పెళ్లిళ్లలో సరదాగా ఆటపట్టించడం అనేది మాములు. ఆ వేడుకకు వచ్చినవారందరి ముఖాల్లో నవ్వులు పూయిస్తే పర్లేదు..అది కాస్త సీరియస్ అయితేనే లేనిపోని తలనొప్పులు మొదలవుతాయి. అందుకే ఏదైనా శృతి మించకుండా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ అది లోపించడంతో ఆ పెళ్లి బృందం, ఆ కొత్త దంపతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏ సరదా అయినా నష్టం చేకూర్చేలా ఉండకూదనే సత్యాన్ని నేర్పించే బాధకర ఘటన ఇది.
చైనాలో చోటు చేసుకుంది ఈ ఘటన. అక్కడ పెళ్లిళ్లలో హున్నావో అనే పురాతన చైనీస్ ఆచారం ఉంది. ఇది వాస్తవానికి దుష్టశక్తులను తరిమికొట్టడానికి, నూతన వధూవరులు, అతిథుల మధ్య బిడియాన్ని తొలగించేందుకు ఏర్పాటు చేసిన సరదా ఆచారం. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్ది అది కాస్తా ప్రమాదకరమైన చిలిపి పనిగా మారిపోయింది.
గతంలో కూడా ఇలాంటి ఆచారంతోనే ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు కూడా. ఈసారి మాత్రం మరింత సీరియస్‌గా మారింది. 2023 అక్టోబర్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. వివాహ తంతులో భాగంగా ఓ ఫ్రాంక్ చేశారు. అది కాస్తా చూస్తుండగానే సీరియస్‌గా మారింది. ఆ ఫ్రాంక్‌లో భాగంగా వధువు స్నేహితురాలు జాంగ్‌ని పెళ్లి కొడుకు స్నేహితుల గదిలో ఒంటరిగా వదిలేశారు. ప్రాంక్‌లో భాగంగా ఆమెను అల్మరా నుంచి బయటకు లాగి మంచ మీదకు విసిరి ఆపై ఒక దుప్పటితో గాలిలోకి ఎగరవేస్తారు. ఆ క్రమంలోనే వధువు స్నేహితురాలిని ఒకసారి ఎగరువేసినప్పుడు పెళ్లికొడుకు బృందం పట్టుకుంది. ఆ తర్వాత విసిరినప్పుడు ఆమె నేల మీద సరాసరి పడిపోవడంతో వెన్నుముకకు తీవ్ర గాయమైంది.
దాంతో జాంగ్ సుమారు 18 రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి వచ్చింది. ఆ ఫ్రాంక్ ఆమెకు తీవ్రమైన గాయంతోపాటు శాశ్వత వైకల్యాన్ని మిగిల్చిందామెకు. దాంతో జాంగ్ కోర్టుని ఆశ్రయించింది. ఆ నేపథ్యంలో ఆగస్టు 2024 ఫోరెన్సిక్ న్యాయ బృందం ఆమె గాయాన్ని విచారించి గ్రేడ్ 9 వైకల్యంగా వర్గీకరించింది. అంటే ఇది 20% శాశ్వత వైకల్య రేటింగ్‌కు సమానం. దాంతో ఈ ఘటనకు కారణమైన వధువువరులకు, మరో తొమ్మిది మందిపై వైద్య ఖర్చులు, మానసిక క్షోభకు పరిహారంగా 32 లక్షలు చెల్లించమని ఆదేశించింది చైనా కోర్టు.
వివాహ నిర్వాహకులకు ఈ ఫ్రాంక్ గురించి తెలిసినప్పుడు తగిన జాగ్రత్తలు లేదా ఆపడంలో ఎందుకు విఫలమైందంటూ చురకలంటించింది. ఈ దుశ్చర్యకు గానూ ఆ నష్టపరిహారాన్ని.. ఆ నూతన వధువరులకు 40%, అలా చేయమని సూచించిన వ్యక్తికి 20%, ఆ సమయంలో ఉన్న మిగతా తొమ్మిది మందికి 40% వంతున చెల్లించాలని పేర్కొంది.
(చదవండి: Dr Deepti Sharma: ఎవరీ డాక్టర్ దీప్తి శర్మ? వైద్య విద్యలో ఏకంగా 19 పతకాలు..)


