48,777 ఉద్యోగాలు హుష్‌కాకి
వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమాధానం
సాక్షి, అమరావతి: లోక్‌సభ సాక్షిగా చంద్రబాబు సర్కార్ నిర్వాకం బట్టబయలైంది. రాష్ట్రంలో కొత్తగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) స్థాపన మాటదేవుడెరుగు.. రెండేళ్లలోనే 4,520 ఎంఎస్‌ఎంఈలు మూతపడ్డాయి. దీనివల్ల 48,777 మంది ఉపాధి కోల్పోయారు. లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఎంఎస్‌ఎంఈ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024–25లో 1,388 సూక్ష్మ, 13 చిన్న కలిపి 1,401 పరిశ్రమలు, 2025–26లో 2,397 సూక్ష్మ, 10 చిన్న కలిపి 2,407 పరిశ్రమలు, 2026–27లో జూన్ 30 వరకూ 706 సూక్ష్మ, 6 చిన్న వెరసి 712 పరిశ్రమలు మూతపడ్డాయి. దీనివల్ల 48,777 మంది ఉపాధి కోల్పోయారు.
చంద్రబాబు సర్కార్ ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవడం వల్లే.. ఎంఎస్‌ఎంఈలు ఆరి్థక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఇదే అంశంపై చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ కొన్నాళ్లుగా ఏపీఐఐసీ కార్యాలయం వద్ద ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేస్తుండటం గమనార్హం. రెండేళ్లలో 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయని.. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశామని.. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వచ్చేశాయని పెదబాబు, చినబాబు చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఎత్తి చూపించడం గమనార్హం.
దావోస్ మీటింగ్‌లు, పెట్టుబడుల ఆకర్షణ అంటూ విదేశీ పర్యటనలు, విశాఖ వేదికగా సీఐఐ పెట్టుబడుల సమావేశం, ప్రతీ 15 రోజులకు ఒకసారి ఎస్‌ఐపీబీ ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు అంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ సాక్షిగా వాస్తవ గణాంకాలను వెల్లడించింది. గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలోకి రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డీపీఐఐటీ, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో రాష్ట్రానికి మొత్తం 10 ప్రాజెక్టులు రాగా.. అందులో రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లిఖితపూర్వక సమాధానం ఇవ్వడం గమనార్హం.
ఈ ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి రూ.6,962 కోట్లని, వీటిద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు. ప్రాజెక్టులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏర్పడవచ్చని అంచనా వేసిన ఉద్యోగాలు మాత్రమే.


