సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. యాక్సిడెంట్ సంబంధిత కేసులో ఆయన పేరును ఏ3గా చేర్చి.. సెక్షన్లను మార్చేసి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. మరోవైపు రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదని, వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారని అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని భార్య శ్రీదేవి మండిపడ్డారు. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చడం బాధాకరమన్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇటు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. పీఎస్‌లోనే సీదిరి అప్పలరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు వైఎస్సార్‌సీపీ నేతలు ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటుండడంతో కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.
రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు అప్పలరాజును బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఆయన్ని చొక్కా పట్టుకుని లాక్కెల్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే రాత్రంత కాశీబుగ్గ స్టేషన్‌లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపులో భాగమని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.
వైద్య పరీక్షల కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి..
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైద్య పరీక్షల నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీదిరిని ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీస్ బృందం. వైద్య పరీక్షల తర్వాత సీదిరి అప్పలరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అప్పలరాజు తరలింపుతో పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు..
పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ పీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ను అడ్డుకున్న పోలీసులు.. సీదిరి అప్పలరాజును కలిసేందుకు వైఎస్సార్‌సీపీ నేతలను అనుమతించలేదు.
పలాసలో ఉద్రిక్తత
అప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో పలాసలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్‌కు నిరసనగా పలాసలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. పోలీస్‌స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు పలాసకు చేరుకుంటున్నారు.
‘వైద్యం అవసరమైన సమయంలో అరెస్ట్ చేశారు’
‘‘రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసును నేరపూరిత హత్య కేసుగా మార్చడం బాధాకరం. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు’’ అని అప్పలరాజు భార్య శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడిపై కావాలనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
వైఎస్ జగన్ ఆగ్రహం
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేందుకు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తున్నారని, అరెస్టులతో వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరని జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
కేసు విషయంలో రాజకీయ దుమారం
రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులోనే అప్పలరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా.. ఇది కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్‌సీపీ అంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పలరాజు ఆరోగ్యం, అరెస్ట్ పరిణామాలు, పలాసలో కొనసాగుతున్న నిరసనలపై ఉత్కంఠ కొనసాగుతోంది.


