ఇంటి పంట 9
మట్టి ద్రావణం
మిద్దెతోటలు లేదా ఇంటిపంటలు లేదా పెరటి తోటల్లో కుండీలలో పెరిగే మొక్కలకు మట్టి ద్రావణం అత్యంత చౌకైన, శక్తివంతమైన సేంద్రియ పోషకంగా పనిచేస్తుంది. స్థల పరిమితి ఉండే మిద్దె తోటలలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.
1. మిద్దె తోటలో కుండీలలోని మట్టి కాలక్రమేణా తన సారాన్ని కోల్పోవచ్చు. మట్టి ద్రావణాన్ని అందించడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, అది మళ్లీ సారవంతంగా మారుతుంది.
2. మిద్దె /పెరటి తోటల్లో సాధారణంగా వచ్చే ఆకుముడత, పేనుబంక, తెల్ల దోమ వంటి సమస్యలను మట్టి ద్రావణం పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు.
3. కుండీలలో పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలకు వేర్ల కంటే ఆకుల ద్వారా పోషకాలు త్వరగా అందుతాయి. మట్టి ద్రావణాన్ని స్ప్రే చేయడం వల్ల ఆకులు పచ్చగా, బలంగా పెరుగుతాయి.
4. రసాయన ఎరువులు లేకుండానే టమాటా, మిర్చి, ఆకుకూరల దిగుబడిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.
5. ఆకులపై మట్టి ద్రావణం ఒక పొరలా ఏర్పడి, కీటకాలు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది.
6. మొక్కలకు చీడపీడలు ఉన్నప్పుడు లేదా తక్షణ పోషకాలు కావాలనుకున్నప్పుడు ఆకులపై పిచికారీ చేయాలి.
7. ఆకుల పైన, ఆకుల అడుగు భాగంలో, కొమ్మల మీద పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.
8. ఎండ లేని సమయంలో, అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత, మాత్రమే స్ప్రే చేయాలి.
9. మొక్క వేర్లు బలంగా పెరగడానికి, మట్టి సారవంతం కావడానికి ఈ ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోయాలి. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి.
10. మట్టి ద్రావణం తయారీ కోసం భూమిపై పొరను 1 అడుగు వరకు తీసివేసి, లోపలి నుండి తీసిన జిగటగా ఉండే మట్టి (నల్లరేగడి లేదా ఎర్రమట్టి)ని 1 నుండి 2 కిలోలు తీసుకోవాలి.
11. పది నుండి ఇరవై లీటర్లు నీరు తీసుకోవాలి.
12. ఆముదం 20 నుండి 50 మి.లీ. (చీడపీడల నివారణకు) తీసుకోవాలి.
13. కుంకుడు కాయలు 2–3ని నీటిలో నానబెట్టి తీసిన రసం.. మట్టి ద్రావణం ఆకులకు అంటుకోవడానికి కలపాలి.
14. మట్టి ద్రావణం తయారీ విధానం: సేకరించిన లోపలి మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెత్తని మట్టిలో ఆముదం, ముందుగా నానబెట్టి తీసిన కుంకుడు రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి ఒక కర్రతో 5 నిమిషాల పాటు బాగా తిప్పాలి. దీనివల్ల మట్టిలోని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి.
15. కలిపిన తర్వాత ద్రావణాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. అప్పుడు బరువైన మట్టి రేణువులు అడుగుకు చేరుకుంటాయి.
16. పైన తేరిన గోధుమ రంగు తేట నీటిని మాత్రమే వడపోసి స్ప్రే బాటిల్‌లో పోయాలి.
17. స్ప్రేయర్ నాజిల్‌కు మట్టి అడ్డుపడకుండా ఉండాలంటే ద్రావణాన్ని పల్చటి గుడ్డతో రెండుసార్లు వడపోసుకోవాలి. వడపోసిన తేట నీటిని స్ప్రేయర్ బాటిల్‌లో పోసి మొక్కల ఆకుల పైన, కింద తడిచేలా పిచికారీ చేయాలి. అప్పుడే ఆకుల అడుగున దాక్కున్న పురుగులు కూడా నశిస్తాయి.

18. మట్టి ద్రావణాన్ని తయారు చేసిన 24 గంటల లోపు వాడుకోవడం మంచిది. నిల్వ ఉంచితే దాని ప్రభావం తగ్గుతుంది.
19. సాధారణంగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.
20. మట్టి ద్రావణంను కేవలం నీటిలా కాకుండా, ఒక సహజ సిద్ధమైన ‘టానిక్‘, ‘రక్షణ కవచం’గా భావించవచ్చు.
21. భూమి లోపలి మట్టిలో మొక్కలకు అవసరమైన మైక్రో, మాక్రో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేసినప్పుడు, అవి వేర్ల కంటే 8 నుండి 20 రెట్లు వేగంగా పోషకాలను గ్రహిస్తాయి.
22. ద్రావణంలో ఉండే ఆముదం, జిగట మట్టి ఒక పొరలా ఆకులపై ఏర్పడి, పురుగులు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటాయి.
23. ఆకుముడత, తెల్లదోమ, పేనుబంక, లద్దెపురుగు వంటి మొండి చీడలను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
24. పోషక లోపాల వల్ల ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు ఈ ద్రావణం పిచికారీ చేస్తే, కేవలం 48 గంటల్లోనే మొక్క తిరిగి పచ్చగా మారుతుంది.
25. పూత రాలడం తగ్గుతుంది. కాయల పరిమాణం, నాణ్యత పెరుగుతాయి. ఇది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
26. రసాయన ఎరువులు, ఖరీదైన పురుగుమందుల అవసరం లేకుండానే కేవలం మట్టితో తోటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
27. అధిక వర్షాలు వల్ల వేర్లు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఫోలియర్ స్ప్రే మొక్కకు ్రపాణం పోస్తుంది.
28. మిద్దె తోటలోని మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా ఉండాలంటే వారానికి ఒకసారి పిచికారీ చేయడం సరిపోతుంది.
29. ఒకవేళ ఆకుముడత, తెల్లదోమ లేదా పేనుబంక వంటివి ఎక్కువగా ఉంటే, 3 నుండి 4 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. సమస్య తగ్గిన తర్వాత మళ్లీ వారానికి ఒకసారికి మార్చుకోవచ్చు.
30. మొక్కలు పూత మీద ఉన్నప్పుడు 10 రోజులకు ఒకసారి ఇస్తే పూత రాలకుండా కాయ బాగా వస్తుంది.
31. పశువుల ఎరువు మట్టిలో కలిసి వేర్ల ద్వారా నెమ్మదిగా పోషకాలను అందిస్తుంది. మట్టి ద్రావణం ఆకుల ద్వారా తక్షణమే అందుతుంది. కాబట్టి, వారానికి ఒకసారి మట్టి ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు.
32. ఒక వారం మట్టి ద్రావణం, తర్వాతి వారం జీవామృతం లేదా తౌడు ద్రావణం వంటివి మార్చి మార్చి ఇవ్వటం వలన మొక్కకు రకరకాల సూక్ష్మపోషకాలు అందుతాయి.

- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


