గోల్డ్‌ రుణాల్లోకి గోద్రెజ్‌ క్యాపిటల్‌ | Godrej Capital acquired Kanakadurga Finance gold loan business | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ రుణాల్లోకి గోద్రెజ్‌ క్యాపిటల్‌

Jul 23 2026 5:31 AM | Updated on Jul 23 2026 6:29 AM

Godrej Capital acquired Kanakadurga Finance gold loan business

రూ.117 కోట్లకు కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ వ్యాపారం కొనుగోలు 

కన్జ్యూమర్‌ ఫైనాన్స్‌ రంగంలో పటిష్టత కోసం వ్యూహాత్మక అడుగు

ముంబై: ఎన్‌బీఎఫ్‌సీ గోద్రెజ్‌ క్యాపిటల్‌ పసిడి రుణాల రంగంలోకి అడుగుపెట్టింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ వ్యాపారాన్ని రూ.117 కోట్లకు కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ గోద్రెజ్‌ ఫైనాన్స్‌ ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. 2031 నాటికి రూ.1 లక్ష కోట్ల అసెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ (ఏయూఎం)ను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

అలాగే 10 లక్షలకు పైగా వినియోగదారులకు సేవలు అందించాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ వ్యూహాత్మక కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించింది. కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ విభాగానికి ప్రస్తుతం రూ.280 కోట్ల ఏయూఎం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 54 శాఖలు, దాదాపు 12 వేల మంది వినియోగదారులు, సుమారు 250 మంది అనుభవం కలిగిన ఉద్యోగులు ఉన్నారు. ఈ కొనుగోలుతో గోల్డ్‌ లోన్‌ విభాగంలో కార్యకలాపాలను వేగంగా విస్తరించగలమని గోద్రెజ్‌ క్యాపిటల్‌ తెలిపింది.  

తొలి వ్యూహాత్మక కొనుగోలు 
‘‘కనకదుర్గ ఫైనాన్స్‌ గోల్డ్‌ లోన్‌ వ్యాపార కొనుగోలు గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రయాణంలో కీలక మైలురాయి. రాబోయే అయిదేళ్లలో రూ.1 లక్ష కోట్ల ఏయూఎంను లక్ష్యంగా పెట్టుకున్న మా ప్రణాళికలో ఇదే తొలి వ్యూహాత్మక కొనుగోలు’’ అని గోద్రెజ్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈవో మనీష్‌ షా తెలిపారు. ప్రస్తుతం గోద్రెజ్‌ క్యాపిటల్‌ ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ రుణాలు, గృహ రుణాల వ్యాపారంలో ఉంది. గత నెలలో గోద్రెజ్‌ క్యాపిటల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను ప్రారంభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement