సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.
రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.
16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!
ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్‌సీపీ అంటోంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.
స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణం
స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.
మెరిట్ జాబితాలపై ప్రశ్నలు
గతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్‌సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.


