిలో కొనసాగుతున్నారో వివరణ కోరాలంటూ దాఖలైన కో వారెంటో పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలంటూ గవర్నర్‌ కార్యదర్శికి, ప్రసన్న కుమార్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

అర్హతలు లేని వ్యక్తిని చంద్రబాబు ప్రభుత్వం అందలం ఎక్కించింది 
న్యాయవాది వై. కనక లింగేశ్వరరావు దాఖలు చేసిన ఈ కో వారెంటో పిటిషన్‌పై జస్టిస్‌ విజయ్‌ మంగళవారం విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది బి.శశిభూషణ్‌రావు వాదనలు వినిపించారు. ‘నిబంధనల ప్రకారం అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పదవిని లోక్‌సభ, రాజ్యసభ లేదా రాష్ట్రాల శాసన సభ సెక్రటేరియట్‌లలో పని చేస్తున్న లేదా రిటైర్‌ అయిన సెక్రటరీ జనరల్‌లతో భర్తీ చేయాలి. అందుకు విరుద్ధంగా ప్రసన్నకుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌ శాసన సభకు సెక్రటరీ జనరల్‌గా నియమిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. తగిన అర్హతలు లేకపోయినా ప్రసన్నకుమార్‌ను సెక్రటరీ జనరల్‌గా నియమించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా కట్టబెట్టి, నెలవారీ పారితోషికం రూ.3.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నోటిఫికేషన్‌లో ప్రసన్నకుమార్‌ పూర్వ అర్హతను సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ గా పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సెంట్రల్‌ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ ఇ చ్చిన సమాచారం ప్రకారం.. ప్రసన్న కుమార్‌ సుప్రీంకోర్టులో ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ (ఓఎస్‌డీ)గానే పని చేశారు. వాస్తవానికి ఆయన 1993లో న్యూఢిల్లీలోని న్యూస్‌ సర్వీసెస్‌ డివిజన్‌లో న్యూస్‌ రీడర్‌ కమ్‌ ట్రాన్స్‌లేటర్‌గా చేరి 2022న స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు.

అయినప్పటికీ, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించడం కోసం సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్‌గా పేర్కొన్నారు. అర్హతలు లేని వ్యక్తిని సెక్రటరీ జనరల్‌గా నియమించడం చట్టాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎటువంటి పబ్లిక్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా, అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించకుండా, పారదర్శక ఎంపిక విధానం లేకుండా ప్రసన్న కుమార్‌ నియామకం జరిగింది. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి.’ అని శశిభూషణ్‌ హైకోర్టును అభ్యర్థించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement