breaking news
Hole in the heart
-
రాంబాబుగాడి రంధ్రాన్వేషణ(లు)!
‘‘మీ గుండెకు చిల్లు పడింది’’ అని డాక్టర్ చెప్పగానే వెంటనే రాంబాబు గాడు అన్న మొదటి మాట ఏమిటో తెలుసా?‘‘చిల్ బ్రో’’ అంటూ కూల్‌గా వ్యాఖ్యానించాడు వాడు. ‘‘అదేంట్రా గుండెకు చిల్లు అంటే చిల్ అంటావేంటి?’’ ఆశ్చర్యపోయాన్నేను. చిల్లు మహత్యం గురించి ఓ స్పీచ్ ఇచ్చాడు రాంబాబుగాడు. వాడి పాయింటాఫ్ వ్యూ నుంచి చెప్పాలంటే... → మనిషికి ఆల్రెడీ నవరంధ్రాలున్నాయిగా... ఒకటి ఎక్స్ట్రా ఉంటే ఏం పోయిందని డాక్టర్‌ను అడిగాట్ట. అప్పుడూ ‘‘గుండెలోకి రక్తం రావడానికీ, పోవడానికి ఆల్రెడీ దేవుడు కొన్ని రంధ్రాల్ని పెట్టే ఉంచాడు. అవి మినహా ఒక్క రంధ్రం ఎక్కడ ఎక్స్ట్రాగా ఉన్నా అది బొక్కే. అందుకే పేగులోనైనా, గుండెలోనైనా రంధ్రం పడితే పూడ్చేయాల్సిందే అన్నాట్ట డాక్టర్‌గారు. → పకడ్బందీగా ఇల్లు కట్టుకోగానే ఉండదు ప్రయోజనం. మీరు నల్లా వేసుకోవాలన్నా... మురుగునీళ్లు బయటకు వెళ్లాలన్నా... ఆఖరికి ఏసీ అమర్చుకోవాలన్నా గోడలకు పెట్టుకోవాలి రంధ్రాలెన్నో. ఇలా చూసినప్పుడు ‘ఇంటి కప్పుకు దగ్గరగా సజ్జాలూ, బాత్రూమ్ నీళ్లు బయటెళ్లాలంటే బెజ్జాలూ’ తప్పవు. → గంటెకు అనేక చిల్లులు పెట్టి దాన్ని జల్లిగంటె అని పిలిచాకే... నూనెలో వేగుతున్న పదార్థాలను తీయడానికి వీలైంది. జల్లిగంటెలో ఎన్ని చిల్లులుంటే... అలాగే పాలు వడపోసే ఫిల్టర్‌కు ఎన్ని సన్నటి చిల్లులుంటే అదంత అడ్వాన్స్డ్ ఉపకరణం. కాబట్టి... హ్యూమన్ బీయింగ్స్‌లో నేనిప్పుడు మరింత అడ్వాన్స్డ్ వర్షన్‌గా అనుకుంటున్నా. → ఆకాశం నుంచి ఏ బట్టతడుపు చినుకులు పడితేనో లేదా మామూలుగా వర్షం కురిస్తేనో లాభం లేదు. ఆకాశానికి బొక్కడ్డట్టు... మేఘాలకు చిల్లుపడ్డట్టుగా పడాలి వాన. అప్పుడే మంచి పంటలకూ, నీటిపారుదలకూ అవకాశం. అంటే ఆకాశానికి చిల్లు పడనట్టుగా వర్షం పడితే ఏమీ లాభం లేదన్నమాట. → నాకిప్పుడు గుండెలో పడ్డ రంధ్రం వల్ల... డాక్టరు మొదలుకొని, అటు ఈసీజీవాడూ, ఎక్స్–రే ఫిల్ముల తయారీవాడూ, డయాగ్నస్టిక్ సెంటర్వాడూ మొదలుకొని ఇటు నన్ను హాస్పిటల్‌కు తీసుకొచ్చే ఊబరు, వోలా ట్రాన్స్‌పోర్టు వాళ్ల నుంచి నన్ను పరామర్శించే పండ్ల దుకాణాల వాళ్ల వరకూ ఎంతోమంది బతుకుతారు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... దాంతో నా స్లోగనేమిటంటే...‘‘నా గుండెలోని కలుగూ... దాంతో మన ఎకానమీకెంతో లాభం కలుగు’’! → ఆఫ్టరాల్ వడకు ఒకే ఒక బొక్కెట్టి చిల్లుగారె అనీ... అనేక రంధ్రాలొచ్చేలా పోసి దోసెను రవ్వదోసె అంటూ పిలుచుకుని, ప్రాణాలను నిలబెట్టే ఆహారాలకే ఇలా బొక్కెడుతున్నప్పుడు నా గుండెకు బొక్కడితే నామోషీ ఏమిటి? → చిల్లుకు రంధ్రమనీ, కన్నం, బెజ్జం, కలుగు, తూటు, తొర్ర, పొక్కా, బొక్క అని... ఇలాంటి పర్యాయపదాలెన్నో ఉండి భాషను సుసంపన్నం చేస్తున్న నేపథ్యంలో ఈ బాషాకూ పడే చిల్లు వల్ల ఛిల్ల్వుతుంటే నీకేంటి బాధ. గతంలోనే నా పేగుకో రంధ్రం పడితే జీజే అనే సర్జరీ చేసి మూసేశారు డాక్టర్లు. ఇప్పుడు అంతటి వైద్యచికిత్సా శస్త్రచికిత్సా మహనీయులకు నా ‘నవ’రంధ్రాన్ని (అంటే తొమ్మిదోది కాదు... కొత్త రంధ్రమని అర్థం) మూసేసే మరో అవకాశమిస్తున్నానంటూ ముగించాడు మా రాంబాబు గాడు. – యాసీన్ -
చిన్నారికి పెద్ద కష్టం
సాక్షి, తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేటీఆర్ సారూ.. మా కొడుకును కాపాడండంటూ కోరుతున్నారు ఓ చిన్నారి తల్లిదండ్రులు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ గ్రామంలో అద్దె ఇంట్లో ఉంటూ చేనేత వృత్తి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ఉయ్యాల మధు అనే నేత కార్మికుడు. అతడికి భార్య, కూతురు శ్రీకృతి(4), కొడుకు ధర్మతేజ(2) ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి అనుకోని ఆపద వచ్చి పడింది. ఒక్కగానొక్క కొడుకు ధర్మతేజ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించగా.. గుండెకు చిల్లు పడిందని, ఆపరేషన్ చేస్తేనే ప్రాణం దక్కుతుందని తెలిపారు. ఆపరేషన్‌కు రూ.2లక్షలు ఖర్చవుతుందని, వెంటనే డబ్బులు సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. నిరుపేద కుటుంబమైన తమకు అంత ఖర్చు చేసి ఆపరేషన్ చేయించే స్తోమత లేదని, తమ కొడుకును ఆదుకోవాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లేఖ రాశారు. తమ కొడుకు బతుకైనా, చావైనా కేటీఆర్ చేతిలోనే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయతో మా కొడుకుకు ప్రాణభిక్ష ప్రసాదించాలని కోరుతున్నారు. సాయం చేసే దాతలు సెల్ నం.95051 07660ను సంప్రదించాలన్నారు. ఆర్థిక సాయం అందించేవారు బాబు తల్లి ఉయ్యాల సుజాత బ్యాంకు అకౌంట్ నంబర్ 79028825505 దక్కన్ గ్రామీణ బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0ఆర్ఆర్డీసీజీబీ నంబరుకు నేరుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. -
చిన్నారి చికిత్సకు వైఎస్సార్ సీపీ చేయూత
దేవరాపల్లి : గుండెకు రంధ్రం పడి చావుబతుకుల్లో ఉన్న బాలికకు వైఎస్సార్సీపీ నాయకులు అండగా నిలిచారు. మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కంటిపాము నాగేశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె లోహిత (9)కు చిన్నతనం నుంచే గుండెకు రంధ్రం పడడంతో ప్రస్తుతం మృత్యు ఒడిలో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ స్పందించి బాలిక శస్త్రచికిత్సకు అవసరమైన ‘ఎ’ పాజిటివ్ రక్తం 9 యూనిట్లను ఎ.ఎస్.రాజా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని తండ్రి నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు. ఆ బాలికను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడుతో మాట్లాడామని, బాలిక వైద్యసేవలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా ఈనెల 28వ తేదీన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బాలికకు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు అంగీకరించారని తెలిపారు. -
గుండె చిల్లు...సూపర్ జిగురు!
పుట్టుకతోనే గుండెకు రంధ్రాలు పడితే ..ఇక ఆ పిల్లలు మరణానికి చేరువైనట్లే. వీలైనంత వేగంగా చికిత్స చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు. కానీ గుండెకుపడ్డ చిల్లును పూడ్చే క్రమంలో ఎన్నో ఇబ్బందులుంటాయి. కుట్లు వేస్తే లేదా మరో ఇతర పద్ధతిలో చికిత్స చేస్తే ఆ చిన్ని గుండెలోని కణజాలం దెబ్బతినే అవకాశముంటుంది. ఈ చిక్కులన్నింటినీ సూపర్ జిగురుతో పరిష్కారించవచ్చునని అంటోంది బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ‘హైడ్రోఫోబిక్ లైట్-యాక్టివేటెడ్ అథెసివ్ (హెచ్ఎల్ఏఏ)’ అనే ఈ జిగురును ఓ పట్టీ(ప్యాచ్)పై వేసి గుండె రంధ్రం వద్ద అతికిస్తే చాలు.. సెకెన్లలో రంధ్రాన్ని పూడిపోయేందుకు సాయపడుతుంది. పట్టీని అతికించిన వెంటనే అతినీలలోహిత కాంతిని ప్రసరింపచేస్తే.. ఐదు సెకన్లలోనే జిగురు యాక్టివేట్ అయి రక్తం లీకేజీని అరికడుతుందట. రక్తం ప్రవహిస్తున్నా.. తేమగా ఉన్నా.. గుండె కొట్టుకుంటున్నా ఈ జిగురు పట్టీ కణజాలాన్ని గట్టిగా పట్టి ఉంచుతుందట. రంధ్రం పూడి, గాయం మానిన తర్వాత ప్యాచ్‌తో సహా ఇది సహజంగా విచ్ఛిన్నం అవుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ర్పభావమూ ఉండదట. నత్తల వంటి అనేక జీవులు నీటిలో తడిచిపోకుండా.. త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు జిగుర్లను స్రవిస్తుంటాయి. అలాంటి జీవులను స్ఫూర్తిగా తీసుకునే శాస్త్రవేత్తలు ఈ సూపర్ జిగురును తయారు చేయడం అసలు విశేషం. వెయ్యిలో ఎనిమిది మందికి చిల్లు... పుట్టుకతో వచ్చే గుండె సంబంధ లోపాలను ‘కాన్జెనిటల్ హార్ట్ డి ఫెక్ట్స్’గా పేర్కొంటారు. గుండెకు రంధ్రాలతో పుట్టడం వీటిలో ఒకటి. సాధారణంగా ప్రతి 1000 మందిలో 8 మందికి పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఏర్పడే అవ కాశం ఉంది. ఇలాంటి గుండె సమస్యలకు మేనరిక వివాహాలు, జన్యుపరమైన వారసత్వం, గర్భవతిగా ఉన్నప్పుడు తీవ్ర జ్వరం రావడం, మందులు వికటించడం, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం వంటి వి కారణాలు. గుండెలో రంధ్రాలు ఏర్పడేవారిలో 70 శాతం మందికి మందులు వాడితే ఆటోమేటిక్‌గా మూసుకుపోతాయి. 20 శాతం మందికి ఆపరేషన్ల ద్వారా నయం చేయొచ్చు. కానీ మిగతా 10 శాతం మందిలో మాత్రం కొన్నిసార్లు ఆపరేషన్లు చేసినా ప్రయోజనం ఉండకపోవచ్చు. - డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ హద్రోగ నిపుణులు, హైదరాబాద్


