వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు
బోటు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఉంటే ఐదారుగురు బతికేవారు
కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం
ఇక్కడే కోస్ట్ గార్డులు, నేవీ, కలెక్టర్, కమిషనర్.. అందరున్నా ఎవరూ పట్టించుకోలేదు
20 గంటలపాటు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోక పోవడంతోనే దారుణం
చేసిన తప్పును కప్పిపుచ్చుకునేలా త్రిసభ్య కమిటీ నివేదిక
5వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఘటన గురించి తెలియదని బుకాయింపు
వాస్తవానికి ఈ ఘటనపై 4వ తేదీ రాత్రి 10.30 గంటలకే వాట్సాప్ మెసేజ్‌లు
ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాల వైపు కన్నెత్తి చూడలేదు
సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు, విపత్తులు, హోం మంత్రి అనిత పట్టించుకోలేదు
బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
బోటుకు బదులుగా కొత్త బోటు కొనివ్వాల్సిందే
లేదంటే మేం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోగా పరిహారమిస్తాం
బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది
వైఎస్సార్‌సీపీ హయాంలో 10 ఫిషింగ్‌హార్బర్లు, 6 ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లకు శ్రీకారం
చంద్రబాబు ప్రభుత్వం వాటిని స్కామ్‌లుగా మార్చేస్తోంది
ఘటన జరిగిన వెంటనే స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. ఇలాంటప్పుడు తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలో తప్పులు రాస్తున్నారు. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఎవరూ ఇంటికి రాలేదు. మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు.. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి.
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుందని మాట ఇస్తున్నా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఫిషింగ్ హార్బర్లు కళకళలాడుతుండేవి. సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. తద్వారా ఒక్కో ఫిషింగ్ హార్బర్‌లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఏకంగా 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50 శాతం రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. ఒక్కో బోటుకు 7-8 మందిని ఓనర్లు చేసే వాళ్లం. తద్వారా మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. ప్రభుత్వం మారడంతో ఫిషింగ్ హార్బర్లను అడ్డుపెట్టుకుని స్కామ్‌లు చేస్తోంది.
-వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: బోటు ప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. జూలై 4వ తేదీ మధ్యాహ్నం ప్రమాదం జరిగితే.. రాత్రి 7 గంటలకే సమాచారం అందించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం లేదంటూ త్రిసభ్య కమిటీ నివేదికలో పేర్కొనడం ద్వారా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం మరో తప్పు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రమాదానికి గురైన మత్స్యకార కుటుంబాలను సీఎంకానీ, సంబంధిత మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు కానీ పరామర్శించలేదని ఎత్తి చూపారు. బాధిత ఏడు కుటుంబాలకు ఒక్కొక్కరికి వెంటనే రూ.కోటి నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి గురైన బోటు స్థానంలో కొత్త బోటు కొనివ్వాలని, ప్రభుత్వం స్పందించకపోతే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోగా ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గంగవరం పోర్టుకు కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురి కుటుంబాలతోపాటు, ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నా కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. ఆ కుటుంబాలకు తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విశాఖలోని జబ్బర్‌తోట జంక్షన్ వద్ద మీడియాతో మాటా్లడారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం
ప్రభుత్వం ఎంత అన్యాయంగా, మానవత్వం లేకుండా ప్రవర్తించిందనే దానికి బోటు ప్రమాదం ఘటన అద్దం పడుతోంది. జూలై 1న చిన్నాతో పాటు మరో ఆరుగురు.. మొత్తం ఏడుగురు వేటకు బయలుదేరారు. జూలై 4న అంటే మూడు రోజుల తర్వాత చిన్న.. తన ఫోన్ నుంచి తన మేనల్లుడు గురునాథ్‌కు 2.31 గంటలకు (కాల్ డేటా చూపిస్తూ) ఫోన్ చేసి మరో గంటలో ఇంటికి వస్తున్నాం.. అని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఫోన్ చేసిన గంటకే తీవ్రమైన అలలతో బోటు మునిగింది. వీళ్లంతా కూడా బోటుపైకి ఎక్కారు. ఫోన్లు సముద్రంలో పడిపోయాయి. అక్కడి నుంచి వీరి హృదయ విదారక గాధ ప్రారంభమైంది. పట్టించుకునే వారు లేరు. 10 నాటికల్ మైళ్లు ఈత కొడితే తప్ప ఒడ్డుకు రారు. గంట గంటకు బోటు మునిగిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో బోటు కింది భాగంలో ఒక మనిషి చనిపోయాడు. మిగతా వారు అక్కడి నుంచి ఈత కొట్టడం మొదలు పెట్టారు. గంటలో ఇంటికి వస్తానన్న మనిషి 3 గంటలైనా రాకపోయే సరికి.. వీరి మేనల్లుడు తిరిగి ఫోన్లు చేయడం మొదలుపెట్టాడు. ఆ పక్కన ఫోన్లు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో వారి కుటుంబీకులు అధికారులకు విన్నవించే ప్రయత్నం చేశారు. రాత్రి 7 గంటలకు మత్స్యశాఖ అధికారులను కలిసి విన్నవించినా ఎవరూ స్పందించ లేదు. ఏడుగురు కలిసి వేటకు వెళితే ప్రమాదానికి గురై 20 గంటల పైచిలుకు సముద్రంతో యుద్ధం చేసి ఒక్కడే తిరిగొచ్చారు. ఆదుకోవాలని సమాచారమిచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఆదుకున్న పాపాన పోలేదు. సకాలంలో స్పందించి ఉంటే ఐదారుగురు బతికి ఉండేవాళ్లు. అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?
తోడుగా ఉన్నామన్న భరోసా ఏదీ?
ఇంత ఘటన జరిగితే సీఎం పట్టించుకోరు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చూసే ఈ జిల్లా వాసి అయిన మంత్రి కనీసం రాలేదు. ఇదే ఉత్తరాంధ్రకు చెందిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ఇంటికి కూడా రాలేదు. పైగా ఏమంటారో తెలుసా? వీడియో కాల్‌లో వీరి కుటుంబాలను పరామర్శించామని హోం మంత్రి అనితమ్మ అంటోంది. ఒక్కరంటే ఒక్కరు బాధ్యత గల స్థానాల్లో ఉన్న వారు పట్టించుకోలేదు. ఘటన జరిగిన వెంటనే స్పందించలేదని, ఇది మా తప్పే అని.. దానికి క్షమాపణ చెబుతున్నామని ఏ ఒక్కరూ అనలేదు. మనిషిని తీసుకురాలేక పోయినా.. మీకు తోడుగా ఉంటామని వారి కుటుంబ సభ్యులకు ఈ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పే పని చేయలేదు. ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి. పైగా ముష్టి వేసినట్టు ఎక్స్‌గ్రేషియా కింద రూ.5–10 లక్షలు ఇచ్చి సంకలు గుద్దుకుంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మత్స్యకారులు చనిపోతే నష్ట పరిహారం కింద రూ.5 లక్షలు ఇచ్చేవారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. అంటే వేటకు వెళ్లి ఎవరు చనిపోయినా వారి కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రూ.10 లక్షలకు పెంచాం. ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా దుర్ఘటన జరిగితే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇచ్చేవారం. ఇప్పుడు ప్రభుత్వం సకాలంలో స్పందించకుండా తప్పు చేసిన సమయంలో రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటామంటే ఇది న్యాయమేనా? ధర్మమేనా? 
విశాఖపట్నం విమానాశ్రయం వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలంటే.. ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలంటే.. అధికారులకు ఒక షాక్ తగిలితే తప్ప స్పందన అనేది రాదు. సీరియస్‌గా చర్యలు ఉంటాయనేది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అనేది రోల్‌మోడల్‌గా ఉండాలి. తప్పుచేసే ప్రభుత్వం ఉండకూడదు. చనిపోయిన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారమివ్వాలి. బాధిత కుటుంబంతో కలిసి మొత్తం ఏడుగురికి ప్రతి ఒక్కరికీ రూ.కోటి ఇవ్వాలి. కొత్త బోటు ఇవ్వాలి. కనీసం వీరిని చూసేందుకు కూడా ఇంటికి రాలేదు. కనీసం మానవత్వం లేని ప్రభుత్వం. వీరి కుటుంబ సభ్యులకు అందరికీ చెబుతున్నా.. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎవ్వరూ భయపడొద్దు. బాధపడొద్దు. కళ్లు మూసి కళ్లు తెరిచేలోగా మూడేళ్లు గడుస్తాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం ఈ కుటుంబాలకు తోడుగా ఉంటుంది. ఒక్క నెల రోజుల్లోగా మేలు చేస్తుంది. నాదీ బాధ్యత. కచ్చితంగా చేయిస్తామని మాట ఇస్తున్నా.
సొంత కాళ్లపై నిలబడేందుకు...
మత్స్యకారులు ఎక్కడెక్కడికో వెళ్లి నిర్బంధాలకు గురికాకూడదని, ఇటువంటి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టాలని మన హయాంలో మత్స్యకారుల కోసం ఏకంగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించాం. నెల్లూరు జిల్లాలో జువ్వలదిన్నె, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో ఉప్పాడ, శ్రీకాకుళం జిల్లాలో బుడగట్ల పాలెం, మంచినీళ్ల పేట, అనకాపల్లి జిల్లాలో పూడిమడక, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, ఓడరేవు, పశ్చిమగోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప.. ఇలా 10 ఫిషింగ్ హార్బర్లకు శ్రీకారం చుట్టి వేగంగా పనులు చేయడం మొదలుపెట్టాం. ఇవి కాకుండా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట, దొండవాక, ఉప్పల్లంక, రాయదరువు ప్రాంతాల్లో పనులు చేయించడానికి శ్రీకారం చుట్టాం. మనవాళ్లకు ఫిషింగ్ హార్బర్లు అందుబాటులోకి వస్తున్నందున సబ్సిడీతో బోట్లు కొనివ్వాలని భావించాం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఒక్కో ఫిషింగ్ హార్బర్‌లో 10 వేల బోట్లు తిరుగుతుండేవి. ఒక్కో బోటుకు 7–8 మందిని ఓనర్లు చేసి.. ఏకంగా 50% రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు ఇచ్చి, మరో 50% రుణం ఇప్పించి వీళ్లందరికీ మంచి చేయాలని భావించాం. దీంతో మత్స్యకార కుటుంబాల్లో గొప్ప అడుగు ముందుకు పడి ఉండేది. 
మత్స్యకారులను పరామర్శించిన అనంతరం విశాఖలోని జబ్బర్ తోట జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రభుత్వం మారింది.. స్కామ్‌లు జరుగుతున్నాయి
రాష్ట్ర ప్రభుత్వం మారడంతో ఈ రోజు ఏం జరుగుతోందంటే.. ఆ ఫిషింగ్ హార్బర్లను స్కామ్‌లుగా మారుస్తూ అమ్ముతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు ద్వారా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు బోట్లు కొనిచ్చి, ఆ బోట్ల పార్కింగ్ కోసం వాడాల్సిన ప్రాంతాన్ని ప్రైవేటుకు కట్టబెట్టడం ద్వారా స్కామ్‌లు చేస్తూ చంద్రబాబు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది.
మత్స్యకారులకు వేధింపులు
మన ప్రభుత్వంలో పలాస ఎమ్మెల్యే, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఘటన చూస్తే.. మత్స్యకారులను ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం హింసిస్తోందో తెలుస్తుంది. సీదిరి అప్పలరాజు 18 ఏళ్ల కొడుకు బైకు నడుపుతూ దురదృష్టవశాత్తు ఢీకొట్టడంతో ఒక మనిషి చనిపోయారు. చేసింది కరెక్ట్ అని నేను చెప్పను. అయితే ప్రభుత్వం ఏకంగా మర్డరు కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేసింది. చివరకు జడ్జి జోక్యం చేసుకుని మర్డర్ కేసు ఎలా పెడతారయ్యా..అని తిట్టి సెక్షన్లు మార్పించారు. ఎంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఆలోచించాలని కోరుతున్నా. జువ్వలదిన్నెలో తమిళనాడు నుంచి బోటు వచ్చి మన మత్స్యకారులను ఇబ్బంది పెడుతుంటే.. ఆ బోటును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ బోటును విడిపించింది ఎవరో తెలుసా టీడీపీకి చెందిన వీళ్లే. నెల్లూరు జిల్లాకు లోకేశ్ వెళతారు. ఆ మరుసటి రోజు బోటు రిలీజ్. పోలీస్‌స్టేషన్‌లో పెట్టిన బంగారం దొంగతనం అయినట్టుగా బోటు మాయమైపోతుంది. దానికి కారణం ఎవ్వరయ్యా అంటే లోకేశ్, అదే టీడీపీకి చెందిన ఓ రాజ్యసభ ఎంపీ.
ప్రమాదం జరిగిన జూలై 4న రాత్రి 10:30 గంటలకే మత్స్యకార సంఘం నేత వాసుపల్లి జానకీరామ్ కలెక్టర్‌కు మెసేజ్ పంపగా..‘వెంటనే పరిశీలిస్తాం’ అంటూ కలెక్టర్ స్పందన
తప్పు చేసి.. ఆపై తప్పించుకునే యత్నం
రాత్రి 10.30 గంటలకు అసోసియేషన్ అధ్యక్షుడు జానకీరాం.. కలెక్టర్‌కు, మెరైన్ సీఐకి మెసేజ్ (మెసేజ్ చూపిస్తూ) పెట్టారు. గంగవరం పోర్టుకు సమీపంలో బోటు ప్రమాదం జరిగిందని తెలుపుతూ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. విశాఖలో తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రం ఉంది. అంటే ఇక్కడే నేవీ ఉంది. కోస్ట్‌గార్డు ఉంది. విశాఖలో హెలికాప్టర్లు ఉన్నాయి. కలెక్టర్లు, కమిషనర్లు ఉన్నారు. ఇంత మంది ఇక్కడే ఉండీ.. కేవలం 10 నాటికల్ మైళ్ల దూరం వెళితే వీళ్లను కాపాడుకునే పరిస్థితి ఉండేది. కనీసం 5వ తేదీ ఉదయం 7 గంటలకు మనుషులు వచ్చి ఉంటే కనీసం 5–6 మంది బతికి ఉండేవాళ్లం అని చిన్నా చెబుతున్నారు. అంటే ఎవ్వరూ రాలేదు. చివరకు దేవుడి దయతో చిన్నాను చైనీస్ బోటు వాళ్లు చూసి పొద్దున 8.30 గంటలకు రక్షించారు. ఇక్కడ స్పందించాల్సిన కలెక్టర్, ప్రభుత్వం, కమిషనర్.. ఎవ్వరూ స్పందించలేదు. ఎవరూ కో ఆర్డినేట్ చేయలేదు. ప్రభుత్వంలో ఏ పెద్దలూ స్పందించలేదు. తప్పు జరిగిందని ఒప్పుకోకుండా.. త్రిసభ్య కమిటీ నివేదికలో దొంగ మాటలు చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు జూలై 5న ఉదయం 5 గంటల వరకు తమకు సమాచారం అందించలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు. సరైన సమయంలో స్పందించకపోవడం తప్పు అయితే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు త్రిసభ్య కమిటీ నివేదికలోనూ తప్పులు రాస్తున్నారు.
గల్లంతైన ఘటనపై మత్స్యకారుల కుటుంబాలకు జూలై 5న ఉదయం 5గంటలకు సమాచారం అందినట్లు పేర్కొన్న త్రిసభ్య కమిటీ నివేదిక
వైఎస్సార్‌సీపీ, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా ఇదీ
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందనేందుకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. 2023 నవంబర్‌లో విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 49 బోట్లు కాలిపోతే ఏకంగా బోటు విలువలో 80 శాతం విలువ కట్టి.. రూ.7.11 కోట్లు వెంటనే విడుదల చేశాం. సుమారు 400 మంది మత్స్యకార హమాలీలు, కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున సహాయం అందించాం. 2018లో నా పాదయాత్ర జరుగుతున్నప్పుడు 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకున్నారు. వారి కుటుంబాల వారు వచ్చి నన్ను కలిశారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన చొరవతో కేంద్ర ప్రభుత్వం దౌత్యం జరిపింది. ఫలితంగా 2020 జనవరి 5వ తేదీన ఆ 22 మంది మత్స్యకారులను తీసుకు రావడమే కాకుండా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలు వారి చేతిలో పెట్టి జీవనాధారం చూపించింది. 2019లో మత్స్యకారులు వేటకు వెళ్లి బంగ్లాదేశ్ నిర్బంధానికి లోనైతే కేంద్రం ద్వారా దౌత్యం చేసి తొమ్మిది మందిని సురక్షితంగా ఇళ్లకు చేర్చింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.
ఎవరూ సంతోషంగా లేరు
రాష్ట్రంలో ప్రతిదీ ఇలాగే ఉంది. రాష్ట్రంలో ఈ రోజు పిల్లలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ అందడం లేదు. స్కూళ్లు అన్యాయంగా తయారయ్యాయి. గోరుముద్ద కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. పిల్లలకు కనీసం బ్యాగులు, బూట్లు, పుస్తకాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ దారుణంగా తయారైంది. పేదవాడికి వైద్యం అందడం లేదు. రైతులకు ఏ పంటకూ మద్దతు ధర అందక రోడ్డు ఎక్కే పరిస్థితి. ఉచిత పంటల బీమా, ఆర్‌బీకేలు ఎగిరిపోయాయి. సూపర్ సిక్స్‌లు, సూపర్ సెవెన్లు అంటూ ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వచ్చి సంతకాలు పెట్టి, బాండ్లు ఇచ్చి.. ఆపై మోసాలుగా మార్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో చంద్రబాబు ఆటలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బాధిత ప్రజలందరికీ మేము అన్ని రకాలుగా తోడుంటాం. పార్టీ పరంగా చేయగలిగిన సహాయం చేస్తాం’ అని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ స్పీకరు తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీ తనూజ రాణి, జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.


