22ఏలో ఉన్నా పట్టా భూమి రిజిస్ట్రేషన్ | Government issues new guidelines on list of prohibited assets | Sakshi
Sakshi News home page

22ఏలో ఉన్నా పట్టా భూమి రిజిస్ట్రేషన్

Jul 23 2026 5:36 AM | Updated on Jul 23 2026 5:36 AM

Government issues new guidelines on list of prohibited assets

నిషేధిత ఆస్తుల జాబితాపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు 

సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్‌లో పట్టాగా నమోదైన భూమి నిషేధిత జాబితాలో కనిపిస్తున్నా సరే రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనని ప్రభుత్వం సబ్‌ రిజిస్ట్రార్లకు స్పష్టం చేసింది. పొరపాటున 22ఏ జాబితాలో చేరిన పట్టా భూములను ఆర్డీవో వెంటనే తొలగించాలని ఆదేశించింది. నిషేధిత ఆస్తుల జాబితా నిర్వహణపై రెవెన్యూ శాఖ బుధవారం జీవో ఎంఎస్‌ నంబర్‌ 444 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో జిల్లాకి ఒక్కోలా 22ఏ జాబితా ఉండడంతో సొంత ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు పడుతున్నారని, అందుకే కొత్త విధానాన్ని తెస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొంది. 22ఏ భూములకు సంబంధించిన పాత సర్క్యులర్లు, మెమోలన్నీ రద్దు చేసింది. 

కొత్త ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది. ఇనాం, షరతులు గల పట్టా భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలని, గ్రామకంఠం భూములు 22ఏ జాబితాలో ఉండకూడదని స్పష్టం చేసింది. సర్వే నంబరులో కొంత నిషేధిత భూమి ఉంటే, మిగతా భాగాలకు రిజిస్ట్రేషన్‌ చేయాలని పేర్కొంది. 2007 జూన్‌ 20వ తేదీకి ముందు లింక్‌ డాక్యుమెంట్లున్న పట్టణ స్థలాలకు రిజిస్ట్రేషన్‌ ఆపకూడదని, రికార్డుల్లో గుర్తించలేని ఎంట్రీలు రిజిస్ట్రేషన్‌కు అడ్డంకి కాదని తెలిపింది. జీఓలోని ఇతర అంశాలు..  

రాష్ట్రమంతటికీ ఒకే జాబితా 
» ఐజీఆర్‌ఎస్‌ వద్ద ఉండే ఒకే కేంద్రీకృత డేటాబేసే రాష్ట్రమంతటికీ ఆధారం. వేరే జాబితా చూపి రిజిస్ట్రేషన్‌ ఆపితే ఆ అధికారిపై చర్యలు 
» సేద్య భూముల డేటా వెబ్‌ల్యాండ్‌ 2.0 నుంచి నేరుగా, ఆటోమేటిక్‌గా (ఏపీఐ ద్వారా) వస్తుంది. ఏ అధికారీ చేతితో ఎంట్రీలు చేయకూడదు 
» రిజిస్ట్రేషన్‌ సమయంలో వెబ్‌ల్యాండ్‌ 2.0 నుంచి భూమి వివరాలు సక్రమంగా వస్తే వేరే అంశాలు చూడకుండా రిజిస్ట్రేషన్‌ చేయాలి 
» రీసర్వే పూర్తి కాని పాత (వెబ్‌ల్యాండ్‌ 1.0) గ్రామాల్లో రీసర్వే అయ్యేవరకు ప్రస్తుత జాబితాయే కొనసాగుతుంది 
» డబుల్‌ ఎంట్రీలను మూడు నెలల్లో తొలగించాలి. ప్రతివారం వెబ్‌ల్యాండ్‌తో జాబితా సరిపోల్చాలి 
» పట్టణాల్లో ప్రభుత్వ, మున్సిపల్, దేవదాయ, వక్ఫ్‌ భూములను మాత్రమే జాబితాలో చేర్చాలి 

అప్పీలు.. రివిజన్‌ వ్యవస్థ 
» 22ఏ జాబితాలో చేర్పు, తొలగింపు నిర్ణయాధికారం ఆర్డీవో లేదా సబ్‌ కలెక్టర్‌ది  
» ఆర్డీవో నిర్ణయంపై 60 రోజుల్లోగా జాయింట్‌ కలెక్టర్‌ వద్ద అప్పీలు చేసుకోవచ్చు 
»  జాయింట్‌ కలెక్టర్‌ 60 రోజుల్లో నిర్ణయం చెప్పి వారంలోగా జాబితాలో మార్పు చేయాలి 
» ఆపైన 90 రోజుల్లోగా ప్రభుత్వం వద్ద రివిజన్‌కు అవకాశం. అప్పీలు గడువులోగా తేలకపోయినా రివిజన్‌కు వెళ్లవచ్చు 
» సీసీఎల్‌ఏ వద్ద పెండింగ్‌లో ఉన్న అప్పీళ్లు, రివిజన్లన్నీ ప్రభుత్వానికి బదిలీ 
» వ్యవసాయ భూమి ఎకరం దాటినా, ఇతర స్థలం వెయ్యి చదరపు గజాలు దాటినా 22ఏ జాబితాలో చేర్చే తుది నిర్ణయం ప్రభుత్వానిదే 
» కోర్టు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఆదేశిస్తే సబ్‌ రిజిస్ట్రార్‌ ఐదు రోజుల్లో పై అధికారులకు తెలియజేయాలి. 15 రోజుల్లో లేదా కోర్టు గడువులోగా నిర్ణయం తీసుకోవాలి. ఆలస్యమైతే కోర్టు ధిక్కారమే 

జాబితా నుంచి తొలగింపులు 
»  క్రమబద్దీకరించిన యూఎల్‌సీ భూములు, రుణాల కోసం తనఖా పెట్టి వేలం అయిన భూములు, చట్ట ప్రకారం వేలంలో కొన్న దేవదాయ/వక్ఫ్‌ భూములు ఆధారాలతో తొలగింపు 
» 1954 జీవో 1142కు ముందు అసైన్‌ చేసిన భూములు జాబితా నుంచి తొలగింపు  
» అప్రూవ్డ్‌ లేఅవుట్‌లోని స్థలాలకు లేఅవుట్‌ అనుమతి, పాత రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్‌ ఉంటే రిజిస్ట్రేషన్‌ 
» ఏపీఐఐసీ, మారిటైమ్‌ బోర్డు భూములకు కొత్త వర్గీకరణ. ఆ సంస్థల అభ్యర్థనపై సీసీఎల్‌ఏ ఆమోదంతో తొలగించి ’పట్టా’గా మార్పు 
» నీటి వనరులు, మార్కెట్‌ విలువ చెల్లించి పొందిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా తొలగించకూడదు 
» దేవదాయ, వక్ఫ్, అటవీ, అసైన్డ్, సీలింగ్, భూదాన్‌ భూములు యథావిధిగా 22ఏ జాబితాలోనే 
» దేవదాయ, వక్ఫ్‌ జాబితాలను ఆయా శాఖలు వెబ్‌ల్యాండ్‌తో సరిపోల్చి ఆరు నెలల్లో ధ్రువీకరించాలి రిజిస్టరింగ్‌ అధికారుల బాధ్యతలు 
» రిజిస్ట్రేషన్‌ తిరస్కరిస్తే సర్వే నంబరు, విస్తీర్ణం, 22–ఎ కేటగిరీ, కారణాలతో రాతపూర్వక ఉత్తర్వు ఇచ్చి, దాని కాపీని పార్టీకి ఇవ్వాలి 
» జాబితా నుంచి తొలగించిన భూముల వివరాలు ప్రత్యేక రికార్డులో ఉంచాలి. అలాంటి భూములకు రిజిస్ట్రేషన్‌ ఆపకూడదు 
» అధికారుల నిర్ణయాల్లో 5 శాతం కేసులకు కంప్యూటర్‌ ర్యాండమ్‌ ఎంపికతో వేరే జిల్లా అధికారులు ఆడిట్‌ చేయాలి 

మాన్యువల్‌ ఎంట్రీలకు స్వస్తి: మంత్రి  
22ఏ జాబితాలో ఉన్న నిషేధిత భూములపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులన్నింటినీ రద్దు చేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూ రికార్డుల్లో అక్రమంగా మార్పులకు ఆస్కారమిచ్చే మాన్యువల్‌ ఎంట్రీలకు స్వస్తి పలుకుతున్నామని చెప్పారు. సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయాల ప్రైవేటీకరణ జరుగుతోందనే ప్రచారం సరికాదన్నారు. పీపీపీ మోడల్‌లో ప్రైవేటు భాగ స్వా మి భవనాలు, ఫర్నిచర్, నాన్‌–స్టాట్యుటరీ మౌలిక వసతుల కల్పనకే పరిమితమవుతారని తెలిపారు. 

నోటీసు ఇవ్వకుండా చేర్చకూడదు 
» ఏ భూమినైనా నిషేధిత జాబితాలో చేర్చే ముందు యజమానికి నోటీసు తప్పనిసరి. 15 రోజుల గడువిచ్చి, అభ్యంతరాలు తీసుకున్నాక తగిన కారణాలతో కూడిన ఉత్తర్వు ఇచ్చాకే చేర్చాలి 
» నివాస భూమి అయితే వారికి నోటీసు,  విచారణ లేకుండా చేర్చకూడదు. అలా చేస్తే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు 
» సర్వే నంబరు, సబ్‌–డివిజన్, విస్తీర్ణం, పట్టాదారు పేరు వివరాలు లేకుండా చేర్చరాదు.  
» బహుళ పట్టాదారులున్న సర్వే నంబరును ముందు సబ్‌–డివిజన్‌ చేశాకే చేర్చాలి 
» పట్టణ స్థలాలకు జియో–కోఆర్డినేట్లు నమోదు తప్పనిసరి 

గెజిట్‌ లేకుండా  
» ప్రభుత్వ, స్థానిక సంస్థలు, విద్య, మత, ధార్మిక సంస్థల ప్రయోజనాలున్న భూములను (22–ఎ(1)(ఇ)) జాబితాలో చేర్చాలంటే  గెజిట్‌ నోటిఫికేషన్‌ తప్పనిసరి 
» కోర్టు కేసులు, ’ఇతరాలు’ ఎంట్రీలు చెల్లుబాటయ్యే కోర్టు ఉత్తర్వు, గెజిట్‌ రెండూ ఉంటేనే నిలుస్తాయి. మూడునెలల్లో స్కాన్డ్‌ కాపీలు అప్‌లోడ్‌ చేయాలి, లేకుంటే జాబితా నుంచి తొలగింపు 
» గెజిట్‌ నోటిఫికేషన్‌ లేని సీలింగ్‌ ఎంట్రీలను తొలగిస్తారు 
» యూఎల్‌సీ భూముల్లో ప్రభుత్వం స్వాదీనం  చేసుకున్న భాగాన్ని విడిగా సబ్‌–డివిజన్‌ చేస్తేనే జాబితాలో పెట్టాలి. కొంత భాగం కోసం మొత్తం సర్వే నంబరును నిషేధించకూడదు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement