వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఎందుకు అరెస్టు చేశారు?.. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమే ఆయన నేరమా?
పిల్లాడు పొరపాటున యాక్సిడెంట్ చేస్తే తండ్రికి ముడిపెట్టడం అన్యాయం కాదా?.. బాబు ఎల్లోమీడియాలో రాయించిందే కేసుగా మారుతోంది
రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్ట వ్యవస్థ ఇదే
‘‘అరెస్టులతో వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది.’’
‘‘ఒక వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా?’’
‘‘చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే?’’
సాక్షి, అమరావతి: ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అరెస్టులతో తమ పార్టీని భయపెట్టలేరని, ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఎల్లో మీడియాలో రాయించిందే ఆ తర్వాత కేసులా మారిపోతోందని, రాష్ట్రంలో నడుస్తున్న కొత్త చట్టవ్యవస్థ ఇదేనని జగన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ నేపధ్యంలో బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా జగన్ స్పందించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
అరెస్టుల వెనుక కుట్ర
‘‘అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైఎస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది.
సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా?
టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర.

నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం దుర్మార్గం
సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా?
అరెస్టులతో భయపెట్టలేరు
అరెస్టులతో వైఎస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబూ..అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం..వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు.’’ అని జగన్ పేర్కొన్నారు.


