breaking news
humorous
-
ఎల్ నినో అనగా...
ఒక కార్పొరేట్ కంపెనీలో ఇంటర్వ్యూ....‘మూడు క్వశ్చన్లు అడుగుతాను. వాటికి కరెక్ట్ ఆన్సర్ చెబితే నీకే ఉద్యోగం’ అన్నాడు మేనేజర్.‘ఓకే సార్’ వినయంగా బదులిచ్చాడు జ్ఞానసాగర్. ‘హైదరాబాద్‌లో అమీర్‌పేట తరువాత వచ్చే గుట్ట పేరు?’‘పంజాగుట్ట సార్’ అని వెంటనే బదులిచ్చాడు జ్ఞానసాగర్.‘అమేజింగ్ నాలెడ్జ్. రెండో క్వశ్చన్....సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఏ సిటీలో ఉంది?’ అడిగాడు మేనేజర్.‘సికింద్రాబాద్ సిటీలో సార్’ వేగంగా బదులిచ్చాడు జ్ఞాసా.‘మైండ్ బ్లోయింగ్ నాలెడ్జ్. లాస్ట్ క్వశ్చన్‌కు ఆన్సర్ చెబితే... ఉద్యోగం నీకే. ఎల్ నినో అంటే ఏమిటి?’ అడిగాడు మేనేజర్. ఆ కొశ్చన్‌కు ఆన్సర్ జ్ఞా.సాకు తెలియదు. అయితే అతడికి తాను చదివిన ‘అతి తెలివికి అరవై మెట్లు’ అనే వ్యక్తిత్వ వికాస పుస్తకంలోని వాక్యం గుర్తుకు వచ్చింది. ఆ వాక్యం...‘నాకు తెలియదు అనే మాట నీ నోటి నుంచి ఎప్పుడూ రాకూడదు. నోటికొచ్చింది ఏదో ఒకటి ఆశువుగా చెప్పేయాలి. అది విజేతల సక్సెస్‌మంత్ర’‘ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆన్సర్ తెలియదా?’ చేతికి ఉన్న వాచ్‌లో టైమ్ చూసుకుంటూ అన్నాడు మేనేజర్. ‘ఎల్ నినో అంటే తెలియక పోవడం ఏమిటి సార్... చెబుతాను. ఎల్ అంటే ఆంగ్ల వర్ణమాలలో పన్నెండవ అక్షరం. నినో అంటే గ్రీక్ భాషలో నో అని అర్థం’ అని చెప్పాడు జ్ఞానసాగర్.మేనేజర్ కళ్లు బైర్లుకమ్మాయి. ఆ తరువాత టైర్లు కమ్మాయి.‘మూడు క్వశ్చెన్స్ అడుగుతాను. వాటికి కరెక్ట్ ఆన్సర్ చెబితే నీకే ఉద్యోగం’ అంటూ మొదటి క్వశ్చన్ అడిగాడు మేనేజర్: ‘తాజ్‌మహల్ ఉన్న ఏకైక దేశం?’‘ఇండియా సార్’ అని ఉత్సాహంగా జవాబు చెప్పాడు లోక్యాష్.‘స్టన్నింగ్ నాలెడ్జ్. రెండో క్వశ్చన్... చేపలు నీటిలో మాత్రమే ఎందుకు ఉంటాయి?’ అడిగాడు మేనేజర్.లోక్యాష్: బయటికి వస్తే బతకలేవు కాబట్టి.‘ఫెంటాస్టిక్ నాలెడ్జ్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. ఎల్ నినో అంటే ఏమిటి?’ అడిగాడు మేనేజర్.‘ఎల్ నినో అనేది మన దేశంలోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త పేరు సార్’ అన్నాడు లోక్యాష్.అమెరికా ఇరాన్ మీద విసిరేసిన బాంబు డైరెక్టర్‌గా తన తల మీద పడ్డట్టు అదిరిపడ్డ మేనేజర్,‘ఎల్ నినో అంటే పారిశ్రామికవేత్త పేరేమిటయ్యా’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.‘అవును సార్. నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్. ఎల్– నినో(nజీnౌ) గారి పూర్తి పేరు....లంబసింగి(ఎల్) నిమ్మకాయల(ఎన్) ఇంద్రసేన(ఐ) నారాయణ(ఎన్) ఓబులేష్(వో). అందరూ షార్ట్ కట్లో ఎల్ నినో అని పిలుస్తారు’ అని చెప్పాడు లోక్యాష్!మేనేజర్: నీ పేరు?షా.కు: షాకింగ్ కుమార్ సార్. మా నాన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అందుకే నా పేరు అలా పెట్టారు.‘రెండే క్వశ్చన్లు అడుగుతాను. మొదటి క్వశ్చన్... గోడకు సున్నాలు వేయడానికి కారణం ఏమిటి?’ అడిగాడు మేనేజర్.‘కన్నాలు వేస్తే బాగుండదు కాబట్టి’ అని జవాబు ఇచ్చాడు షా.కు‘ఔట్‌స్టాండింగ్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్....ఎల్ నినో అంటే ఏమిటి?’ అడిగాడు మేనేజర్.‘ఎల్ నినో అనేది ఆఫ్రికాలోని అరుదైన వంటకం పేరు. ఆయిల్‌తో చేయవచ్చు. వితవుట్ ఆయిల్ చేయవచ్చు. స్టవ్ మీద చేయవచ్చు. స్టవ్ లేకుండా కూడా చేయవచ్చు...’ చెప్పుకుంటూ పోతున్నాడు షా.కు.ఇది విని షాకై పోయినా మేనేజర్ 108కి ఫోన్ చేసి...‘అయ్యా! నా పరిస్థితేమీ బాగోలేదు. వెంటనే బయలు దేరండి’ అని కుప్పకూలిపోయాడు.– యాకుబ్ పాషా -
రచయిత రాంబాబుగాడి సూపర్ సూపర్ సీన్లు! హీరో గారికి ఎలివేషన్లూ...!!
రచయిత రాంబాబుతో స్టోరీ డిస్కషన్స్‌కు కూర్చున్నాడు డైరెక్టర్ వైవై చంద్రమౌళి. ఓ అద్భుతమైన మదర్ సెంటిమెంట్, రొమాంటిక్ లవ్ స్టోరీతో కూడిన ఫుల్ యాక్షన్ మూవీ కోసమే ఈ సిట్టింగ్. హీరోకు మంచి మంచి ఎలివేషన్లతో పాటు... హీరో మదర్‌తో ఓ సెంటిమెంట్ సీనూ, హీరోయిన్‌తో రొమాంటిక్ సీనూ ఎట్సెట్రాలతో పాటు సినిమా అసలు థీమ్ కూడా చె΄్పాలని కోరాడు. అంతే... డైవ్ చేస్తున్నట్టుగా తన రచనలోకి ఎగిరి దూకాడు... మా రాంబాబుగాడు.హీరోగారి అమ్మతో సెంటిమెంట్ సీన్..అమ్మకు జ్వరం. అర్జెంటుగా టాబ్లెట్ వేయాలి. పుక్కిలించడానికి వేణ్ణీళ్లూ కావాలి. కాస్త చాయ్ కూడా పెట్టివ్వాలి. హార్మూజ్ జలసంధిలో మన నౌకలు చిక్కుకోవడంవతో గ్యాస్ సిలెండర్ల కొరత! ఏం చేయాలో తోచలేదు మన హీరో పరాక్రమ్ రాథోడ్‌కి. మనసులో ఓ ఐడియా మెదిలింది. కాకినాడ సముద్రపు ఒడ్డున మన కేజీ బేసిన్లో అపార గ్యాస్ నిల్వలు ఉన్న విషయం గుర్తొచ్చింది. అంతే... తమ ఇంటి బాల్కనీలోంచి ఓ పైప్‌ను అమాంతంగా విసిరాడు. అది కాస్తా వెళ్లి సముద్రప్పొరల్లో గ్యాస్ ఉన్న చోటికి దూసుకెళ్లింది. పైపు రెండో చివరను గ్యాస్ స్టవ్ దగ్గర అమర్చాడు పరాక్రమ్. అంతే... చాయ్ తయార్.... వేణ్ణీళ్లూ రెడీ. గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించి, చల్లటి నీళ్లతో టాబ్లెట్ వైసుకుని, వేడి వేడి చాయ్ తాగి సేదదీరింది హీరో వాళ్ల అమ్మ. ఆమె కళ్లనుంచి రెండు బొట్ల ఆనందబాష్పాలు! వేడిగా అవి హీరోను తాకడంతో ‘‘ఏంటమ్మా ఇదీ?’’ కాస్త కోపం నటిస్తూ అడిగాడు పరాక్రమ్.‘‘ఇవి వెచ్చటి నా ఆ΄్యాయతా, గోరువెచ్చటి ఆపేక్ష రా. వాటికా వేడి ఎలా వచ్చిందో తెల్సా? కేజీ బేసిన్ నుంచి నువ్వు తెప్పించిన గ్యాస్‌తో కాచిన వేడి చాయ్ తాగాకే రా’’ వాత్సల్యంగా హీరో పరాక్రమ్ తల నిమురుతూ చెప్పింది అమ్మ.హీరోయిన్‌తో డ్యూయెట్ కోసం ప్రిపరేటరీ సీన్..హీరోయిన్ తలస్నానం చేసి తలారబెట్టుకుంటోంది. పొడవాటి కురులు కావడంతో ఒక పట్టాన జుట్టు ఆరడం లేదు. హీరోయిన్ విసుక్కోవడం వినిపించింది పరాక్రమ్‌కు. అంతే... మూణ్ణాలుగు హెలికాప్టర్లు హీరోయిన్ చుట్టూ ఏటవాలుగా రౌండు రౌండుగా రౌండ్లు కొడుతూ తమ నెత్తిమీది ఫ్యాన్ల గాలి హీరోయిన్ నెత్తిమీది కురులకు తగిలేలా తిరుగాడసాగాయి. హీరోయిన్ హీరోవైపు మెచ్చుకోలుగా, ఆరాధనగా, గోముగా... ఇత్యాది అనేక భావాలతో చూసింది. అంతే... ఆ వెంటనే సాంగుకు అవసరమైన సిచ్యువేషన్ రెడీ!హీరో: చాపర్ గాలికి ఆరేనా... కాపర్ గోల్డ్ నీ కురులుహీరోయిన్: ఆఫర్ చేస్తా నీలాలు... కప్పుకో జోరుగా తడికేశాలు హీరో: లేజర్లాంటి కళ్లతో సూపర్‌గా నన్ను చూడకలాహీరోయిన్: గ్లేజర్లా నువ్వు అదేపనిగ పొగడకిలా.... అంటూ సాంగ్ షురూ!సినిమా స్టోరీ అండ్ ఓ యాక్షన్ సీక్వెన్స్..హీరో ఓ గూఢచారి. హీరోయిన్ అన్న కూడా మన హీరో ఫ్రెండే. అతడు హార్మూజ్ జలసంధిలో చిక్కుకున్న ఒక ఓడలో డ్యూటీ చేస్తున్నాడు. ఆ షిప్పును బాంబులతో పేల్చేసే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. తన అన్నను రక్షించమని కోరింది హీరోయిన్. అంతే... తన ఫ్రెండును రక్షించుకోడానికి బయల్దేరాడు హీరో.‘‘సముద్రంలో ఎక్కడో చిక్కుకున్న ఓడ వరకు హీరో చేరాలి. ఎలా?’’ అడిగాడు డైరెక్టర్ వైవై చంద్రమౌళి.‘‘ఓ పని చేద్దాం సార్. గతంలో ఎప్పుడో వలలో చిక్కుకున్న ఓ డాల్ఫిన్‌ని హీరో రక్షిస్తాడు. నీళ్లలోకి దూకి ్రపాణాలకు తెగించి సముద్రంలో ఈదుతూ ఆ వలను కత్తితో కోస్తాడు. ఆ కృతజ్ఞతతో ఇప్పుడు తన అనుచరులందరినీ మంద మందగా తీసుకొస్తుంది మెయిన్ డాల్ఫిన్. సముద్రంలో ఈదుతూ ఒకదాని తర్వాత ఒకటిగా పైకి వస్తూ... నీళ్ల మీద వాటి వీపులు బయటికొచ్చేలా ఫాస్ట్‌గా వెళ్లిపోతుంటాయి డాల్ఫిన్లు. హీరో ఆ వీపుల మీద అడుగులేస్తూ పరుగులు పెడతాడు. సరిగ్గా హీరోగారు గబగబా కాలేసే చోటే సర్ఫేస్ అవుతూ హీరోను చకచకా ఓడ వరకు చేరుస్తాయవి. హీరోయిన్ అన్నను రక్షించాక ఆ ఇద్దరూ ఒడ్డుకు మళ్లీ అలాగే చేరతారు. హీరోయిన్ కూడా సముద్రపు ఒడ్డుకు వచ్చి వాళ్లతో కలిసి అలా జాగింగ్ చేస్తున్నట్టు పరుగెడుతుండగా... వైవై చంద్రమౌళి అనే రౌండు రబ్బర్‌స్టాంపు తెరపై బలంగా పడుతుండటమే క్లైమాక్స్’’ అంటూ యాక్షన్ సీక్వెన్స్ వివరించాడు రాంబాబు.సీన్లు విన్న నెక్స్ట్ మొమెంట్... సిట్టింగ్లోని వారు తమ రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని అమాంతంగా కృష్ణానగర్ వైపుగా కొందరు, ఫిల్మ్‌నగర్ వైపు మరికొందరు పారిపోవడం కనిపించింది.– యాసీన్ -
బోరబండలో డొనాల్డ్ ట్రంప్!
హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అని తన పేరు పెట్టారనే విషయం తెలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి వంద ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీగా ఇంటికొచ్చినంతగా సంతోషించాడు. ఆ సంతోషంలో... ‘అర్జంటుగా హైదరాబాద్‌కు వెళ్లాలనుకుంటున్నాను. ప్రయాణ ఏర్పాట్లు చేయండి’ అని సిబ్బందిని ఆదేశించాడు. విమానం ఎక్కడానికి ముందు ‘30 రోజుల్లో తెలంగాణ భాష–యాస’ అనే పుస్తకాన్ని బట్టీ పట్టాడు ట్రంప్. కొన్ని రోజుల్లోనే తెలుగు భాషపై గట్టి పట్టు సంపాదించి గ్రేట్ అనిపించుకున్నాడు.హైదరాబాద్‌లో ట్రంప్.... ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ అనే బోర్డ్‌ను చూస్తూ నాన్‌స్టాప్‌గా ఆనందించాడు. ఆ తరువాత... ‘మారు వేషంలో గల్లీ గల్లీ తిరగాలనుకుంటున్నాను. నో సెక్యూరిటీ గిక్యూరిటీ’ అన్నాడు ట్రంప్.‘సార్...ప్రాబ్లం అవుతుందేమో!’ అన్నారు అమెరికా నుంచి వచ్చిన హై ప్లస్ సెక్యూరిటీ వాళ్లు. ‘ఐ లవ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమే నాప్రాణం. ప్రాబ్లమే నా ప్రతిబింబం. ప్రాబ్లమే నా సుడిగుండం. ప్రాబ్లమే నా అగ్నిగుండం. ప్రాబ్లమ్ లేకుండా నేనే లేను’ కవితాత్మకంగా అన్నాడు ట్రంప్.‘సరే... తమరి ఇష్టం’ అన్నారు సెక్యూరిటీ వాళ్లు.ఒక సాధారణ రైతు వేషంలో హైదరాబాద్‌లో తిరుగుతున్న ట్రంప్ బోరబండలోని ‘పీపీటీ–పీపాలకు పీపాలు తాగండి’ అనే జనతా బార్ దగ్గర ఆగాడు. మందుబాబులు బార్లో కాదు... రోడ్డు మీద, రోడ్డు పక్కన, చెట్టు కింద, చెట్టు పైనా... ఎక్కడ పడితే అక్కడ మందు తాగుతూ కనిపించారు.వారిని ఆసక్తిగా గమనిస్తున్నాడు ట్రంప్. ఇంతలో దూరం నుంచి ఒక మందుబాబు పరుగెత్తుకు వచ్చి... ‘అన్నా... నువ్వు ఇక్కడున్నవా... నీ కోసం వెదుకని స్టేట్ లేదు. ఊరు లేదు’ అని ట్రంప్ మీద పడి ఏడ్వడంప్రారంభించాడు. ‘నేను నీ అన్నేమిటీరా... లిక్కరికీ కిరికిరీ. నోర్ముస్కొని పో’ అని గద్దించాడు ట్రంప్.‘ఒరేయ్ ఎంకులు, శ్రీను, ఎంకటేశ్వర్లు, గుర్నాదం... ఒకసారి ఇటొచ్చేయండి’ అని గట్టిగా అరిచాడు మందుబాబు. అంతే... సాటి మందుబాబులు పరుగెత్తుకు వచ్చారు. ‘ఇన్ని రోజులు ఎక్కడికి బోయినవు అన్నా... మేమెట్ల బతకాలే అన్నా... నిన్ను చూస్తే బోనాల పండుగ ముందుగాల్నే వచ్చినట్లుంది’ అని ట్రంప్‌ను గట్టిగా పట్టుకున్నారు ఆ నలుగురు.ఇంతలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ‘ఏందిరా మీ లొల్లి?’ అని గద్దించాడు.‘ఈయన మా అన్న నర్సింగ్. రెండు సంవత్సరాల కింద ఇంట్ల నుంచి పారిపోయిండు. ఇప్పుడు దొరికిండు’ అన్నాడు గుర్నాదం.‘ఈనే మీ అన్న అని గ్యారెంటీ ఏమిటీ?’ అడిగాడు కానిస్టేబుల్. సెల్‌ఫోన్ ఫొటోగ్యాలరీలో పాత ఫోటోలు చూపించాడు శ్రీను.‘ఏమయ్యా పెద్ద మనిషి... ఈ ఫోటోలలో ఉన్నది నువ్వే కదా! ఎందుకు అబద్దం ఆడుతున్నవు?’ అని ట్రంప్‌పై చిరాకు పడ్డాడు కానిస్టేబుల్.‘మిస్టర్ కానిస్టేబుల్... సేమ్ టు సేమ్ ఉండే వ్యక్తులు లోకంలో ఏడుగురు ఉంటారు అనే స్మాల్ విషయం నీకు తెలియదా?’ కానిస్టేబుల్‌పై కన్నెర్ర చేశాడు ట్రంప్. ట్రంప్ కోపాన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు కానిస్టేబుల్.‘అన్నా... నువ్వు చీపు లిక్కర్ తాగక చానా రోజులైంది’ అంటూ అపురూప మద్యాన్ని ట్రంప్‌తో బలవంతంగా తాగించారు ఆ నలుగురు. అంతే... శ్రీ ట్రంప్‌కు క్షణాల్లో పద్నాలుగు లోకాలు, సమస్త జీవరాసులు, నక్షత్రమండలాలు, ఉల్కలు, అంతరించి పోయిన డైనోసర్లు, గ్రహాంతర జీవులు కనిపించాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కూడా కనిపించింది!!! – యాకుబ్ పాషా -
రాంబాబుగాడి రంధ్రాన్వేషణ(లు)!
‘‘మీ గుండెకు చిల్లు పడింది’’ అని డాక్టర్ చెప్పగానే వెంటనే రాంబాబు గాడు అన్న మొదటి మాట ఏమిటో తెలుసా?‘‘చిల్ బ్రో’’ అంటూ కూల్‌గా వ్యాఖ్యానించాడు వాడు. ‘‘అదేంట్రా గుండెకు చిల్లు అంటే చిల్ అంటావేంటి?’’ ఆశ్చర్యపోయాన్నేను. చిల్లు మహత్యం గురించి ఓ స్పీచ్ ఇచ్చాడు రాంబాబుగాడు. వాడి పాయింటాఫ్ వ్యూ నుంచి చెప్పాలంటే... → మనిషికి ఆల్రెడీ నవరంధ్రాలున్నాయిగా... ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఏం పోయిందని డాక్టర్‌ను అడిగాట్ట. అప్పుడూ ‘‘గుండెలోకి రక్తం రావడానికీ, పోవడానికి ఆల్రెడీ దేవుడు కొన్ని రంధ్రాల్ని పెట్టే ఉంచాడు. అవి మినహా ఒక్క రంధ్రం ఎక్కడ ఎక్స్ట్రాగా ఉన్నా అది బొక్కే. అందుకే పేగులోనైనా, గుండెలోనైనా రంధ్రం పడితే పూడ్చేయాల్సిందే అన్నాట్ట డాక్టర్‌గారు. → పకడ్బందీగా ఇల్లు కట్టుకోగానే ఉండదు ప్రయోజనం. మీరు నల్లా వేసుకోవాలన్నా... మురుగునీళ్లు బయటకు వెళ్లాలన్నా... ఆఖరికి ఏసీ అమర్చుకోవాలన్నా గోడలకు పెట్టుకోవాలి రంధ్రాలెన్నో. ఇలా చూసినప్పుడు ‘ఇంటి కప్పుకు దగ్గరగా సజ్జాలూ, బాత్రూమ్ నీళ్లు బయటెళ్లాలంటే బెజ్జాలూ’ తప్పవు. → గంటెకు అనేక చిల్లులు పెట్టి దాన్ని జల్లిగంటె అని పిలిచాకే... నూనెలో వేగుతున్న పదార్థాలను తీయడానికి వీలైంది. జల్లిగంటెలో ఎన్ని చిల్లులుంటే... అలాగే పాలు వడపోసే ఫిల్టర్‌కు ఎన్ని సన్నటి చిల్లులుంటే అదంత అడ్వాన్స్డ్ ఉపకరణం. కాబట్టి... హ్యూమన్ బీయింగ్స్‌లో నేనిప్పుడు మరింత అడ్వాన్స్డ్ వర్షన్‌గా అనుకుంటున్నా. → ఆకాశం నుంచి ఏ బట్టతడుపు చినుకులు పడితేనో లేదా మామూలుగా వర్షం కురిస్తేనో లాభం లేదు. ఆకాశానికి బొక్కడ్డట్టు... మేఘాలకు చిల్లుపడ్డట్టుగా పడాలి వాన. అప్పుడే మంచి పంటలకూ, నీటిపారుదలకూ అవకాశం. అంటే ఆకాశానికి చిల్లు పడనట్టుగా వర్షం పడితే ఏమీ లాభం లేదన్నమాట. → నాకిప్పుడు గుండెలో పడ్డ రంధ్రం వల్ల... డాక్టరు మొదలుకొని, అటు ఈసీజీవాడూ, ఎక్స్–రే ఫిల్ముల తయారీవాడూ, డయాగ్నస్టిక్ సెంటర్వాడూ మొదలుకొని ఇటు నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చే ఊబరు, వోలా ట్రాన్స్‌పోర్టు వాళ్ల నుంచి నన్ను పరామర్శించే పండ్ల దుకాణాల వాళ్ల వరకూ ఎంతోమంది బతుకుతారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... దాంతో నా స్లోగనేమిటంటే...‘‘నా గుండెలోని కలుగూ... దాంతో మన ఎకానమీకెంతో లాభం కలుగు’’! → ఆఫ్టరాల్ వడకు ఒకే ఒక బొక్కెట్టి చిల్లుగారె అనీ... అనేక రంధ్రాలొచ్చేలా పోసి దోసెను రవ్వదోసె అంటూ పిలుచుకుని, ప్రాణాలను నిలబెట్టే ఆహారాలకే ఇలా బొక్కెడుతున్నప్పుడు నా గుండెకు బొక్కడితే నామోషీ ఏమిటి? → చిల్లుకు రంధ్రమనీ, కన్నం, బెజ్జం, కలుగు, తూటు, తొర్ర, పొక్కా, బొక్క అని... ఇలాంటి పర్యాయపదాలెన్నో ఉండి భాషను సుసంపన్నం చేస్తున్న నేపథ్యంలో ఈ బాషాకూ పడే చిల్లు వల్ల ఛిల్ల్వుతుంటే నీకేంటి బాధ. గతంలోనే నా పేగుకో రంధ్రం పడితే జీజే అనే సర్జరీ చేసి మూసేశారు డాక్టర్లు. ఇప్పుడు అంతటి వైద్యచికిత్సా శస్త్రచికిత్సా మహనీయులకు నా ‘నవ’రంధ్రాన్ని (అంటే తొమ్మిదోది కాదు... కొత్త రంధ్రమని అర్థం) మూసేసే మరో అవకాశమిస్తున్నానంటూ ముగించాడు మా రాంబాబు గాడు. – యాసీన్ -
సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ గురించి తెలుసా?
సినిమా అసోసియేషన్ ఫర్ చిన్న చిన్న పురుగులూ...జిందాబాద్! : సంగతేమిటంటే... చీమలూ, బొద్దింకలూ, బల్లులూ... ఆఖరికి దోమల వంటి చిన్న చిన్న కీటకాలన్నీ కలిసి ‘‘సినిమా అసోసియేషన్ ఫర్ చిన్నచిన్న పురుగులు’’ సంఘం (సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ అంటే సీఐఏ) పెట్టుకున్నాయి. ఆ సంఘ ప్రారంభ సమావేశం సందర్భంగా... ప్రెస్ మీట్లో పత్రికల, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాయి. అవి ఇవి... రిపోర్టర్ : ఈ సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్ దోమగారూ... అయినా మీ కీటకాలన్నీ ఎందుకండీ ఈ ‘చిన్న పురుగుల’ అసోసియేషన్ పెట్టాయి? అసోషియేషన్ ప్రసిడెంట్ దోమ (స్పీచ్ ఇస్తున్న ధోరణిలో) : ఇప్పుడూ... పున్నమినాగు ఫార్మూలాతో బోల్డన్ని సూపర్హిట్టుపాముల మూవీస్ వచ్చేశాయి. కొండవీటి ‘సింహాలూ’, ‘చిరుత’ల్లాంటి పేర్ల మీద బంపర్హిట్లూ ఉన్నాయి. ఇక అడవిరాముడూ, వేటగాడులాంటి బ్లాక్బస్టర్లలో ఏనుగులూ, సింహాలూ, పులులూ, ఎలుగుబంట్లూ ఎట్సెట్రాలు తెగ యాక్టింగు చేసేశాయి. ముత్యాలముగ్గు సినిమాలో కోతి, ఆఖరికి పొట్టేలు పున్నమ్మల్లో పొట్టేలు సైతం తెగ పెర్ఫార్మెన్సు చూపించేశాయి. మరి ఇంకా చెప్పాలంటే... ‘అద్దమంటి మనసు ఉందీ... అందమైనా వయసు ఉందీ’ పాటలో మా ప్రియతమ సోదరీమణి అయిన బర్రెగారు సాక్షాత్తూ పెద్ద ఎన్టీఆర్‌ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని యాక్షనింగు కుమ్మేసింది. వాళ్లంటే పెద్ద పెద్ద జీవులు. అవన్నీ పెద్ద జీవుల అసోసియేషన్ పెట్టుకున్నాయి. మరి... ఈ నేపథ్యంలో మాకూ ఓ సంఘం ఉండొద్దా మరి? రిపోర్టర్ : అవంటే పెద్ద జీవులూ... పెద్ద హీరోలకు దీటుగా వాటి పేర్ల మీదే డైరెక్టుగా మూవీలొచ్చేశాయి. సినిమాల విజయంలో మరి మీ చిన్న పురుగుల పాత్ర ఏమిటి? చీమ (గొంతు సవరించుకుంటూ గొట్టం ముందుకు వస్తూ) : ‘సింహాద్రి’ సినిమా చూశారా సార్? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి మా చీమనే యూజ్ చేసుకున్నారు. మాకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఏకంగా ఓ లవ్‌సాంగ్ రాయాల్సి వచ్చిందీ... తీయాల్సి వచ్చింది...చీమ చీమ చిమ చీమా చీమా చీమ చీమ చిమ చీమ చీ...ఈ...ఈ...మా... చీమ తీపి చిరునామా ప్రేమా... తెలుసుకోవె భామా... అంటూ సదరు డ్యూయెట్టులో హీరోహీరోయిన్లు చీమ చుట్టూ చిందులు తొక్కితేగానీ మూవీ హిట్టవ్వలేదు మరి! రిపోర్టర్ : సినిమాలకు మీరెలా కంట్రిబ్యూట్ చేస్తున్నారు బొద్దింకగారూ, బల్లిగారూ?బొద్దింక : హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి ఈ సినిమా రంగానికి ఇతోధికంగా మేము చేసుకుంటున్న పవిత్రమైన సేవలు ఇన్నని చెప్పడానికి లేదండీ. చాలా మూవీస్‌లో మమ్మల్ని చూసి... ‘‘అమ్మో బొద్దింక...’’ అంటూ అరుస్తూ హీరోయిన్... హీరో ఒళ్లోకి దూకుతుంది. అంతే... లవ్వూ... డ్యూయెట్టూ!! (అంటూ గర్వంగా తన పొడవాటి కాక్రోచు మీసాల్ని దువ్వుకుంది). అంతేకాదండి... మేమిలా నటించినా హిట్టే... మమ్మల్ని చంపాలన్నా ‘హిట్టే’! (కప్‌బోర్డులోని హిట్ మందును సీసా కేసి చూపిస్తూ అన్నది).బల్లి : మేము కూడా ఏమీ తక్కువ కాదండి. బొద్దింకల్లాగే మమ్మల్ని చూసి హీరో మీదకు గెంతే హీరోయిన్లకు కొదవలేదండీ. ఇప్పుడంటే పెద్దగా లేదుగానీ... పాత సినిమాటాకీసుల్లో వెండితెర మీద మా బంగారు పాదాలు మోపుతూ... హీరో హీరోయిన్ల ముఖాలమీదా, ఒంటిమీదా పాకుతూ తెగ తిరిగేవాళ్లం. తెరమీద ఒక్కోసారి స్ప్రింటూ, మరోసారి మారథానూ ఇంకోసారి ఫోర్,ఫోర్ మీటర్సు రిలేలాంటి రన్నింగు రేసులూ చేసేవాళ్లం. ఇక ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాంటి సినిమాలో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్ గారు తన బాత్రూమ్లో పాకుతున్న బల్లిని చూసి... పరకాయ ప్రవేశం చేసిన హీరోయేమో అనుకుంటుంది. బల్లిని చూసి హీరో అనుకుందంటే... దీన్ని బట్టి తెలియడం లేదూ మేం ‘హీరో మెటీరియల్’ అనీ! చదవండి: కూరగాయ హీరోల 'పోకిరి' కిరిరిపోర్టర్ : (కొద్దిగా వ్యంగ్యం ధ్వనిస్తూ...) అన్నట్టూ దోమగారూ!! మలేరియాలూ, డెంగీలు తీసుకొచ్చే మీరు ఈ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్ ఎలా అయ్యారు సార్? దోమ : (కోపంగా...) హేం మాహాడుతున్నారు మీరు? రోబో సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ అండ్ రోబో చిట్టీల మధ్య ప్రేమకు కారణం మేమే. ‘రోబోకు ఐశ్వర్యారాయ్ పెట్టే ‘ప్రేమ పరీక్ష’ ఏమిటో తెల్సా మీకు? తనను కుట్టిన దోమను పట్టుకొచ్చి దాంతో సారీ చెప్పించమనే కదా! మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతవరకూ మిస్ వరల్డు ఐశ్వర్యారాయ్‌ను కుట్టిన జీవేదైనా ఉందా... ఒక్క దోమ తప్ప? మరి ఈ నేపథ్యంలో చూస్తే... ఈ చిన్న పురుగుల సంఘానికి నేను తప్ప ప్రెసిడెంట్‌గా ఉండటానికి అర్హులెవరైనా ఉన్నాయా సార్? ...అంటూ అరుస్తూ ‘‘చిన్న పురుగుల సంఘం పట్ల మీ కానొర్టర్ల వివక్ష నశించాలీ... మా సీఐఏ అదే... సినిమా ఇన్సెక్ట్స్ అసోసియేషన్ వర్థిల్లాలి... చిన్న చిన్న సినీ పురుగులూ జిందాబాద్’’ అని నినాదాలిస్తూ కోపంగా ప్రెస్‌మీట్ నుంచి వాకౌట్ చేసింది దోమ. దాంతోపా టే మిగతా ఇన్సెక్ట్స్ కూడా!– యాసీన్ -
కూరగాయ హీరోల 'పోకిరి' కిరి
‘‘ఎవరు కోశాక... లోపలంతా బ్లాక్ అయి పోద్దో... వాడే పండుగాడు... ఆపిల్ పండుగాడు’’ అని పంచ్ డైలాగ్ విసిరింది ఆపిల్. ఈమధ్య మార్కెట్ నుంచి తెచ్చాక... కాసేపవి బయటే ఉండటం, ఫ్రిజ్ నుంచి తీశాక మళ్లీ బయటకు రావడం... ఇలా బయట ఉన్న సమయంలో టీవీలో వచ్చే సినిమాలు చూడటం మన కూరగాయలూ, పండ్లూ వీటన్నింటికీ పరిపాటి అయ్యింది.దాంతో వాటికీ మన తెలుగు హీరోల డైలాగులు నోటికే వచ్చేస్తున్నాయి. పైగా అన్నీ మన మహేష్‌బాబు పంచ్‌డైలాగులు చెప్పడానికే ప్రిఫర్ చేస్తున్నాయి. బేసిక్‌గానే మనమూ, మన సమాజమంతా సినిమా పిచ్చోళ్లమే కాబట్టి మన దారిలోనే అవి కూడా నడుస్తున్నాయంటూ సరిపెట్టుకున్నా. ఈలోపు టొమాటో ఓ డైలాగ్ కొట్టిందిలా! (అన్నట్టు వీడి పేరు కూడా పండుగాడేనట. నిజానికి... అసలు పండుగాడు వీడేనట. అదీ వాడి క్లెయిము). ‘‘ఏదీ... నిన్నొకసారి చూడనీ. నిన్న నాతో కూర్చుని ‘టమాట ఆలుగడ్డ’ కూర డీల్ సెట్ చేసుకుని... ఇవాళ్ల మళ్లీ వాళ్లలో కలిసి నాతోనే మీటింగ్‌లో కూర్చుంటావా?’’ (టొమాటో) పండును అడిగింది ఆలుగడ్డ. ‘‘నాకు వాడూ... వీడూ అనే తేడా లేదు. ఇప్పుడు కందిపప్పుగాడు అడిగాడనుకో... వెంటనే ‘టమాట పప్పు’ కాంబినేషన్‌గా వస్తా. ఒక్కసారి కమిట్ అయితే నా షేపులో నేనే ఉండను’’ అన్నాడు టొమాటో పండుగాడు. ‘‘ఏయ్... నీకు కాంబినేషన్ నీతీ న్యాయమంటూ ఏమీ లేవా?’’ అడిగింది వాంప్ మిస్ మిరపకాయ్. ‘‘లేవు... టమాటా పప్పే కాదు... జస్ట్ కూరగాయలతోనే కాదు... రవ్వతో కలిసి కూడా ‘టొమాటో బాత్’ అయి పోతాన్నేను’’ అంది టొమాటో. ‘‘అందుకేరా నువ్వంటే నాకిష్టం’’ అంటూ... ‘‘వీణ్ణి మన దగ్గర పెట్టుకుంటే ‘వంకాయ్–టమాటా’, ‘టమాట–కోడిగుడ్డు కూర’, ‘టమాట రైస్’ కూడా చేసుకోవచ్చు. ఆఖరికి మన పండుగాడు టమాట పచ్చడీ, పులుసూ, సలాడ్ గా కూడా పనికొస్తాడు’’ సలహా ఇవ్వడంతోపాటు... అలా వగలు పోతూ ‘‘దీంతో కోసుకు పో’’ అంటూ ఓ కత్తిని సర్రుర్రున విసిరేసింది మిస్ మిరప. అలా కత్తి గాల్లో ఉండగానే... ఇలా దాన్ని ఆనుకొని... ముందు ముక్కలుముక్కలుగా, తర్వాత ప్యూరీలాగా జ్యూసుగా, అంతలోనే టొమాటో కెచప్‌గా, ఇంతలోనే సాస్‌గా... ఇలా రకరకాల విన్యాసాలు చేశాడు పండుగాడు.‘‘కత్తి బాగా అలవాటా? చకచకా ఇన్నిరకాలుగా మారి పోయావ్’’ అడిగాడు కూరగాయల గంపలోని క్యాబేజీగాడు. ‘‘వంటల ప్రోగ్రాములు చూడ్డం లేదేటి’’ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు (టొమాటో) పండుగాడు. ఇక ప్రతి చిన్నాచితకా కూరగాయ్గాడూ, కోన్‌కిస్కా వెజిటబుల్గాడూ రకరకాల పంచ్ డైలాగులు కొట్టేస్తుండటంతో చికాకు పడుతూ... చిట్టచివరిగా చేతికి అందిన కొరియాండర్ గాణ్ణి పట్టుకుని... ‘‘ఇంత లేట్గానట్రా చేతికి అందడం?!’’ అంటూ చివాట్లు పెట్టబోయాడు డైరెక్టర్ ‘షెఫ్’గారు. అందుకు కొత్తిమీర చెప్పిన సమాధానం తో నోట్లోంచి మాట కూడా రానంతగా అవాక్కయ్యాడు. ఇంతకూ కొత్తిమీర కట్టగాడన్న డైలాగేమిటో తెల్సా?‘‘ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా... గార్నిష్ అయ్యామా లేదా?’’ – యాసీన్ -
Humorous video: ఈ హెయిర్ స్టైల్‌తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్‌కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
అదిరిపోయిన అహనా పెళ్లంట!
ఆహా నా పెళ్లంట.. ఈ చిత్రం పేరు వింటే చాలు.. మొన్న, నిన్నటి, నేటి తరాలేకాదు ఇక ముందు వచ్చే తరాలు కూడా కడుపుబ్బ నవ్వాల్సిందే. ఈ చిత్రానికి ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల దర్శకత్వం వహించగా దానికి రామానాయుడే నిర్మాతగా వ్యవహరించారు. బ్రహ్మానందాన్ని కమెడియన్‌గా పూర్తిస్థాయిలో నిలబెట్టిన సినిమా అది. కోట శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్.. ఇలా ఎంతోమందికి ఆ సినిమా మంచి లైఫ్ ఇచ్చింది. సున్నితమైన అంశాలతో కుటుంబ కథ చిత్రాలను నిర్మించడంలోనే కాకుండా మనుసును రంజింప చేసే చిత్రాలను నిర్మించడంలోను ఆయనది అందె వేసిన చేయి. ప్రేక్షకులకు ఏ మాత్రం నష్టం జరగని విధంగా కథలను ఎంపిక చేయడంలోను, అలాంటి కథలను తీసుకొచ్చినవారికి అవకాశం ఇవ్వడంలోనూ రామనాయుడు ఎప్పుడూ ముందుండేవారు. ఇలా 155 చిత్రాలను ఒంటి చేత్తో నిర్మించి ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా దక్కించుకున్నారు.


