పల్నాడు జిల్లాలో మట్టి టిప్పర్ చక్రాల కింద నలిగి డ్రైవర్ మృతి
చంద్రబాబు పాలనలో రెచ్చిపోతున్న మాఫియాలు
యథేచ్ఛగా ఇసుక, మట్టి అక్రమ రవాణా
ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం
అయినా తీరని అధికారపార్టీ ధనదాహం
చంద్రబాబు పాలనలో పేట్రేగిపోతున్న ఇసుక, మట్టి మాఫియాలకు సామాన్యులు బలవుతున్నారు. అధికారపార్టీ
ధన దాహానికి ప్రాణాలు కోల్పోతున్నారు. పాలకుల పాపానికి తాజాగా ముగ్గురు బలయ్యారు. వైఎస్సార్ కడపజిల్లాలో ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు, పల్నాడు జిల్లాలో మట్టి టిప్పర్ చక్రాల కింద నలిగి ఒకరు మరణించారు. ఈ దుర్ఘటనలు అధికారపార్టీ అరాచకాలకు పరాకాష్టగా నిలిచాయి. అయినా సర్కారులో చలనం లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మాఫియాలను కట్టడి చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.
రాజంపేట/సాక్షి, నరసరావుపేట: తెలుగుదేశం కూటమి నేతల ఇసుక, మట్టి మాఫియాలకు బుధవారం ముగ్గురు బలయ్యారు. వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం ఉప్పరపల్లె సమీపంలో ఇసుక టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. సుండుపల్లెలో జరిగే గొర్రెల సంతకు చిన్నగొల్లపల్లెకు చెందిన గొర్రెల వ్యాపారులు అబ్బన్నగారి జయరామ (45), రెడ్డిచర్ల రవీంద్ర (42) బుధవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యంలో వీరి బైక్‌ను ఉప్పరపల్లె సమీపంలో బాలరాచపల్లె నుంచి అతివేగంగా వస్తోన్న ఇసుక టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టి, కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
అయినా టిప్పర్ డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సురేష్‌బాబు ఘటనాస్థలికి వచ్చి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించడానికి యత్నించారు. దీంతో మృతుల కుటుంబీకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాల తరలింపును అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకోవాలని, డ్రైవర్‌ను అరెస్టు చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. వారికి పోలీసులు సర్దిజెప్పడంతో ఆందోళనను విరమించారు.
ఇదిలా ఉంటే మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి రూ.20లక్షల పరిహారమివ్వాలని రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబీకులు, స్థానికులతో కలిసి ఆయన రహదారిపై బైఠాయించారు. కలెక్టరు, ఎస్పీలతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఇసుక మాఫియాను కట్టడి చేయాలని, ఈ ప్రాంతంలో ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నిద్రిస్తున్న డ్రైవర్‌పై నుంచి వెళ్లిన మట్టి టిప్పర్..
అధికారపార్టీ నేతల అక్రమ మైనింగ్ ఓ నిండుప్రాణాన్ని బలిగొంది. పేద కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలో నల్లఎర్ర చెరువులో మట్టిని టీడీపీకి చెందిన అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తున్నారు. డ్రైవర్లకు ఎక్కువ వేతనం ఆశచూపి పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ ఆవుల నాగార్జున(35) ఎక్కువ జీతం వస్తుందన్న ఆశతో మట్టి టిప్పర్ డ్రైవర్‌గా చేరాడు. మట్టి మాఫియా ఒప్పందం మేరకు 24 గంటలూ (నైట్‌షిఫ్టులూ) పని చేస్తున్నాడు.
మంగళవారం అర్ధరాత్రి వరకు టిప్పర్ తోలిన అతను అలసి నల్లఎర్రచెరువు వద్దే కింద నిద్రకు ఉపక్రమించాడు. ఈ సమయంలో అతను నిద్రపోతున్న విషయం గమనించని మరో టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని తోలడంతో చక్రాల కింద నలిగి నాగార్జున మరణించాడు. నాగార్జునకు భార్య గంగతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె ఆరోతరగతి చదువుతుండగా కుమారుడు ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ ఘటనతో సహచర డ్రైవర్లూ దిగ్భ్రాంతికి గురయ్యారు. విగతజీవిగా పడి ఉన్న నాగార్జున మృతదేహం వద్ద భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు విలపించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
మట్టి మాఫియా బరితెగింపు
ప్రమాదం జరిగి ఓ వ్యక్తి మరణించినా మట్టి మాఫియా చలించలేదు. మట్టి తవ్వకాలు, రవాణాకు ఆటంకం కలగకుండా ఘటన జరిగిన వెంటనే మృతదేహాన్ని ఆటోలో గ్రామంలోకి తరలించారు. దీంతో మృతుని కుటుంబసభ్యులు, బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామస్తులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్న సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్‌ఐ కె.సతీష్ ఆందోళనకారులతో మాట్లాడారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు.


