గిడ్డంగుల సంస్థలో నిబంధనలకు పాతర
పచ్చ కార్యకర్తలకే ఉద్యోగాలు
ఏడాదిన్నరలో 103 అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ
ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు
సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ఇప్పిస్తామంటూ అదనపు వసూళ్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిడ్డంగుల సంస్థ టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మారిపోయింది. నియామకాల్లో నిబంధనలకు పాతరేస్తూ ఆ పార్టీ కార్యకర్తలతో నింపేసుకుంటున్నారు. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ లేదు.. పైసలిస్తే పోస్టింగ్ అన్నట్టుగా మార్చేశారు. అవుట్‌సోర్సింగ్ పేరిట అడ్డగోలుగా నియామకాలు చేసుకుంటూ వసూళ్ల దందా సాగిస్తున్నారు.
ఆ ఐదేళ్లూ పారదర్శకతకు పెద్దపీట
దాదాపు ఐదేళ్ల పాటు గణనీయమైన అభివృద్ధి సాధించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థను అధికార టీడీపీ నేతలు నేడు అవినీతికి అలవాలంగా మార్చేశారు. 2018–19 నాటికి 6.34 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములతో ఉన్న ఈ సంస్థ వైఎస్ జగన్ హయాంలో అద్భుతమైన పురోగతి సాధించింది. దాదాపు రూ.195 కోట్లతో 2.50 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన 53 కొత్త గోదాములను నిర్మించారు. దాదాపు రూ.21 కోట్లతో ఉన్న గోదాములను ఆధునికీకరించారు. ఫలితంగా రికార్డు స్థాయిలో సుమారు రూ.200 కోట్ల లాభాలను ఆర్జించింది. అలాంటి గిడ్డంగుల సంస్థను నిర్వీర్యం చేస్తూ ఎడాపెడా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.
నేడు నిబంధనలకు పాతర
అడ్డగోలు నియామకాలు.. అవినీతి దందాలతో గిడ్డంగుల సంస్థను కాసులు కురిపించే కామధేనువుగా మార్చేసుకున్నారు. అవుట్‌సోర్సింగ్ నియామకాల కోసం 2023లో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి నియామకాలు జరుపుతున్నారు. సంస్థ చైర్మన్‌గా రావి వెంకటేశ్వరరావు నియమితులైన నాటినుంచి నియామకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ సైతం పాటించడం లేదు. కేవలం ఏడాదిన్నరలోనే 103 మంది వరకు జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వే బ్రిడ్జి ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్ల పేరిట కేటగిరీని బట్టి రూ.15 వేల నుంచి రూ.21,500 వరకు జీతభత్యాలతో నియమించారు.
ఈ పోస్టుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా సీనియర్ అసిస్టెంట్ పేస్కేల్ ఇప్పిస్తామని, త్వరలోనే పర్మినెంట్ చేయిస్తామని నమ్మబలుకుతూ అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. గతంలో అవసరానికి తగినట్టుగానే నిబంధనలకు లోబడి నియామకాలు జరిపేవారని, ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా డబ్బులిచ్చే వారిని ఎమ్మెల్యేల సిఫార్సులతో అడ్డగోలుగా నియామకాలు చేపడుతున్నారని చెబుతున్నారు.


