రూ.23 లక్షల కోట్లు కాదు.. వచ్చింది రూ.6,962 కోట్లే | Centre Contradicts AP Govt's ₹23 Lakh Crore Investment Claims in Parliament, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.23 లక్షల కోట్లు కాదు.. వచ్చింది రూ.6,962 కోట్లే

Jul 22 2026 5:00 AM | Updated on Jul 22 2026 12:10 PM

The Center has clarified the real issue on investments in AP

టీడీపీ మహానాడు సందర్భంగా 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చంద్రబాబు చెప్పిన వార్త , గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.6,962 కోట్ల మాత్రమేనని కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద లిఖితపూర్వకంగా లోక్‌సభలో సమాధానమిచ్చిన కాపీ

పార్లమెంట్‌ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు బట్టబయలు

ఏపీలో పెట్టుబడులపై అసలు విషయం తేల్చేసిన కేంద్రం 

రెండేళ్లలో రాష్ట్రంలోకి వచ్చిన ప్రాజెక్టుల సంఖ్య కేవలం 10 

ఇందులో నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నవి రెండు ప్రాజెక్టులే

మొత్తం పది ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఉద్యోగాలు 22,167 మాత్రమే

వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు 

కేంద్ర మంత్రి జితిన్‌ ప్రసాద సమాధానం  

సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఎక్కడ రూ.23 లక్షల కోట్లు..? ఎక్కడ రూ.6 వేల కోట్లు..? ఎక్కడైనా పొంతన ఉందా? పోనీ అవైనా పూర్తిగా వచ్చాయా అంటే అదీ లేదు! ‘‘రెండేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయ్‌.. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం.. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వచ్చేశాయ్‌..!’’ సీఎం చంద్రబాబు పదేపదే చెప్పే గొప్పలివీ! రెండు నెలల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడూ సేమ్‌ టూ సేమ్‌ బిల్డప్‌లు!! కానీ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇందులో అణువంతైనా నిజం లేదని కుండబద్ధలు కొట్టింది. 

దావోస్‌లో మీటింగ్‌లు.. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలు.. సింగపూర్‌ యాత్రలు.. విశాఖ వేదికగా సీఐఐ పెట్టుబడుల సమావేశం.. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్‌ఐపీబీ ద్వారా చేసుకుంటున్న బూటకపు ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం తెర దించింది. లోక్‌సభ సాక్షిగా పెట్టుబడులపై వాస్తవ గణాంకాలను వెల్లడించింది. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. 

డీపీఐఐటీ, ఇన్వెస్ట్‌ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో ఏపీకి మొత్తం పది ప్రాజెక్టులు రాగా అందులో కేవలం రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్‌ ప్రసాద మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే..  
గత రెండేళ్లలో ఏపీకి వచ్చిన ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ రూ.6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు. ఆ ప్రాజెక్టులు పూర్తయి, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వస్తాయని అంచనా వేసిన ఉద్యోగాలు మాత్రమే. వాస్తవంగా ఇప్పటివరకు ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అనే వివరాలను కేంద్రం తన సమాధానంలో వెల్లడించలేదు. 

వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం కాబట్టి ఎన్నికల హామీల్లో పేర్కొన్న నిరుద్యోగ భృతి ఇక ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు సర్కారు నమ్మబలుకుతోంది. మొత్తంగా చంద్రబాబు సర్కారు చేస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి.. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమైంది. రెండేళ్లలో పూర్తయినవి రెండంటే రెండు పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే కాగా మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్రం సమాధానంలో వెల్లడైంది.

వైఎస్‌ జగన్‌ హయాంలో వచ్చినవే.. 
ఆంధ్రప్రదేశ్‌ మీదుగా వెళ్లే మూడు పారిశ్రామిక కారిడార్లలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిలను మేకిన్‌ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు జితిన్‌ ప్రసాద తన సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్‌ దక్కించుకుందని, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్స్‌ ఈఎంసీ 2.0 కింద రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. అయితే ఇవన్నీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో వచ్చినవే కావడం గమనార్హం. ఓర్వకల్లు వద్ద దేశంలో తొలి డ్రోన్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, దీని ద్వారా 40,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement