సర్కారును నిద్ర లేపుతాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Chandrababu Govt For Problems Of Tobacco Farmers, Demands Government Action And Market Support | Sakshi
Sakshi News home page

సర్కారును నిద్ర లేపుతాం: వైఎస్‌ జగన్‌

Jul 23 2026 5:15 AM | Updated on Jul 23 2026 11:24 AM

YS Jagan slams Chandrababu govt for Problems of tobacco farmers

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేస్తున్న పొగాకు రైతులు

పొగాకు రైతుల సమస్యలపై గట్టిగా పోరాడుతాం

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వైఎస్‌ జగన్‌ మండిపాటు 

ఈ ప్రభుత్వంలో దళారులదే రాజ్యం 

ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.. ఆక్వా రైతులదీ అదే స్థితి

వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ఎక్కడికక్కడ దోపిడీ   

సీజన్‌ ముగుస్తున్నా పొగాకు కొనుగోళ్లు లేవు.. ఇప్పటికీ కొన్నది 16.5 శాతమే 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అత్యధికంగా కేజీ రూ.411 

2023–24లో సగటున పొగాకు ధర కేజీ రూ.289 

కొనుగోళ్లు, ధర దారుణంగా పడిపోతే సీఎం ఏం చేస్తున్నారు?..ఎందుకు మార్క్‌ఫెడ్‌ను దింపలేదు? ఎందుకు లైసెన్స్‌దారులపై చర్యలు తీసుకోలేదు? 

మా హయాంలో పంటల కొనుగోలుకు రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం

10రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని రైతులకు భరోసా

రైతులకు లాభం జరగాలంటే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి. అలా ప్రభుత్వం రైతుల తరఫున నిలబడిందని సీరియస్‌గా మెసేజ్‌ ఇవ్వాలి. పొగాకు లైసెన్స్‌దారులు ఫలానా రేటుకు పంట కొంటాం.. ఇంత పరిమాణంలో మీరు పంట వేయండి.. అని చెప్పారు కాబట్టే ఆ మేరకు రైతులు పంట వేశారు. అప్పుడు వాళ్లు చెప్పిన మేరకు ఆ పరిమాణం మేర (అషూరెన్స్‌ ఇచ్చిన క్వాంటిటీ) పంటను కొనుగోలు చేసి తీరాల్సిందే.

చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పొగాకు పంటే కాదు. ఏ పంట పరిస్థితి చూసినా ఇంతే. దళారీలే వ్యవస్థను నడుపుతున్నారు. అందుకే దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితి. రైతులు విసిగిపోయి, ఏదో ఒక రేటుకు కొనండి.. మమ్మల్ని బతికించండి సామీ.. అనే పరిస్థితి. అలా రైతులు తెగనమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం దిగజారిపోతున్న దారుణ పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.
-వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో పొగాకు రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, వారి సమస్యలపై పోరాటం సాగించి అండగా.. తోడుగా నిలుస్తామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు పాలనలో అంతా దళారులదే రాజ్యం అని, వ్యాపారులంతా సిండికేట్‌గా మారి యథేచ్ఛగా దోచుకుంటున్నారని, ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదని.. చివరకు ఆక్వా రైతులదీ అదే పరిస్థితి అని గుర్తు చేశారు. సీజన్‌ ముగుస్తున్నా ఇప్పటికీ పొగాకు కొనుగోళ్లు లేవని, ఇప్పటి వరకు 20 శాతం కొనుగోళ్లు కూడా జరగలేదని చెప్పారు. నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పొగాకు సాగు చేస్తున్న రైతులు బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న జగన్‌.. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. రైతులెవ్వరూ ధైర్యం కోల్పోవద్దని, పది రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తానని.. పొగాకు రైతులను స్వయగా కలుస్తానని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం నిద్ర నటిస్తోందని.. నిద్ర పోయే వాళ్లను లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టమని.. అయినా గట్టిగా ప్రయత్నిస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొగాకు రైతులతో మాట్లాడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
 
చంద్రబాబు మాటకు విలువ లేదు
పొగాకు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికి దాదాపు 94 రోజులు అయినప్పటికీ, 20 శాతం కూడా కొనుగోలు చేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. మామూలుగా 100 రోజుల్లోనే పొగాకు కొనుగోళ్లు పూర్తి కావాలి. అలాంటిది 94 రోజులు దాటినా కూడా ఇంత వరకు కేవలం 38 మిలియన్‌ కేజీలు మాత్రమే కొనుగోలు చేశారు. పండిందేమో 232 మిలియన్‌ కేజీలు. అంటే పండిన పంటలో కేవలం 16.5% మాత్రమే కొనుగోలు చేశారు. ఇలాగైతే రైతు ఏ రకంగా బతకగలుగుతాడు? ఎన్ని రోజులు ఇలా? కర్ణాటకలో సెప్టెంబర్‌లో పొగాకు కొనుగోళ్లు మొదలవుతాయి. అప్పుడు సగం మంది ట్రేడర్లు సహజంగా అటువైపు వెళ్లిపోయే అవకాశం ఉంది. అలాగైతే తమ పంటను ఎవరు కొంటారని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సమీక్ష చేసి పొగాకు ధర కేజీ రూ.200కు తగ్గకూడదని చెప్పిన మరుసటి రోజే పొదిలిలో రూ.179, టంగుటూరు, కనిగిరిలో రూ.184, కందుకూరులో రూ.186, జంగారెడ్డిగూడెం, గోపాలపురంలో రూ.170తో కొనుగోలు చేశారంటే సిండికేట్‌ ఏ రకంగా వేళ్లూనుకుందో స్పష్టమవుతోంది. అసలు చంద్రబాబు మాటకు విలువ లేదని తేలిపోయింది.

పొగాకు బోర్డు లక్ష్యం ఏమిటి?
రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో వ్యాపారులను ఒక ప్లాట్‌ఫామ్‌ మీదకి తీసుకొచ్చి, పోటీ వాతావరణం ఏర్పడేలా చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో టుబాకో (పొగాకు) బోర్డు ఏర్పాటైంది. చంద్రబాబు ప్రభుత్వ పుణ్యాన పరిస్థితి ఎలా మారిందంటే.. ఆయన అధికారంలోకి వస్తూనే సిండికేట్‌లో అందరికీ కొమ్ములు వస్తాయి. అంతా ఏకమై ధర తగ్గించేస్తారు. చంద్రబాబు చెప్పేది చెబుతూ ఉంటాడు.. మనం చేసేది మనం చేస్తుంటాం అన్న ధైర్యంతో వారుంటారు. ఈ ఒక్క పంటే కాదు. ఏ పంట పరిస్థితి చూసినా ఇంతే. దళారీలే వ్యవస్థను నడుపుతు­న్నారు. అందుకే వెంటనే ధరలు పతనమై చివరికి ఈ రకమైన దారుణమైన రేట్లకు పడిపోయిన పరిస్థితి. రైతులు విసిగిపోయి, ఏదో ఒక రేటుకు కొనండి.. మమ్మల్ని బతికించండి సామీ.. అనే పరిస్థితి. అలా రైతులు తెగ నమ్ముకునే పరిస్థితిలోకి వ్యవసాయం దిగజారిపోతున్న దారుణ పరిస్థితి కనిపిస్తోంది.

మా ప్రభుత్వంలో ‘మార్క్‌ఫెడ్‌’ను దించాం 
ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో మన ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్‌ను పోటీగా దించాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మార్క్‌ఫెడ్‌ను ప్లాట్‌ఫామ్‌ మీదకు తీసుకొచ్చి కొనుగోళ్లలో భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేశాం. రైతుల తరఫున మార్క్‌ఫెడ్‌ రంగ ప్రవేశం చేయడంతో మార్కెట్లో పోటీ మొదలైంది. ఫలితంగా సిండికేట్‌ను బ్రేక్‌ చేశాం. ఇలా ప్రభుత్వం ఎప్పుడైతే సీరియస్‌గా తీసుకోవడం మొదలు పెట్టిందో, అప్పుడు భయం మొదలై రేట్లు పెరిగాయి. ఆ మేరకు 2023–24లో మా ప్రభుత్వ హయాంలో కిలో పొగాకు సగటు ధర రూ.289 కాగా, ఆ ఏడాది అత్యధికంగా కిలోకు రూ.411 వరకు ధర లభించింది. అది అత్యుత్తమ ధర అని అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా రిపోర్టు ఇచ్చింది.

మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? 
ఈ రోజు చంద్రబాబు చెప్పిన తర్వాత కూడా రేట్లు ఇంత దారుణంగా పడిపోతున్న పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నా. 94 రోజులు అయిపోయినా కూడా కొనుగోలు చేసింది కేవలం పండిన పంటలో 16.5% మాత్రమే. అంత తక్కువ పంట కొనుగోలు చేసిన పరిస్థితి ఒకవైపున ఉంటే, మరోవైపు నో బిడ్స్‌.. భారీగా పొగాకు బ్యారెళ్లు తిరస్కరణకు గురవడం కనిపిస్తోంది. ఇలా చేస్తున్న కంపెనీలపై చంద్రబాబు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఇంతవరకు ఎన్ని కేసులు పెట్టారు? ఎన్ని లైసెన్సులు సస్పెండ్‌ చేశారు? ఎంత మందిని బ్లాక్‌ లిస్టులో పెట్టారు? అంటే ఇంత వరకు ఏ ఒక్కరి లైసెన్స్‌ను సస్పెండ్‌ చేయలేదు. ఎవరినీ బ్లాక్‌ లిస్టులో పెట్టలేదు. చంద్రబాబు ఏ రకమైన భయాన్ని కలిగించకుండా, మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి రానివ్వకుండా మొత్తం అడ్డుకుంటే రైతులకు ఏ రకంగా లాభం జరుగుతుంది?

రైతులకు లాభం జరగాలంటే.. 
రైతులకు లాభం జరగాలంటే ఒకటి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించాలి. అలా ప్రభుత్వం రైతుల తరఫున నిలబడడానికి సీరియస్‌గా ఉందని మెసేజ్‌ ఇవ్వాలి. రెండోది.. లైసెన్స్‌దారులకు లైసెన్సులు ఎందుకు ఇచ్చారు? వాళ్లు ఫలానా రేటుకు పంట కొంటాం.. ఇంత పంట మీరు వేయండి.. అని చెప్పారు కాబట్టే ఆ మేరకు రైతులు పంట వేశారు. అప్పుడు వాళ్లు చెప్పిన మేరకు ఆ పరిమాణం మేర (అషూరెన్స్‌ ఇచ్చిన క్వాంటిటీ) పంటను గొనుగోలు చేసి తీరాల్సిందే. రైతులు నష్టపోకుండా లాభం వచ్చే రేటుకు కొనుగోలు చేయాలి కదా? అది వారి నైతిక బాధ్యత కూడా. మరి ఆ బాధ్యతను వాళ్లు విస్మరించినప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకోకూడదు. ఈ రకంగా సిండికేట్‌గా ఏర్పడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతం ఇవ్వగలగాలి. అప్పుడే సిండికేట్‌ వ్యవస్థ బ్రేక్‌ అవుతుంది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. 

పొగాకు రైతుల సమస్యలను తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఈ ప్రభుత్వంలో అవేవీ జరగవు 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఇవేమీ జరగవు. ఆయిల్‌పామ్‌కు సంబంధించి పక్కన తెలంగాణలో ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేట్‌ (ఓఈఆర్‌) 18.9% ఉంటే, ఆంధ్రాలో దాన్ని 14 శాతానికి అటు ఇటు పెట్టారు. ఏపీ బోర్డర్‌లో 100 మీటర్ల దూరంలో ఉన్న ఫ్యాక్టరీలో ఆ మేరకు ఓఈఆర్‌ బెటర్‌గా ఉండి, రైతులకు బెటర్‌ రేట్‌ అక్కడ వస్తుంటే.. ఇక్కడ ఆంధ్రలో ఐదేళ్ల పాటు చంద్రబాబు హయాంలో ఓఈఆర్‌ పర్సెంటేజ్‌ తగ్గించి, రైతులు నష్టపోయేలా చేసినా పట్టించుకునే నాథుడు లేడు. రైతులు నష్టపోనీలే అన్నట్లుగా వ్యవహరించిన తీరు కళ్లారా చూశాం.

పది రోజుల్లో ‘పశ్చిమ’లో పర్యటిస్తా 
రైతులకు తోడుగా నిలిచి ప్రభుత్వాన్ని మేలుకొలిపే కార్యక్రమం చేయగలిగినంత చేస్తాం. రైతులకు నిజంగా, శాశ్వతంగా మంచి జరగాలంటే ఇంకో మూడేళ్లు ఓపిక పట్టాల్సిందే. అయినా ఆలోపు కచ్చితంగా రైతుల తరఫున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేస్తాం. అలా అన్ని రకాలుగా రైతులకు తోడుగా నిలుస్తాం. ఏయే జిల్లాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారో.. అక్కడ రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. వారం, పది రోజుల్లో నా పర్యటన కూడా ఉంటుంది. గత ఏడాది ప్రకాశం జిల్లాకు వెళ్లాను. ఈసారి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గోపాలపురంలో కానీ, జంగారెడ్డిగూడెంలో కానీ పర్యటిస్తా. పొగాకు రైతుల సమస్యను రాష్ట్రమంతా వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకటిస్తాం. ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్ర పోయే వాళ్లను లేపొచ్చు కానీ, నిద్ర నటించే వాళ్లను లేపడం కష్టం. అయినా గట్టిగా ప్రయత్నించి, ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకు ప్రయత్నిస్తాం’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రానికి మేలు
రైతులు ఎప్పుడూ నష్టపోకూడదు. రైతు చల్లగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుండాలి అంటే రైతు ముఖంలో చిరునవ్వు ఉండాలి అని చెప్పి.. రైతు పక్షపాత ప్రభుత్వంగా మన ప్రభుత్వం రాగానే మార్పులు జరిగాయి. మన హయాంలోనే ఆయిల్‌పామ్‌లో ఆ వ్యత్యాసం తొలగించాం. ఆయిల్‌పామ్‌ సాగులో నష్టపోయిన రైతులకు దాదాపు రూ.90 కోట్లు ఇచ్చి అండగా నిలబడి, ఒక మెసేజ్‌ పంపించాం. ఆ తర్వాత రేట్లన్నీ ఆటోమేటిక్‌గా 10 ఏళ్లు పెరుగుతాయి.

⇒ రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఐదేళ్లలో రైతుల తరఫున రూ.7,800 కోట్లు ఖర్చు చేశాం. ప్రతి ఆర్బీకేను ఒక కొనుగోలు కేంద్రంగా ప్రకటించి, ప్రతి జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌ను మార్క్‌ఫెడ్‌ జాయింట్‌ ఎండీగా ప్రకటించాం. ప్రతి ఆర్బీకేలో పంటల కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)ను ప్రకటించి, ఆ వివరాలతో బోర్డును ప్రదర్శించాం. ఆ రేట్ల కన్నా తక్కువ రేట్లకు ఏ పంట అయినా పడిపోతే, వెంటనే ఆర్బీకే పరిధిలో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకుడు (వీఏఏ) వెంటనే అప్రమత్తమయ్యేవాడు. సీఎం యాప్‌ (కంటిన్యూస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌)ని యాక్టివేట్‌ అయ్యేది. దాంతో ఏ ఆర్బికే పరిధిలో పంట ధర పడిపోయిందో, అక్కడ జాయింట్‌ కలెక్టర్‌ ఎంటరై వెంటనే పంట కొనుగోలు ప్రారంభించేవాళ్లు.

⇒ అలా మార్కెట్‌లో పోటీ ఏర్పడేది. దానివల్ల ఏ రైతూ నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. ఆ ప్రక్రియలో ఏకంగా రూ.7,800 కోట్లు మనం ఖర్చు చేశాం కాబట్టే, ఆ రోజుల్లో ఏ రైతూ ఏ పంటా నష్టపోలేదు. అందుకే అప్పుడు గిట్టుబాటు ధర రాని పరిస్థితి అనేది ఏ రోజు ఒక ఇష్యూ కింద రాలేదు. రైతులకు ప్రభుత్వం ఉందన్న భరోసా ఎప్పుడైతే మార్కెట్‌లోకి వెళ్లిపోయిందో, ఆటోమేటిక్‌గా ప్రతి పంటకు మంచి రేట్లు వచ్చాయి. 
⇒ కానీ నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతులకు ఈ ప్రభుత్వం తోడుగా లేదన్న మెసేజ్‌ ఉంది కాబట్టి, దళారీల వ్యవస్థ ఈరోజు సిండికేట్‌గా మారి ధర లేకుండా చేస్తూ రైతులను అడ్డగోలుగా దోచుకుంటోంది.

ఇలాగైతే బతకలేం
‘రెండేళ్లుగా పొగాకు రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. గతేడాది నల్లబర్లి పొగాకు కొనేవారు లేక నష్టపోతే, ఈ ఏడాది ధరల పతనంతో ఆర్థికంగా కుదేలవుతున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలి.. అండగా నిలవాలన్న ఆలోచన ఏ కోశాన కన్పించడం లేదు’ అని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. రెండేళ్లుగా తీవ్ర కష్టాలు, నష్టా­లు ఎదుర్కొంటున్నామని గోడు వెళ్లబోసు­కు­న్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం ఏమా­త్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఏమన్నారంటే..

కోవిడ్‌ పరిస్థితులున్నా మీరు అండగా నిలిచారు
మీ హయాంలో పొగాకు సాగులో సంక్షోభం ఉంటే, మీరు చాలా చొరవ చూపారు. అప్పుడు కోవిడ్‌ ఉన్నా, మీరు స్వయంగా పొగాకు కొంటామని చెప్పారు. అది చేసి చూపారు. మీరు మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం వల్ల మంచి ధర లభించింది. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది.  కొనే వారులేక ప్లాట్‌ఫామ్స్‌ నుంచి పొగాకు వెనక్కు తీసుకువెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫిబ్రవరి వరకు వేలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో కర్ణాటకలో వేలం మొదలవుతుంది. ఆలోగా ఇక్కడ కొనుగోళ్లు పూర్తికాకపోతే, మాకు చాలా సమస్య వస్తుంది. సిగరెట్‌ ప్యాకెట్ల రేటు రూ.170 నుంచి రూ.240 వరకు పెరిగింది. పొగాకు పండించే రైతుకు మాత్రం రేటు పడిపోయింది. పొగాకు పంట సాగుకు ఎకరానికి రూ.2.30 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పుడు పలుకుతున్న ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు.
– మారెడ్డి సుబ్బారెడ్డి, టుబాకో బోర్డు మెంబర్, ప్రకాశం జిల్లా

వ్యాపారులకు కొమ్ముకాస్తున్న టుబాకో బోర్డు
టుబాకో (పొగాకు) బోర్డు రాక ముందు 1983లో ఉద్యమం జరిగింది. అందులో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత బోర్డు వచ్చింది. రైతులు, వ్యాపారులకు అనుసంధానంగా ఉండాల్సిన బోర్డు, ఈ రోజు పూర్తిగా వ్యాపారులకు కొమ్ము కాస్తోంది. చంద్రబాబు అధికారంలో ఎప్పుడున్నా ఇదే పరిస్థితి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా పొగాకు సాగు చేస్తుండగా, అందులో 30 శాతం కొండెపి నియోజకవర్గంలోనే ఉంటుంది. తీవ్ర సంక్షోభంలో ఉన్న పొగాకు రైతాంగానికి మీరే అండగా నిలవాలి. ఈ ఏడాది కొనుగోళ్లు పూర్తి చేయకుండానే, వచ్చే ఏడాదికి సంబంధించి కూడా ఇండెంట్‌ ఇచ్చారు. ఇంత కంటే దారుణం మరొకటి ఉంటుందా?
– పి.శ్రీనివాస్, ప్రకాశం జిల్లా

ఎప్పటికి కొంటారో తెలియడం లేదు
ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్‌ ప్రకారం పొగాకు ఎ­ప్పటికి కొంటారో తెలియడం లేదు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి రూ.30 పెరగ్గా, ధర కేజీకి రూ.70 తగ్గింది. కేజీ పొగాకుతో 1,000 సిగరెట్లు తయారవుతు­న్నా­యి. వాటి ద్వా­రా రూ.24 వేలు సంపాదిస్తు­న్నారు. అదే కేజీ పొ­గా­కుకు మాకు రూ.265 మాత్రమే ఇస్తున్నారు. ఇదేం న్యాయం? ఎ­రువుల ధరలు పెరిగాయి. సాగు వ్యయం పెరిగింది. ధర దా­రుణంగా పడిపోయింది. మీరు దృష్టి పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది.
– మధు, పోలవరం, ఏలూరు జిల్లా

2023–24లో మంచి ధర పలికింది
మాది నీరు పెట్టి సాగు చేసే పొగాకు. ఈ ఏడాది 88 మిలియన్‌ కేజీల పంట కొంటారని అంచనా వేయగా, ఈరోజు వరకు 7.62 మిలి­యన్‌ కేజీలే కొన్నారు. ఈ ఏడాది కొనుగోలు ధర కేజీకి రూ.265 మాత్రమే. అది కూడా చెల్లించడం లేదు. ఇండెంట్‌ ఇచ్చిన­ప్పుడు ఒక రేటు చెబు­తు­న్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రెండేళ్ల క్రితం 2023–24లో కేజీ పొగాకు ధర రూ.320కి పైగా పలికింది. ఈసారి 80 మిలియన్‌ కిలోల పొగాకు ఉంది. కానీ ఎంత వరకు కొంటారో తెలియడం లేదు. 40 శాతం పొగాకును వేలం కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. పొగాకును బయటకు తీసుకొచ్చి, మళ్లీ తీసుకుపోతే రంగు మారుతుంది. క్వాలిటీ పడిపోతుంది. పొగాకు కొనుగోళ్లలో ఐటీసీ కూడా చొరవ చూపడం లేదు.
– రాజేంద్రబాబు, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లా

మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది
మా ప్రాంతంలో 2 వేలం కేంద్రాలు­న్నాయి. ఇప్పటి వరకు 4 రౌండ్ల వేలం జరిగింది. ఒక్కో రైతు నుంచి 8 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు జరిగింది. అమ్మకాలు లేకపోవడం వల్ల పొగాకు క్వాలిటీ తగ్గుతోంది. పొగాకు మగ్గి పోవడంతో ఎగుమతి కాదంటూ వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. కొంటు­న్న పొగాకుకు కూడా కేజీకి రూ.160 మాత్రమే దక్కుతోంది. రైతులు నష్టపోతున్నారు. మీరు వస్తే తప్ప మాకు న్యాయం జరగదు.
– ఎన్‌.వెంకటేశ్వరరెడ్డి, కందుకూరు, నెల్లూరు జిల్లా

జీఎస్టీ సాకు చూపి ధరలో కోత పెడుతున్నారు 
పొగాకు రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యా­పారుల మాయాజాలం చూస్తే.. ఎగుమ­తిదా­రు­లు ఆర్డర్‌ను డాలర్లలోనే ఇస్తారు. అలానే తీసు­కుంటారు. డాలర్‌ ధర చా­లా ఎక్కువగా ఉంది. గతేడాది ధర లేదు. పార్టీల­కతీతంగా రైతులంతా మిమ్మల్ని కోరుకుంటున్నా­రు.. మీరు మా ప్రాంతాన్ని సందర్శించా­లి. సిగరెట్‌ ఉత్పత్తిదా­రు­లు జీఎస్టీ సాకు చూపి తక్కువ ధర చెల్లి­స్తున్నారు.
    – మారెళ్ల బంగారుబాబు, ఒంగోలు, ప్రకాశం జిల్లా

ఏటా 20 శాతం సాగు వ్యయం పెరుగుతోంది 
ఏటా 20 శాతం వంతున వ్యయం పెరుగుతోంది కానీ ఆ స్థాయిలో ధర పెరగడం లేదు. ఈసారి ధర రూ.265 నుంచే మొదలు పెట్టారు. చివరకు దాన్ని రూ.175కు తగ్గించారు. ప్రారంభ ధర రూ.265 కూడా గిట్టుబాటు కాదు. కానీ, ఆ ధరకు కూడా కొనేది చాలా తక్కువ. ఈ ఏడాది 26 వేల బేళ్ల పొగాకు తెస్తే, కేవలం 6 వేల బేళ్ల పొగాకు మాత్రమే కొన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ లేదని వ్యాపారులు చెబుతున్నారు. పొగాకు వల్ల ఏటా కేంద్రానికి  రూ.50 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ పొగాకు పండించే రైతు­లకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. మాకు మీ వల్లనే న్యాయం జరుగుతుంది. మీరు అడుగు పెడితే, మా కష్టాలు తీరుతాయి. 
– ఎస్‌.వెంకట్రావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా

క్వాలిటీ మా చేతుల్లో లేదు కదా..
ఎక్కడా పొగాకు అమ్ముడు పోవడం లేదు. బోర్డు­కు తీసుకుపోతే నో బిడ్‌. పొగాకును ప్లాట్‌ఫామ్స్‌కు తీసుకుపోతే కొనకపోవడంతో, వెనక్కి తీసుకు­రావడం కష్టంగా ఉంది.  చెట్టుకు 25 వరకు ఆకు­లు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. కిందవి వేరుగా ఉంటాయి. చెట్టు మధ్య ఆకులు మాత్రమే బాగుంటాయి. కేవలం నాణ్యమైన ఎఫ్‌–1, ఎఫ్‌–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యం? క్వాలిటీ అనేది మా చేతుల్లో లేదు కదా? క్వాలిటీ లేదని రోజూ దాదాపు 45 శాతం వెనక్కు పంపిస్తున్నారు. టుబాకో బోర్డు మొత్తం సరుకు కొనేలా ఒత్తిడి తేవాలి.
– జి.వెంకటేశ్వర్‌రెడ్డి, పొదిలి, ఉమ్మడి ప్రకాశం జిల్లా

జీవనోపాధి లేకుండా పోతుంది..
మా దగ్గర 13 వేల కుటుంబాలు పొగాకు సాగు చేస్తున్నాయి. ఇంకా సమీప ప్రాంతాల నుంచి చాలా మంది పొలాల్లో పని చేస్తున్నారు. దాదాపు లక్ష మంది వలస కూలీలు జీవనోపాధి వెతుక్కు­న్నారు. కానీ, పొగాకుకు ధర రావడం లేదు. గత ఏడాదీ అంటే. ఈ ఏడాది రూ.265 నుంచి మొదలు పెట్టి, కేవలం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. 
– మధ్యాహ్నపు ఏసు, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా

సిండికేట్‌ అయ్యామని వ్యాపారులే చెబుతున్నారు 
మా దగ్గర పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. వ్యాపారులను అడిగితే, మేమంతా సిండి­కేట్‌ అయ్యాం. చంద్రబాబును కలిశాం. మీరు మ­మ్మల్ని ఏమీ చేయలేరు.. అంటున్నారు. మరో వైపు సీఎం మాత్రం మంచి ధర ఇవ్వాలని చెబుతు­న్నా­డు. కానీ, వ్యాపారులు మాత్రం బేలుకు రూ.­30 వేలు కాదు కదా.. రూ.16 వేలకు కూడా కొనడం లేదు. అంటే సీఎం మాటకు విలువ లేదా? లేక ఆయన డ్రామాలు చేస్తున్నా­డా? మిమ్మల్ని ఓడించినందుకు అందరికీ బుద్ధి వచ్చింది. జగన్‌ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. 
– వెంకటేశ్వర్‌రెడ్డి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా

నాడు కరోనా వేళ కూడా మంచి లాభాలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కిలో పొగాకు రూ.180 నుంచి రూ.260 వరకు కొన్నారు. మాకు మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు అస్సలు ధర లేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, గిట్టుబాటు ధర వస్తుందని ప్రచారం చేశారు. కానీ, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. జరుగుతోంది మరొకటి.
– ఎం.వెంకటనారాయణ, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా

ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు
రాష్ట్రంలో 2.92 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఇందులో ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనే 1.75 లక్షల ఎకరాలు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 60 వేల ఎకరాలు సాగులో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి మరింత దారుణంగా పడిపోయింది. ప్రతి రోజూ ధర అమాంతం పడిపోతోంది.  చాలా ప్లాట్‌ఫామ్స్‌ మీద 27 శాతం తిరస్కరణకు గురయ్యింది. ఇంకా కొన్ని చోట్ల అది దాదాపు 40 శాతం వరకు ఉంది. ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తే సమస్య ఉండదు. ఇప్పుడు మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం తప్ప ఏమీ చేయడం లేదు.  
– ఎంవీఎస్‌ నాగిరెడ్డి,వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు విభాగం)  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement