రాంబాబుగాడి రంధ్రాన్వేషణ(లు)! | Point of View on heart Hole Exploration | Sakshi
Sakshi News home page

రాంబాబుగాడి రంధ్రాన్వేషణ(లు)!

Jun 5 2026 2:17 AM | Updated on Jun 5 2026 5:24 PM

Point of View on heart Hole Exploration

హ్యూమరమరాలు 

‘‘మీ గుండెకు చిల్లు పడింది’’ అని డాక్టర్‌ చెప్పగానే వెంటనే రాంబాబు గాడు అన్న మొదటి మాట ఏమిటో తెలుసా?
‘‘చిల్‌ బ్రో’’ అంటూ కూల్‌గా వ్యాఖ్యానించాడు వాడు. 

‘‘అదేంట్రా గుండెకు చిల్లు అంటే చిల్‌ అంటావేంటి?’’ ఆశ్చర్యపోయాన్నేను. 
చిల్లు మహత్యం గురించి ఓ స్పీచ్‌ ఇచ్చాడు రాంబాబుగాడు. వాడి పాయింటాఫ్‌ వ్యూ నుంచి చెప్పాలంటే... 

→ మనిషికి ఆల్రెడీ నవరంధ్రాలున్నాయిగా... ఒకటి ఎక్స్‌ట్రా ఉంటే ఏం పోయిందని డాక్టర్‌ను అడిగాట్ట. అప్పుడూ ‘‘గుండెలోకి రక్తం రావడానికీ, పోవడానికి ఆల్రెడీ దేవుడు కొన్ని రంధ్రాల్ని పెట్టే ఉంచాడు. అవి మినహా ఒక్క రంధ్రం ఎక్కడ ఎక్స్‌ట్రాగా ఉన్నా అది బొక్కే. అందుకే పేగులోనైనా, గుండెలోనైనా రంధ్రం పడితే పూడ్చేయాల్సిందే అన్నాట్ట డాక్టర్‌గారు. 

→ పకడ్బందీగా ఇల్లు కట్టుకోగానే ఉండదు ప్రయోజనం. మీరు నల్లా వేసుకోవాలన్నా... మురుగునీళ్లు బయటకు వెళ్లాలన్నా... ఆఖరికి ఏసీ అమర్చుకోవాలన్నా గోడలకు పెట్టుకోవాలి రంధ్రాలెన్నో. ఇలా చూసినప్పుడు ‘ఇంటి కప్పుకు దగ్గరగా సజ్జాలూ, బాత్‌రూమ్‌ నీళ్లు బయటెళ్లాలంటే బెజ్జాలూ’ తప్పవు. 

→ గంటెకు అనేక చిల్లులు పెట్టి దాన్ని జల్లిగంటె అని పిలిచాకే... నూనెలో వేగుతున్న పదార్థాలను తీయడానికి వీలైంది. జల్లిగంటెలో ఎన్ని చిల్లులుంటే... అలాగే పాలు వడపోసే ఫిల్టర్‌కు ఎన్ని సన్నటి చిల్లులుంటే అదంత అడ్వాన్స్‌డ్‌ ఉపకరణం. కాబట్టి... హ్యూమన్‌ బీయింగ్స్‌లో నేనిప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌ వర్షన్‌గా అనుకుంటున్నా. 

→ ఆకాశం నుంచి ఏ బట్టతడుపు చినుకులు పడితేనో లేదా మామూలుగా వర్షం కురిస్తేనో లాభం లేదు. ఆకాశానికి బొక్కడ్డట్టు... మేఘాలకు చిల్లుపడ్డట్టుగా పడాలి వాన. అప్పుడే మంచి పంటలకూ, నీటిపారుదలకూ అవకాశం. అంటే ఆకాశానికి చిల్లు పడనట్టుగా వర్షం పడితే ఏమీ లాభం లేదన్నమాట.  

→ నాకిప్పుడు గుండెలో పడ్డ రంధ్రం వల్ల... డాక్టరు మొదలుకొని, అటు ఈసీజీవాడూ, ఎక్స్‌–రే ఫిల్ముల తయారీవాడూ, డయాగ్నస్టిక్‌ సెంటర్‌వాడూ మొదలుకొని ఇటు నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చే ఊబరు, వోలా ట్రాన్స్‌పోర్టు వాళ్ల నుంచి నన్ను పరామర్శించే పండ్ల దుకాణాల వాళ్ల వరకూ ఎంతోమంది బతుకుతారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... దాంతో నా స్లోగనేమిటంటే...‘‘నా గుండెలోని కలుగూ... దాంతో మన ఎకానమీకెంతో లాభం కలుగు’’! 

→ ఆఫ్టరాల్‌ వడకు ఒకే ఒక బొక్కెట్టి చిల్లుగారె అనీ... అనేక రంధ్రాలొచ్చేలా పోసి  దోసెను రవ్వదోసె అంటూ పిలుచుకుని, ప్రాణాలను నిలబెట్టే ఆహారాలకే ఇలా బొక్కెడుతున్నప్పుడు నా గుండెకు బొక్కడితే నామోషీ ఏమిటి? 

→ చిల్లుకు రంధ్రమనీ, కన్నం, బెజ్జం, కలుగు, తూటు, తొర్ర, పొక్కా, బొక్క అని... ఇలాంటి పర్యాయపదాలెన్నో ఉండి భాషను సుసంపన్నం చేస్తున్న నేపథ్యంలో ఈ బాషాకూ పడే చిల్లు వల్ల ఛిల్ల్‌వుతుంటే నీకేంటి బాధ. గతంలోనే నా పేగుకో రంధ్రం పడితే జీజే అనే సర్జరీ చేసి మూసేశారు డాక్టర్లు. ఇప్పుడు అంతటి వైద్యచికిత్సా శస్త్రచికిత్సా మహనీయులకు నా ‘నవ’రంధ్రాన్ని (అంటే తొమ్మిదోది కాదు... కొత్త రంధ్రమని అర్థం) మూసేసే మరో అవకాశమిస్తున్నానంటూ ముగించాడు మా రాంబాబు గాడు. 

– యాసీన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement