5 గంటలు చర్చించి ఉసూరుమనిపించిన మంత్రులు
పీఆర్సీ, ఐఆర్, 5 డీఏలు, బకాయిలపై స్పష్టత లేదు
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం హామీలకే పరిమితం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ తీవ్ర నిరాశే మిగిల్చింది. పీఆర్సీ, ఐఆర్, పెండింగ్ డీఏలు సహా ఇతర డిమాండ్లలో ఏ ఒక్క దానిపైనా స్పష్టత ఇవ్వలేదు. వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఇతర ఉన్నతాధికారులు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు.
దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పీఆర్సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, రూ.వేల కోట్ల బకాయిల చెల్లింపులకు రోడ్‌మ్యాప్ ప్రకటించాలనే ప్రధాన డిమాండ్లను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే ఏ అంశంపైనా స్పష్టత ఇవ్వకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో ఉద్యోగుల్లో మరోసారి నిరాశ నెలకొంది.
స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్
సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమకు న్యాయంగా రావాల్సిన వాటి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. 12వ పీఆర్సీ కమిషనర్‌ను వెంటనే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ ఐదు డీఏలను విడుదల చేయాలని, పేరుకుపోయిన రూ.40 వేల కోట్లకుపైగా బకాయిలపై ఉద్యోగుల వారీగా లెక్కలు వెల్లడిస్తూ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆలస్యం చేయకుండా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నేపథ్యంలో నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని, ఆగస్టు 31 వరకు పదోన్నతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం, గ్రామ రెవెన్యూ సహాయకుల వేతనాల పెంపు అంశాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షుడు ఆలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని ఇప్పటికీ నియమించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురి చేస్తోందన్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేసి, అంతవరకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, మిగిలిన బకాయిల చెల్లింపులకు స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ–వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు, పదోన్నతులపై ఉన్న ఫ్రీజింగ్ ఉత్తర్వుల ఎత్తివేత తదితర అంశాలను కూడా ప్రస్తావించారు. ఏపీటీఎఫ్ నాయకుడు జి. హృదయరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పే స్లిప్‌లో చూపాలని డిమాండ్ చేశారు. వీటిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పందిస్తూ అన్ని అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, శశిభూషణ్‌కుమార్, ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు.


