‘హౌసింగ్‌’లో ఇంత భారీగా పెట్టుబడులు ఎందుకు తగ్గాయ్‌? | Housing Investments fall 85 percent 2026 India Real Estate institutional investments | Sakshi
Sakshi News home page

‘హౌసింగ్‌’లో ఇంత భారీగా పెట్టుబడులు ఎందుకు తగ్గాయ్‌?

Jul 22 2026 4:40 PM | Updated on Jul 22 2026 5:22 PM

Housing Investments fall 85 percent 2026 India Real Estate institutional investments

న్యూఢిల్లీ: దేశీయ గృహ నిర్మాణ (హౌసింగ్‌) రంగంలోకి సంస్థాగత పెట్టుబడులు ఈ ఏడాది (2026) తొలి ఆరు నెలల్లో భారీగా తగ్గాయి. జనవరి–జూన్‌ మధ్య కాలంలో హౌసింగ్‌ విభాగంలోకి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు 85 శాతం క్షీణించి 153.62 మిలియన్‌ డాలర్లకు (15.36 కోట్ల డాలర్లు) పరిమితమైనట్లు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ‘కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌’ వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ సెగ్మెంట్‌లో 1,019.88 మిలియన్‌ డాలర్ల (101.98 కోట్ల డాలర్లు) పెట్టుబడులు వచ్చాయి.

అయితే, మొత్తం రియల్‌ ఎస్టేట్‌ రంగానికి వచ్చిన సంస్థాగత పెట్టుబడులు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 2026 తొలి అర్ధభాగంలో మొత్తం పెట్టుబడులు 6 శాతం పెరిగి 3.46 బిలియన్‌ డాలర్లకు చేరగా, గత ఏడాది(2025) ఇదే కాలంలో ఇవి 3.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధానంగా స్వదేశీ ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన నిధులే ఈ వృద్ధికి కారణమని సంస్థ పేర్కొంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని ఇతర విభాగాలతో పోలిస్తే కార్యాలయాలు (ఆఫీసులు),  డేటా సెంటర్‌ ప్రాజెక్టులకే ఎక్కువ నిధులు వచ్చాయి. మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026 తొలి ఆరు నెలల్లో స్వదేశీ సంస్థాగత పెట్టుబడులు 2.2 బిలియన్‌ డాలర్లుగా నమోదుకాగా, విదేశీ సంస్థాగత పెట్టుబడులు 1.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వివిధ రంగాలవారీగా పెట్టుబడులు

  • ఆఫీస్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగం అత్యధిక నిధులను ఆకర్షించింది. గతేడాది జనవరి–జూన్‌లో ఈ విభాగంలోకి 729.48 మిలియన్‌ డాలర్ల నిధులు కాగా, ఈ ఏడాది అది ఏకంగా రెండు రెట్లకు పైగా పెరిగి 1,970.74 మిలియన్‌ డాలర్లకు చేరింది.

  • డిజిటల్‌ మౌలిక సదుపాయాలకు డిమాండ్‌ పెరుగుతుండటంతో డేటా సెంటర్‌ ప్రాజెక్టుల్లోకి 838.97 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గతేడాది ఈ విభాగంలో ఎలాంటి పెట్టుబడులు రాకపోవడం గమనార్హం.  

  • రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు 542.38 మిలియన్‌ డాలర్ల నుంచి 161.53 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

స్వదేశీ ఇన్వెస్టర్లే కీలకం 
‘‘స్థిరమైన ఆదాయ సామర్థ్యం, అధిక లిక్విడిటీ కారణంగా ఆఫీస్‌ విభాగంపై పెట్టుబడిదారుల ఆసక్తి కొనసాగుతోంది. దేశంలో డిజిటల్‌ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తుండటంతో డేటా సెంటర్లలోనూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ పెరగుతున్నాయి. ఈ ధోరణి రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులను మరింత వైవిధ్యభరితంగా, స్థిరంగా మారుస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్థంలోనూ స్వదేశీ పెట్టుబడిదారుల మద్దతుతో పెట్టుబడుల ప్రవాహం స్థిరంగా కొనసాగే అవకాశముంది’’ అని కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమీ థామస్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement