ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) గృహ నిర్మాణ పథకాలకు ఈ ఏడాది భారీ స్పందన లభించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో డీడీఏ మొత్తం 1,284 ఫ్లాట్లను విక్రయించి రూ.1,020 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన రూ.462 కోట్లతో పోలిస్తే ఇది 120 శాతానికి పైగా వృద్ధి కావడం విశేషం.
డీడీఏ విడుదల చేసిన వివరాల ప్రకారం.. అన్ని వర్గాల గృహాలపై కొనుగోలుదారుల నుంచి వచ్చిన బలమైన డిమాండ్ ఈ ఫలితాలకు ప్రధాన కారణమైంది. ముఖ్యంగా నరేలా ప్రాంతం అత్యధిక విక్రయాలతో ముందంజలో నిలిచింది. ఈ ప్రాంతంలోనే 1,153 ఫ్లాట్లు అమ్ముడవగా, మొత్తం విక్రయాల్లో దాదాపు 90 శాతం వాటా నమోదైంది. నరేలాను అభివృద్ధి చెందిన ఉపనగరంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలు, మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రజల్లో విశ్వాసం పెరగడం ఇందుకు దోహదపడిందని డీడీఏ పేర్కొంది.
నరేలా ప్రాంతానికి అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్–II (UER-II), నిర్మాణంలో ఉన్న రిథాలా–నరేలా–కుండ్లీ మెట్రో కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులు మెరుగైన కనెక్టివిటీని అందించనున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో గృహాలపై ఆసక్తి మరింత పెరుగుతోందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం డీడీఏ కర్మయోగి ఆవాస్ యోజన, నాగరిక్ ఆవాస్ యోజన, అలాగే తూర్పు ఢిల్లీలోని టవరింగ్ హైట్స్ వంటి పథకాల కింద వివిధ ఆదాయ వర్గాలకు చెందిన ఫ్లాట్లను అందిస్తోంది. ఈ పథకాలను జూలై 31, 2026 వరకు 'ఫస్ట్ కమ్–ఫస్ట్ సర్వ్' విధానంలో పొడిగించారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే ఉండటంతో, కొనుగోలుదారులు ఇంటి నుంచే ఫ్లాట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ఇళ్లు ఫ్రీహోల్డ్, రెడీ-టు-మూవ్ కేటగిరీలో ఉండటం కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తున్న అంశంగా డీడీఏ పేర్కొంది.
వర్గాల వారీగా చూస్తే, తొలి త్రైమాసికంలో 336 ఈడబ్ల్యూఎస్, 322 ఎల్‌ఐజీ, 435 ఎంఐజీ, 191 హెచ్‌ఐజీ ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. వీటిలో ఎంఐజీ విభాగం 34 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, నరేలాలోని ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్లు దాదాపు పూర్తిగా అమ్ముడవడం సరసమైన ధరల్లో గృహాలపై ఉన్న డిమాండ్‌కు నిదర్శనంగా అధికారులు పేర్కొన్నారు.


