దీని ముందు చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్‌ జుజుబీ | China's Moonshot AI Launches Kimi K3, World's Largest Open Source AI Model, Check More Details Inside | Sakshi
Sakshi News home page

దీని ముందు చాట్‌జీపీటీ, ఆంథ్రోపిక్‌ జుజుబీ

Jul 21 2026 8:50 PM | Updated on Jul 22 2026 11:30 AM

Chinas Moonshot AI claims Kimi K3 can rival OpenAI and Anthropic
  • చైనా మూన్‌షాట్ AI నుంచి కొత్త సవాలు 

కృత్రిమ మేధ (AI) రంగంలో ఆధిపత్యం కోసం అమెరికా-చైనా మధ్య పోటీ మరింత తీవ్రమైంది. చైనా స్టార్టప్ మూన్‌షాట్ AI తన కొత్త 'కిమి' AI మోడల్‌ను విడుదల చేయడంతో ఈ పోటీ కొత్త మలుపు తిరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్-సోర్స్ AI మోడల్‌గా కంపెనీ చెప్పుకుంటోంది. ఈ మోడల్ ఉచితంగా, ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంది.

కోడింగ్ సామర్థ్యంలో ఇది నంబర్-1గా నిలిచిందని కంపెనీ అంటోంది. అంతేగాక, లోతైన ఆలోచనా సామర్థ్యం (డీప్ థింకింగ్) కలిగి ఉంటూనే, చాలా తక్కువ ఖర్చుతో నడుస్తుంది. కిమి కె-3 మోడల్ పనితీరు ఓపెన్AI, ఆంథ్రోపిక్‌ వంటి అమెరికన్ కంపెనీల మోడళ్లకు దాదాపు సమానంగా ఉండటంతో అమెరికా టెక్ వర్గాల్లో కలకలం రేగింది.

విశేషమేమిటంటే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రపంచవ్యాప్తంగా AI అభివృద్ధిపై తన అభిప్రాయాన్ని పంచుకున్న సమయంలోనే ఈ మోడల్ విడుదల కావడం. చైనాను ఓపెన్-సోర్స్ విధానానికి మార్గదర్శిగా జిన్‌పింగ్ చిత్రీకరించారు. AI అభివృద్ధి చేయడమనేది ఏ దేశానికి సొంతం కాదని, ఇది ప్రపంచ దేశాల సమష్టి సహకారంతో సాగాల్సిన ప్రక్రియ అని ఆయన అన్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం AIలో అమెరికా ఆధిక్యతను వ్యూహాత్మక అవసరంగా భావిస్తున్నారు.

గత 18 నెలల్లో చైనా టెక్ కంపెనీలు తక్కువ కంప్యూటింగ్ వనరులతోనే అమెరికన్ మోడళ్లకు దీటుగా పనిచేసే ఓపెన్-సోర్స్ AI మోడళ్లను వరుసగా విడుదల చేస్తున్నాయి. మెరుగైన పనితీరు, తక్కువ ఖర్చు కలగలిసిన ఈ కాంబినేషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు చైనా AI వ్యవస్థలవైపు మొగ్గు చూపుతున్నారు. మూన్‌షాట్ తాజా మోడల్ ఈ ధోరణికి మరింత ఊతమిచ్చింది.

ఇదే సమయంలో, మెటా ప్లాట్‌ఫామ్స్ AI స్టార్టప్ ఆంత్రోపిక్‌కు కంప్యూటింగ్ పవర్ అందించేందుకు భారీ చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లు ఉండొచ్చని, ఇది రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రకటనల వ్యాపారానికి మించి, భారీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల నుంచి కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించే ప్రయత్నంలో మెటా ఉంది. పలు దేశాల్లో వ్యాజ్యాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రధాన ప్రకటనల వ్యాపారంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కంపెనీ భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement