దివికేగిన ఉద్యమ పతాక.. ముద్రగడ ఇకలేరు | Mudragada Padmanabham breathed his last in hospital due to respiratory illness | Sakshi
Sakshi News home page

దివికేగిన ఉద్యమ పతాక.. ముద్రగడ ఇకలేరు

Jul 15 2026 4:58 AM | Updated on Jul 15 2026 5:09 AM

Mudragada Padmanabham breathed his last in hospital due to respiratory illness

నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స 

శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన నేత 

సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం 

కాపు ఉద్యమానికే ముద్రగడ జీవితం అంకితం.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నిక 

రెండుసార్లు మంత్రిగానూ బాధ్యతలు 

నీతి, నిజాయితీలకు నిలువుటద్దం.. ముక్కుసూటి తత్వం.. అరుదైన ఆతిధ్యం.. నిత్యం అతిధులతోనే నివాసం.. 

ముద్రగడ మృతితో రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల్లో విషాద ఛాయలు   

నేడు కిర్లంపూడికి ముద్రగడ భౌతికకాయం.. అక్కడే అంత్యక్రియలు

కడసారి చూసేందుకు తరలివస్తున్న అభిమానులు

సాక్షి, కాకినాడ/గోకవరం/పిఠాపురం:  రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అవిశ్రాంత యోధుడి ఊపిరి ఆగిపోయింది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న కాపు నేత హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం సాయంత్రం పరిస్థితి విషమించింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కిర్లంపూడి నుంచి హుటాహుటిన హైదరాబాద్‌ పయనమయ్యారు. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి బుధవారం తరలించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానులు, ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

ముద్రగడకు ఇద్దరు కుమారులు ముద్రగడ వీరరాఘవరావు (బాలు), ముద్రగడ గిరిబాబు, కుమార్తె క్రాంతి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన  ప్రముఖ కాపు నేత మృతితో ఉమ్మడి గోదావరి జిల్లాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ముద్రగడ హఠాన్మరణంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, మంత్రులు, వైఎస్సార్‌ సీపీ నేతలు, వివిధ పార్టీల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి, ఏపీ రాజకీయాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కిర్లంపూడికి వెళ్లి ముద్రగడ భౌతికకాయాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. 

రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం 
ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడి గ్రామంలో వీరరాఘవరావు, సత్యవతి దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య స్వగ్రామమైన కిర్లంపూడిలో, ఎల్‌ఎల్‌సీ రాజమండ్రిలోని తన్నీరు బుల్లియ్య గురుకులంలో సాగింది. ముద్రగడది మొదటి నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తాతయ్య పద్మనాభం గ్రామానికి మునసబుగా పనిచేశారు. తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. వీర రాఘవరావు 1962, 1967 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  

రెండుసార్లు మంత్రిగా..
ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 1978లో ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాటాకు గుడిసె లేని నియోజకవర్గంగా అర్హులందరికీ 3 సెంట్లతో గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. 1989లో మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, చేనేత జౌళి శాఖ పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలిచారు.  

2024లో వైఎస్సార్‌సీపీలోకి.. 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన 2024 మార్చి 15న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలోకి చేరారు. వైఎస్సార్‌సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఆయన సేవలందించారు. నిష్పక్షపాత వైఖరి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు సంపాదించారు. సూటిగా మాట్లాడటం, అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పడం ముద్రగడ ప్రత్యేకత.  

కాపు ఉద్యమానికి కేరాఫ్‌ 
ముద్రగడ పేరు వినగానే గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్‌ ఉద్యమం. కాపులను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి నాయకత్వం వహించారు. సభలు, దీక్షలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలతో ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1994 జూలై 1న తన సతీమణి పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆరోగ్యం క్షీణించినా, తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, తన డిమాండ్‌ను వెనక్కి తీసుకోలేదు. 2014లో కిర్లంపూడి కేంద్రంగా మరోమారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 

ఈ ఉద్యమానికి రాష్ట్రం నలుమూలల నుంచి అనూహ్య మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా కాపు సంఘం నాయకులు గ్రామ గ్రామాన  రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్ష విరమింపజేసేందుకు టీడీపీ ప్రభుత్వం బలవంతంగా ముద్రగడను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి  తరలించింది. 2016లో కాపు రిజర్వేషన్‌ ఉద్యమం సందర్భంగా ఆయన చేపట్టిన నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా కాపు గర్జన చేపట్టారు. ఇందులో భాగంగా జనవరి 31, 2016న తునిలో కాపు గర్జన బహిరంగ సభ నిర్వహించారు. 

సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా అభిమానులు, కాపు నాయకులు తరలివచ్చారు. ముద్రగడ ఒక్కసారిగా రైల్‌రోకో చేపట్టడం, తదనంతరం రైలుకి నిప్పంటుకోవడంతో తుని ఘటన ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటన తర్వాత ఆయనతో పాటు పలువురు కాపు నాయకులపై కేసులు నమోదయ్యాయి. అనేక ఇబ్బందులు, ఆరోపణలు ఎదురైనా ఉద్యమాన్ని విడిచిపెట్టలేదు. కాపు రిజర్వేషన్‌పై ప్రభుత్వాలకు ఆయన అనేక లేఖలు రాశారు. పోస్టుకార్డుల ఉద్యమమూ నడిపారు.  

అరుదైన నాయకుడు 
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక సామాజిక వర్గం ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీకగా మారిన నాయకులు అరుదు. ముద్రగడ పద్మనాభం అలాంటి అరుదైన నాయకుల్లో ఒకరు. విజయాలు, పరాజయాలు, విమర్శలు, వివాదాలు, అన్నింటినీ ఎదుర్కొంటూ ఆయన సాగించిన రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది. 

మంత్రిగా కంటే ఉద్యమ నేతగా... రాజకీయ వేత్తగా కంటే కాపు ఆత్మగౌరవానికి ప్రతీకగా.. ముద్రగడ పద్మనాభం పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పలు పార్టీలతో అనుబంధం ఏర్పడినా, తన జీవితాంతం ప్రజా సమస్యలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం హక్కుల అంశంపైనే దృష్టి సారించారు. ఎప్పుడూ ఆ లక్ష్యం నుంచి ఆయన దృష్టి మారలేదు. సమస్యలపై తనదైన రీతిలో స్పందించడం ముద్రగడకు అలవాటు.  

ఆతిథ్యంలో చెరగని ‘ముద్ర’గడ..!  
ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరినీ అతి«థిగా చూడటంలో ముద్రగడకు సాటి మరొకరు ఉండరు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అల్పాహారం అయినా, భోజనం అయినా చేసి వెళ్లాల్సిందే. అల్పాహారంలోనూ, భోజనంలోనూ చాలా ప్రత్యేకతలుంటాయి. ఎంత మంది వచ్చినా అందరూ తిని వెళ్లే వరకు ఆయనే స్వయంగా దగ్గరుండి అందరినీ తిన్నారా..? లేదా..? అంటూ వాకబు చేసేవారు. ఆయన ఇంట్లో ప్రతి నిత్యం పదుల సంఖ్యలో భోజనాలు చేయాల్సిందే..

కేసులు... దీక్షలు..
1988లో టీడీపీ ప్రభుత్వం ఉత్తర కంచిలోని తన అనుచరులపై అక్రమంగా కేసులు బనాయించినప్పుడు వాళ్లకు మద్దతుగా ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్ కు కిర్లంపూడి నుంచి ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ప్రభుత్వం స్పందన లేకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దాంతో ప్రభుత్వం దిగివచ్చి అక్రమ కేసులు తొలగించింది.  

1993లో విజయభాస్కర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రావులపాలెంలో కాపులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. ఆ సమయంలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు.  

2005లో పోలవరం ఎడమ కాలువ, పుష్కరం ఎత్తిపోతల కోసం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచారు. భూమికి భూమి అనే నినాదంతో సొంత ఇంట్లో పక్కన ఒక తుపాకీ, తలకు రివాల్వర్‌ పెట్టుకొని ఆమరణ నిరాహార దీక్ష చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement