హ్యూమరమరాలు
ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంటర్వ్యూ....
‘మూడు క్వశ్చన్‌లు అడుగుతాను. వాటికి కరెక్ట్ ఆన్సర్ చెబితే నీకే ఉద్యోగం’ అన్నాడు మేనేజర్.
‘ఓకే సార్’ వినయంగా బదులిచ్చాడు జ్ఞానసాగర్.
‘హైదరాబాద్‌లో అమీర్‌పేట తరువాత వచ్చే గుట్ట పేరు?’
‘పంజాగుట్ట సార్’ అని వెంటనే బదులిచ్చాడు జ్ఞానసాగర్.
‘అమేజింగ్ నాలెడ్జ్. రెండో క్వశ్చన్....
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఏ సిటీలో ఉంది?’ అడిగాడు మేనేజర్.
‘సికింద్రాబాద్ సిటీలో సార్’ వేగంగా బదులిచ్చాడు జ్ఞాసా.
‘మైండ్ బ్లోయింగ్ నాలెడ్జ్. లాస్ట్ క్వశ్చన్‌కు ఆన్సర్ చెబితే... ఉద్యోగం నీకే. ఎల్ నినో అంటే ఏమిటి?’ అడిగాడు మేనేజర్. ఆ కొశ్చన్‌కు ఆన్సర్ జ్ఞా.సాకు తెలియదు.
అయితే అతడికి తాను చదివిన ‘అతి తెలివికి అరవై మెట్లు’ అనే వ్యక్తిత్వ వికాస పుస్తకంలోని వాక్యం గుర్తుకు వచ్చింది. ఆ వాక్యం...‘నాకు తెలియదు అనే మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. నోటికొచ్చింది ఏదో ఒకటి ఆశువుగా చెప్పేయాలి. అది విజేతల సక్సెస్‌మంత్ర’
‘ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆన్సర్ తెలియదా?’ చేతికి ఉన్న వాచ్‌లో టైమ్ చూసుకుంటూ అన్నాడు మేనేజర్. ‘ఎల్ నినో అంటే తెలియక పోవడం ఏమిటి సార్... చెబుతాను. ఎల్ అంటే ఆంగ్ల వర్ణమాలలో పన్నెండవ అక్షరం. నినో అంటే గ్రీక్ భాషలో నో అని అర్థం’ అని చెప్పాడు జ్ఞానసాగర్.
మేనేజర్ కళ్లు బైర్లుకమ్మాయి. ఆ తరువాత టైర్లు కమ్మాయి.
‘మూడు క్వశ్చెన్స్ అడుగుతాను. వాటికి కరెక్ట్ ఆన్సర్ చెబితే నీకే ఉద్యోగం’ అంటూ మొదటి క్వశ్చన్ అడిగాడు మేనేజర్: ‘తాజ్‌మహల్ ఉన్న ఏకైక దేశం?’
‘ఇండియా సార్’ అని ఉత్సాహంగా జవాబు చెప్పాడు లోక్యాష్.‘స్టన్నింగ్ నాలెడ్జ్. రెండో క్వశ్చన్... చేపలు నీటిలో మాత్రమే ఎందుకు ఉంటాయి?’ అడిగాడు మేనేజర్.
లోక్యాష్: బయటికి వస్తే బతకలేవు కాబట్టి.
‘ఫెంటాస్టిక్ నాలెడ్జ్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఎల్ నినో అంటే ఏమిటి?’ అడిగాడు మేనేజర్.
‘ఎల్ నినో అనేది మన దేశంలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు సార్’ అన్నాడు లోక్యాష్.
అమెరికా ఇరాన్ మీద విసిరేసిన బాంబు డైరెక్టర్‌గా తన తల మీద పడ్డట్టు అదిరిపడ్డ మేనేజర్,
‘ఎల్ నినో అంటే పారిశ్రామికవేత్త పేరేమిటయ్యా’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
‘అవును సార్. నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ఎల్– నినో(nజీnౌ) గారి పూర్తి పేరు....లంబసింగి(ఎల్) నిమ్మకాయల(ఎన్) ఇంద్రసేన(ఐ) నారాయణ(ఎన్) ఓబులేష్(వో). అందరూ షార్ట్ కట్‌లో ఎల్ నినో అని పిలుస్తారు’ అని చెప్పాడు లోక్యాష్!
మేనేజర్: నీ పేరు?
షా.కు: షాకింగ్ కుమార్ సార్. మా నాన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తారు. అందుకే నా పేరు అలా పెట్టారు.
‘రెండే క్వశ్చన్‌లు అడుగుతాను. మొదటి క్వశ్చన్... గోడకు సున్నాలు వేయడానికి కారణం ఏమిటి?’ అడిగాడు మేనేజర్.
‘కన్నాలు వేస్తే బాగుండదు కాబట్టి’ అని జవాబు ఇచ్చాడు షా.కు
‘ఔట్‌స్టాండింగ్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్....ఎల్ నినో అంటే ఏమిటి?’ అడిగాడు మేనేజర్.
‘ఎల్ నినో అనేది ఆఫ్రికాలోని అరుదైన వంటకం పేరు. ఆయిల్‌తో చేయవచ్చు. వితవుట్ ఆయిల్ చేయవచ్చు. స్టవ్ మీద చేయవచ్చు. స్టవ్ లేకుండా కూడా చేయవచ్చు...’ చెప్పుకుంటూ పోతున్నాడు షా.కు.
ఇది విని షాకై పోయినా మేనేజర్ 108కి ఫోన్ చేసి...
‘అయ్యా! నా పరిస్థితేమీ బాగోలేదు. వెంటనే బయలు దేరండి’ అని కుప్పకూలిపోయాడు.
– యాకుబ్ పాషా


