జగన్నాథుని రథయాత్ర ఎక్కడిదాక సాగిందంటే..! ఆఖరికి వరుణుడు సైతం.. | Jagannath Rath Yatra 2026: nearly 3 kilometers along Gundicha Temple | Sakshi
Sakshi News home page

జగన్నాథుని రథయాత్ర ఎక్కడిదాక సాగిందంటే..! ఆఖరికి వరుణుడు సైతం..

Jul 17 2026 1:37 PM | Updated on Jul 17 2026 1:47 PM

Jagannath Rath Yatra 2026: nearly 3 kilometers along Gundicha Temple

నీలిమేఘశ్యాముడు నేల మురిసేలా గర్భగుడి వదిలి భక్తుల వద్దకు కదిలి వచ్చాడు. శ్రీమందిరం పరిసరాలను పావనం చేస్తూ చిరు మందహాసుడై రథాన్ని అధిరోహించాడు. ఆకాశాన్ని తాకే జై జగన్నాథ నినాదాలు మార్మోగగా బలభద్రుడు, సుభద్రతో కలిసి గుండిచాకు బయల్దేరాడు. రథాలు ముందుకు కదలడం మొదలవ్వగానే భక్తులు మురిసిపోయారు. దేవ దేవుడిని కనులారా చూసుకొని.. మనసారా మొక్కుకొని పరవశించిపోయారు. భక్తుల వద్దకు దారుబ్రహ్మ నందిఘోష్‌ రథంపై వస్తున్న దృశ్యాన్ని వరుణుడు సైతం వీక్షించాడు. అనంతరం కొంతదూరం కదిలిన పతితపావనుడు.. మిగతా దూరం మరుసటి రోజు వెళ్దామని భక్తులకు సందేశమిచ్చాడు.  

శ్రీమందిరం వదిలి భక్తుల వద్దకు బయల్దేరిన జగతినాథుడికి నింగి, నేల స్వాగతించాయి. సుగంధ భరిత పుష్పాదుల మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం దాటి నేలంతా విస్తరించిన ఆశేష భక్తజనం మధ్య ప్రత్యక్షమై జనులకు నల్లనయ్య తొలి దర్శనం అనుగ్రహించాడు. ఈ అపురూప క్షణాల్లో ఆకాశం నుంచి వర్షపాతం శీతల పుష్పాంజలిగా నేల జారింది. అత్యంత భక్తిపూర్వక వాతావరణంలో సేవాయతుల సమూహం గర్భగుడి నుంచి మూలవిరాటులను వరుస క్రమంలో రథాలపైకి తరలించి గొట్టి పొహండి కార్యక్రమం జయప్రదం చేశారు. 

వరుస క్రమంలో మొదటిగా చక్రరాజ ప్రభువు సుదర్శనుడు దేవదళన్‌ రథంపైకి తరలివెళ్లాడు. పుష్ప మకుటధారణతో శ్రీమందిరం సింహద్వారం గుండా తాళధ్వజ రథంపైకి బలభద్ర స్వామి చేరిన తర్వాత, దేవీ సుభద్రమూర్తిని దర్ప దళనంపై ఆసీనం చేశారు. చివరగా శ్రీజగన్నాథుడు భక్త జనాన్ని తన్మయం చేస్తూ జై జగన్నాథ్‌ నినాదాల మధ్య నందిఘోష్‌ రథానికి చేరాడు. సుదీర్ఘంగా 5 గంటల పాటు నిరవధికంగా కొనసాగిన గొట్టి పొహండిలో చతుర్థామూర్తుల మూల విరాటులు సురక్షితంగా రథాలపైకి చేరాయి. 

మృదంగ వాద్యాల నడుమ 
శంఖ ధ్వని, ఘంటానాదాల గంభీర ప్రతిధ్వనులు, మృదంగ వాద్యాల మంగళ నినాదాలు, భక్త జనుల హరిబోల్‌ నామ సంకీర్తనలు, మహిళల పవిత్ర హుల్హులీ (ఉల్లాలు) ధ్వనులతో దిక్కులన్నీ దివ్యమైనవేళ అఖిలాండ కోటి బ్రహా్మండ నాయకుడు జగత్తుకు నాథుడైన శ్రీజగన్నాథ మహా ప్రభువు తన అగ్రజుడు బలభద్రుడు, సోదరి దేవి సుభద్రతో కలిసి గుండిచా మందిరం వైపు మహోన్నత రథయాత్రకు బయల్దేరాడు. 

ఏటా మాదిరి ఆషాఢ శుక్ల ద్వితీయ పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో ప్రారంభమయ్యే వార్షిక రథయాత్ర వైభవోపేతంగా ఆరంభమైంది. జగన్నాథుని అనేక మానవీయ దివ్యలీలల్లో ఇది అత్యంత అపూర్వమైన, అత్యంత హృద్యమైన ఘట్టంగా భావించబడుతుంది. తొమ్మిది రోజుల ఈ నవ దినాత్మక దివ్య యాత్రలో చిత్ర విచిత్రమైన లీలావిలాసాలతో ఆలయ గర్భ గృహాన్ని విడిచి భక్తుల మధ్యకు విచ్చేసే జగన్నాథుడు జాతి, మత, వర్ణ, భాష భేదాలకు అతీతంగా సమస్త జీవ రాశులకు తన కరుణాకటాక్షాలను ప్రసాదించి వారిని పుణీతులను చేస్తాడు. అందుకే రథయాత్రను కేవలం ఒక ఉత్సవంగా కాకుండా సర్వజనోద్ధారణకు, సమానత్వానికి, విశ్వబాంధవ్యానికి ప్రతీకగా భక్తజనం భావిస్తారు. 

బంగారు పిడి చీపురుతో ఊడ్చి 
శ్రీ మందిరంలో మంగళ హారతి, మైలమ్, ప్రభాత శుద్ధిసేవ, అలంకరణ పూర్తి చేసి సూర్యపూజ, ద్వార పాలకుల పూజ, గోపాల వల్లభ పూజాదులు నిర్వహించారు. ఆలయం వెలుపల దేవతలు యాత్ర చేసే 3 రథాల ప్రతిష్ట ముగించి చతుర్థామూర్తుల మూల విరాటులను ఒక్కోటిగా రథాలపైకి వరుస క్రమంలో తరలించారు. 

అనంతరం మదన మోహనుడు, రామకృష్ణులు తదితర ఉత్సవమూర్తులను సంబంధిత రథాలపై ఆసీనం చేశారు. రథాలపై దేవుళ్ల అలకంరణ పూర్తి కావడంతో పూరీ గజపతి మహారాజా స్వామి సేవకునిగా 3 రథాలను బంగారు పిడి చీపురుతో ఊడ్చి శుచి కర్మలు శాస్త్రీయంగా నిర్వహించారు. ఈ తంతు ముగియడంతో రథాలకు కొయ్య గుర్రాలు, ద్వార పాలకులు, రథ సారథులు ఏర్పాటు చేసి చారుమళ్లు (తాత్కాలిక తాటి మట్టల మెట్లు) తొలగించి యాత్రకు సిద్ధం చేశారు. 

నేడు యాత్ర కొనసాగింపు 
శుక్రవారం ప్రాతఃకాల సేవాదులు పూర్తి చేసిన తర్వాత రథాలు లాగడం పునరుద్ధరిస్తారు. అంతవరకు ఆగిన చోటే రథాలపై దేవుళ్లకు నిత్య, దైనందిన, యాత్ర సేవాదులు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. ఈ నిడివిలో రథాలపై దేవుళ్లని యాత్రికులు, భక్తులు దర్శించుకునే అవకాశం కలిసి వస్తుంది.

గమ్యం చేరని రథాలు
యాత్ర సంబంధిత కార్యక్రమాల నిర్వహణలో అవాంఛనీయ జాప్యం కారణంగా రథాలు నిర్ధారిత వేళలో గమ్యం చేరలేకపోయాయి. సాయంత్రం 5.10 గంటల నుంచి రథాల కదలిక ఆరంభించి 7.25 గంటల వరకు రథాలు లాగడం కొనసాగించారు. అయితే చీకటిపడడంతో ఆలయ సంస్కారాల ప్రకారం రథాలు లాగడం మర్నాటికి వాయిదా వేశారు. 

తొలుత బలభద్ర స్వామి రథం కదలగా వెంబడి దేవీ సుభద్ర రథం యాత్ర ప్రారంభమైంది. చివరగా శ్రీజగన్నాథుని నందిఘోష్‌ రథం నెమ్మదిగా మొదలైంది. మొదట బయల్దేరిన బలభద్ర స్వామి రథం జనతా సినిమా హాలు సమీపంలో నిలిపివేశారు. దేవీ సుభద్ర రథం దర్పదళనం మారీచ్‌కోట్‌ వరకు ఆగిపోయింది. చివరగా బయల్దేరిన జగన్నాథుని నందిఘోష్‌ రథం లాంచనంగా కొద్దిదూరం కదిలిన తర్వాత నిలిపివేశారు.  

రథ ప్రతిష్ట 
జగన్నాథుడి రథయాత్ర జయప్రదం అయ్యేందుకు ముందుగా రథ ప్రతిష్టని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆచారం. ఆధ్యాత్మిక వాతావరణంలో మూడు రథాలపై పతాకాలు, కలశాలను ప్రతిష్టించి గురువారం 8.45 గంటలకు రథత్రయం ప్రతిష్ట పూర్తి చేయడంతో, గర్భగుడి నుంచి మూల విరాటులు వరుస క్రమంలో రథాలపైకి వేంచేశారు.  

వరుణుడి రాక 
ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాలు రథయాత్ర ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. గత 48 గంటల్లో పూరీ నగరంలో 233.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం పూరీ నగరంలో గంటకు 1 నుంచి 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కొనసాగుతోంది. అయితే భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి రథాలను వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు బొడొ దండొకు తరలివచ్చారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొని ఉన్న అల్పపీడన వ్యవస్థ కారణంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.  

డాహుక డక్కువా 
రథయాత్రలోని అత్యంత విశిష్టమైన సంప్రదాయాల్లో డాహుక డక్కువా ఒకటి. రథ డాహుకాలు అనే వారు పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో సేవచేసే వంశపారంపర్య సేవాయతుల బృందం. రథయాత్ర సమయంలో వారు దేవతామూర్తులతో పాటు రథాలపై సవారీ చేస్తూ ఈ పవిత్ర యాత్రకు నాంది పలుకుతారు. శతాబ్ధాల నాటి లయబద్ధమైన పద్య గానమైన డాహుక డక్కొ (డాహుక బోలి)ను ప్రదర్శిస్తారు. 

డాహుక తన లయబద్ధమైన గానంతో ఉద్బోధను ప్రారంభించేంత వరకు రథాలు కదలవని నమ్ముతారు. రథంపై నిలబడి ప్రాచీన శ్లోకాలను పఠిస్తూ, తన చేతిలోని కరత్రో రథాన్ని లాగే ప్రక్రియకు ఆయన దిశానిర్దేశం చేస్తారు. పరోక్షంగా వీరి నుంచి సంకేతం రథాల కదలికకు సానుకూల పరిస్థితులని నిర్ధారించి సుగమం చేస్తుంది.  

పుష్ప సోయగం 
యాత్ర శోభతో శ్రీమందిరం పరిసరాలు పుష్పాల సుగంధంతో గుభాళించాయి. సింహద్వారం నిలువెత్తు పుష్ప సోయగం ఆహ్లాదభరితంగా పలకరించింది.  

చిత్తాభరణ శోభ 
యాత్ర ఆద్యంతాలు స్వామి కళకళలాడుతూ భక్త జనులను మురిపిస్తుంటాడు. రథాలపై ఆసీనుడు కావడంతో నుదుట వజ్ర వైడూర్య తదితర రత్న ఖచిత చిత్తాభరణం ధరించి మెరిసిపోయాడు. ప్రత్యేక తిథులు, ఉత్సవాలు సందర్భంగా మూలవిరాటుల నుదుట రత్నాలు పొదిగిన ఈ అమూల్య ఆభరణం అలంకరిస్తారు. 

(చదవండి: జగన్నాథుని వంటశాల ఎలా ఉంటుందంటే..! ఆఖరికి పొయ్యిలు కూడా..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement