రోజుకు రెండు హత్యలు
భర్తల మరణాలపై నివ్వెరపరిచే నిజాలు
దేశంలో ఆరునెలల్లో 554 మంది మృతి
భార్యల చేతిలో 322 మంది హతం
వివాహేతర సంబంధాల వల్ల 194 హత్యలు
రాష్ట్రంలోనూ తీవ్ర ఆందోళనకర పరిస్థితులు
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా ‘ఏకం న్యాయం ఫౌండేషన్’ నివేదిక
సాక్షి, అమరావతి: కట్టుకున్నవాడినే మట్టుపెడు తున్న ఘటనలు దేశంలో కలకలం రేపుతున్నాయి. కుటుంబ వ్యవస్థలో పెరుగుతున్న విభేదాలు, వివాహేతర సంబంధాలు, మానసిక వేధింపులు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో ప్రాణసఖిలే ప్రాణాలు తీసే యమకింకరుణులుగా మారుతున్నారు. ‘ఏకం న్యాయం ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ విడు దల చేసిన నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూలై 14 వరకు దేశవ్యాప్తంగా 554 మంది భర్తలు అసహజ మరణాలకు గురయ్యారు.
ఇందులో 322 మంది భార్యల చేతిలో హత్యకు గురికాగా, 192 మంది భార్యల వేధింపులు, కుటుంబ విభేదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. మిగిలిన కేసులు అను మానాస్పద మరణాలు, ఇతర కారణాలకు సంబంధించినవిగా పేర్కొంది. ఈ నివేదిక సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు, కుటుంబ సంక్షేమ నిపుణులు ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోజూ రెండు హత్యలు.. ఒక ఆత్మహత్య
నివేదిక ప్రకారం సగటున రోజూ ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నమోదైన 322 హత్య కేసుల్లో 194 కేసులు (60.2 శాతం) వివాహేతర సంబంధాల కారణంగానే జరిగినట్లు తేలింది. భార్యల వివాహేతర సంబంధాలను భర్తలు ప్రశ్నించడంతో ప్రియుడితో కలిసి హత్యలకు పాల్పడిన ఘటనలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అదనంగా 88 కేసుల్లో గృహహింస, కుటుంబ కలహాలు ప్రధాన కారణాలుగా నమోదయ్యాయి.
మిగిలిన కేసుల్లో ఆస్తి తగాదాలు, డబ్బు వివాదాలు, మద్యం, అనుమానాలు, వ్యక్తిగత కక్షలు వంటి అంశాలు కారణాలుగా ఉన్నట్లు వెల్లడించింది. వివాహేతర సంబంధాలు మాత్రమే కాకుండా, కట్న వేధింపులు, మానసిక హింస, గృహహింస, తప్పుడు కేసులు పెట్టడం, కుటుంబ సభ్యుల నుంచి భర్తను దూరం చేయడం, అవమానించడం వంటి అంశాలు కూడా భర్తలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని ‘ఏకం న్యాయం ఫౌండేషన్’ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, మరికొందరు హత్యలకు బలవుతున్నారని వివరించింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆందోళనకర గణాంకాలు
మన రాష్ట్రంలోనూ కుటుంబ వివాదాలు, వివాహేతర సంబంధాల కారణంగా నేరాలు పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏటా సగటున 898 హత్యలు నమోదవుతున్నాయి. వాటిలో 195 హత్యలు వివాహేతర సంబంధాలు, లైంగిక అసూయ వంటి కారణాలతో జరిగాయి. ఈ విభాగంలో దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ తొలి స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో భర్తలు, వారి బంధువులపై మహిళలు నమోదు చేసిన ఫిర్యాదులపై 9,165 వేధింపుల కేసులు నమోదయ్యాయి.
భార్యలపై జరుగుతున్న నేరాలతో పాటు, భర్తలు బాధితులుగా మారుతున్న ఘటనలు కూడా పెరుగుతుండటం కుటుంబ వ్యవస్థకు ప్రమాదకరంగా భావించాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు. దంపతుల మధ్య తలెత్తే విభేదాలు తీవ్రరూపం దాల్చకముందే కౌన్సెలింగ్, కుటుంబ మధ్యవర్తిత్వం, మానసిక ఆరోగ్య సేవలను వినియోగించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సమస్యలను చట్టపరమైన మార్గాల్లో, పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడం ద్వారా ఇలాంటి విషాద ఘటనలను తగ్గించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.


