breaking news
soil fertility
-
మట్టి ద్రావణంతో ఎన్నో మేళ్లు!
మిద్దెతోటలు లేదా ఇంటిపంటలు లేదా పెరటి తోటల్లో కుండీలలో పెరిగే మొక్కలకు మట్టి ద్రావణం అత్యంత చౌకైన, శక్తివంతమైన సేంద్రియ పోషకంగా పనిచేస్తుంది. స్థల పరిమితి ఉండే మిద్దె తోటలలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఇది ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.1. మిద్దె తోటలో కుండీలలోని మట్టి కాలక్రమేణా తన సారాన్ని కోల్పోవచ్చు. మట్టి ద్రావణాన్ని అందించడం వల్ల మట్టిలోని సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, అది మళ్లీ సారవంతంగా మారుతుంది.2. మిద్దె /పెరటి తోటల్లో సాధారణంగా వచ్చే ఆకుముడత, పేనుబంక, తెల్ల దోమ వంటి సమస్యలను మట్టి ద్రావణం పిచికారీ చేయడం ద్వారా సమర్థవంతంగా అరికట్టవచ్చు.3. కుండీలలో పెరిగే కూరగాయలు, పండ్ల మొక్కలకు వేర్ల కంటే ఆకుల ద్వారా పోషకాలు త్వరగా అందుతాయి. మట్టి ద్రావణాన్ని స్ప్రే చేయడం వల్ల ఆకులు పచ్చగా, బలంగా పెరుగుతాయి.4. రసాయన ఎరువులు లేకుండానే టమాటా, మిర్చి, ఆకుకూరల దిగుబడిని పెంచడానికి ఇది సహాయపడుతుంది.5. ఆకులపై మట్టి ద్రావణం ఒక పొరలా ఏర్పడి, కీటకాలు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటుంది. 6. మొక్కలకు చీడపీడలు ఉన్నప్పుడు లేదా తక్షణ పోషకాలు కావాలనుకున్నప్పుడు ఆకులపై పిచికారీ చేయాలి. 7. ఆకుల పైన, ఆకుల అడుగు భాగంలో, కొమ్మల మీద పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.8. ఎండ లేని సమయంలో, అంటే ఉదయం 8 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల తర్వాత, మాత్రమే స్ప్రే చేయాలి.9. మొక్క వేర్లు బలంగా పెరగడానికి, మట్టి సారవంతం కావడానికి ఈ ద్రావణాన్ని మొక్క మొదళ్లలో పోయాలి. దీనివల్ల మట్టిలోని సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి.10. మట్టి ద్రావణం తయారీ కోసం భూమిపై పొరను 1 అడుగు వరకు తీసివేసి, లోపలి నుండి తీసిన జిగటగా ఉండే మట్టి (నల్లరేగడి లేదా ఎర్రమట్టి)ని 1 నుండి 2 కిలోలు తీసుకోవాలి.11. పది నుండి ఇరవై లీటర్లు నీరు తీసుకోవాలి.12. ఆముదం 20 నుండి 50 మి.లీ. (చీడపీడల నివారణకు) తీసుకోవాలి. 13. కుంకుడు కాయలు 2–3ని నీటిలో నానబెట్టి తీసిన రసం.. మట్టి ద్రావణం ఆకులకు అంటుకోవడానికి కలపాలి.14. మట్టి ద్రావణం తయారీ విధానం: సేకరించిన లోపలి మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెత్తని మట్టిలో ఆముదం, ముందుగా నానబెట్టి తీసిన కుంకుడు రసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నీటిలో వేసి ఒక కర్రతో 5 నిమిషాల పాటు బాగా తిప్పాలి. దీనివల్ల మట్టిలోని పోషకాలు నీటిలోకి విడుదలవుతాయి.15. కలిపిన తర్వాత ద్రావణాన్ని 15 నుండి 20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. అప్పుడు బరువైన మట్టి రేణువులు అడుగుకు చేరుకుంటాయి.16. పైన తేరిన గోధుమ రంగు తేట నీటిని మాత్రమే వడపోసి స్ప్రే బాటిల్లో పోయాలి.17. స్ప్రేయర్ నాజిల్‌కు మట్టి అడ్డుపడకుండా ఉండాలంటే ద్రావణాన్ని పల్చటి గుడ్డతో రెండుసార్లు వడపోసుకోవాలి. వడపోసిన తేట నీటిని స్ప్రేయర్ బాటిల్లో పోసి మొక్కల ఆకుల పైన, కింద తడిచేలా పిచికారీ చేయాలి. అప్పుడే ఆకుల అడుగున దాక్కున్న పురుగులు కూడా నశిస్తాయి.18. మట్టి ద్రావణాన్ని తయారు చేసిన 24 గంటల లోపు వాడుకోవడం మంచిది. నిల్వ ఉంచితే దాని ప్రభావం తగ్గుతుంది.19. సాధారణంగా వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఇలా స్ప్రే చేయడం వల్ల మొక్కలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.20. మట్టి ద్రావణంను కేవలం నీటిలా కాకుండా, ఒక సహజ సిద్ధమైన ‘టానిక్‘, ‘రక్షణ కవచం’గా భావించవచ్చు. 21. భూమి లోపలి మట్టిలో మొక్కలకు అవసరమైన మైక్రో, మాక్రో న్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రావణాన్ని ఆకులపై స్ప్రే చేసినప్పుడు, అవి వేర్ల కంటే 8 నుండి 20 రెట్లు వేగంగా పోషకాలను గ్రహిస్తాయి.22. ద్రావణంలో ఉండే ఆముదం, జిగట మట్టి ఒక పొరలా ఆకులపై ఏర్పడి, పురుగులు గుడ్లు పెట్టకుండా అడ్డుకుంటాయి.23. ఆకుముడత, తెల్లదోమ, పేనుబంక, లద్దెపురుగు వంటి మొండి చీడలను ఇది సమర్థవంతంగా నియంత్రిస్తుంది.24. పోషక లోపాల వల్ల ఆకులు పసుపు రంగులోకి మారినప్పుడు ఈ ద్రావణం పిచికారీ చేస్తే, కేవలం 48 గంటల్లోనే మొక్క తిరిగి పచ్చగా మారుతుంది.25. పూత రాలడం తగ్గుతుంది. కాయల పరిమాణం, నాణ్యత పెరుగుతాయి. ఇది మొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది.26. రసాయన ఎరువులు, ఖరీదైన పురుగుమందుల అవసరం లేకుండానే కేవలం మట్టితో తోటను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.27. అధిక వర్షాలు వల్ల వేర్లు పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు, ఈ ఫోలియర్ స్ప్రే మొక్కకు ్రపాణం పోస్తుంది. 28. మిద్దె తోటలోని మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా ఉండాలంటే వారానికి ఒకసారి పిచికారీ చేయడం సరిపోతుంది.29. ఒకవేళ ఆకుముడత, తెల్లదోమ లేదా పేనుబంక వంటివి ఎక్కువగా ఉంటే, 3 నుండి 4 రోజుల వ్యవధిలో రెండు మూడు సార్లు పిచికారీ చేయాలి. సమస్య తగ్గిన తర్వాత మళ్లీ వారానికి ఒకసారికి మార్చుకోవచ్చు.30. మొక్కలు పూత మీద ఉన్నప్పుడు 10 రోజులకు ఒకసారి ఇస్తే పూత రాలకుండా కాయ బాగా వస్తుంది.31. పశువుల ఎరువు మట్టిలో కలిసి వేర్ల ద్వారా నెమ్మదిగా పోషకాలను అందిస్తుంది. మట్టి ద్రావణం ఆకుల ద్వారా తక్షణమే అందుతుంది. కాబట్టి, వారానికి ఒకసారి మట్టి ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు. 32. ఒక వారం మట్టి ద్రావణం, తర్వాతి వారం జీవామృతం లేదా తౌడు ద్రావణం వంటివి మార్చి మార్చి ఇవ్వటం వలన మొక్కకు రకరకాల సూక్ష్మపోషకాలు అందుతాయి.- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
జనుము సాగుకు పెట్టుబడి ఖర్చు పెద్దగా ఉండదు
-
ఎల‘మంద’కు కాసుల పంట
సాక్షి, కోరుట్ల: రసాయనిక ఎరువుల వినియోగంతో భూమి సారం కోల్పోతూ వస్తోంది. పంట దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. వ్యవసాయ భూముల్లో ఆవుల మందతో భూమికి సారం.. ఎలమందకు రాబడి.. రైతుకు ప్రయోజనం కలుగుతోంది. దీంతో భూసారం పెంపుపై రైతాంగం ఆవుల మందలపై దృష్టి సారిస్తోంది. ఈ మంద వారం పాటు సాగు భూముల్లో నిద్ర తీసిందంటే చాలు సదరు ఎలమందకు రూ.50 వేలకు మించి చేతికొస్తుంది. ఆవుల మంద విసర్జకాలకు ఉన్న డిమాండే ఇందుకు కారణమని చెబుతున్నారు. జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రుద్రంగి మండలం మానాల, చందుర్తి, కోనరావుపేట మండలాల పరిసరాల్లోని తండాల్లో పశుపోషణ పెద్ద ఎత్తున సాగుతోంది. అటవీ ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు పెద్ద ఎత్తున ఉండటంతో ఆవుల మందలను ఎక్కువగా పోషిస్తున్నారు. నెలల తరబడి సంచార పశుపోషణ చేస్తూ ఆదాయం కోసం మందలను సాగు భూముల్లో నిద్రకు ఉంచుతారు. పశ్చిమ డివిజన్ సరిహద్దుల్లోని తండాల్లో ఇలా ఆవుల మందలను పోషించేవారు దాదాపు 150 మంది దాకా ఉంటారు. వంద వరకు మందలు ఉండగా.. ఒక్కో మందలో వందకు పైగా ఆవులు ఉన్నాయి. వారానికి రూ.50 వేలు పంటల సాగుకు సిద్ధమయ్యే ముందు రైతులు భూసారం పెంపు కోసం ఆవుల మందల నిద్రపై ఆసక్తి చూపుతున్నారు. సహజసిద్ధంగా ఆవుల మల, మూత్ర విసర్జకాలతో సాగుభూములు సార వంతంగా మారుతాయి. రసాయన ఎరువులు వాడ కుండానే మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. మం దలో ఉన్న ఆవుల సంఖ్యను బట్టి రైతులు మందల యజమానులకు డబ్బులు చెల్లిస్తున్నారు. వందకు పైబడి ఉన్న ఆవుల మంద వారం పాటు సాగు భూమిలోనే కట్టేస్తే రోజుకు రూ.6 వేల నుంచి రూ.8 వేలు చెల్లిస్తున్నారు. కనీసం వారంపాటు మంద సాగుభూమిలో ఉంటే పశు మల, మూత్ర విసర్జకాలతో భూసారం చక్కగా పెరుగుతుంది. ఇవీ లాభాలు ► సాగు భూమిలో కర్బన శాతం పెరుగుతుంది ► సూక్ష్మ, స్థూల పోషకాలు సమతూకం అవుతాయి ► భూమి సహజ లక్షణాలు కోల్పోకుండా ఉంటుంది ► నత్రజని, భాస్వరం, పొటాషియం సహజసిద్ధంగా అంది నేల సారవంతం అవుతుంది -
16 పోషకాలనిచ్చే సమృద్ధ ఎరువు
పంట పొలంలో వేసిన రసాయనిక ఎరువులు 30% మాత్రమే పంటలకు ఉపయోగపడతాయి. మిగిలిన 70% వృథాయే. ఈ రసాయనాల వల్ల భూసారం దెబ్బతింటుంది. అంతేకాదు.. భూమిలో ఉండి పంటలకు, రైతులకు మేలు చేసే జీవాలు చనిపోతాయి. పంటల దిగుబడి ఊహించనంతగా తగ్గిపోతుంది. ఇది గ్రహించిన కొందరు రైతులు ఇష్టపడి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వర్మీ కంపోస్టు(జెర్రెల ఎరువు), పెంట(పశువుల) ఎరువు, కంపోస్టు మొదలైనవి తమ వీలును బట్టి పంటలకు వాడుతున్నారు. అయితే, ఇలా ఏదో ఒక ఎరువు వేస్తే మన పంటలకు సరైన పోషకాలు అందక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. సేంద్రియ పంటలకు అవసరమైన ముఖ్యమైన 16 పోషకాలను అందించే ‘సమృద్ధ ఎరువు’ను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, డీడీఎస్–కృషి విజ్ఞాన కేంద్రం వాడుకలోకి తెచ్చాయి. సమృద్ధ ఎరువులో 16 పోషకాలు.. టన్ను వర్మీ కంపోస్టును పొలంలో వేస్తే సుమారు 15 కిలోల నత్రజని, 3 కిలోల భాస్వరం, 5 కిలోల పొటాష్ లభిస్తుంది. వర్మీ కంపోస్టుతోపాటు పిడకల/పశువుల/పెంట ఎరువు, మేకల ఎరువులను 3:3:4 నిష్పత్తిలో కలిపి వేసినట్టయితే భూమికి అధిక పోషకాలు అందుతాయి. అంటే.. 3 టన్నులు వర్మీకంపోస్టు, 3 టన్నుల పిడకల ఎరువు, 4 టన్నుల మేకల ఎరువు కలిపితే 10 టన్నుల సమృద్ధ ఎరువు తయారవుతుంది. టన్ను సమృద్ధ ఎరువును వేస్తే.. 385 కిలోల సేంద్రియ కర్బనం, 18.6 కిలోల నత్రజని, 5.8 కిలోల భాస్వరం, 10.1 కిలోల పొటాష్ నేలకు అందుతాయి. సమృద్ధ ఎరువు మొత్తం 16 రకాల బలాల(పోషకాల)ను అందిస్తుంది. పంటకు తోడ్పడే సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండటం వల్ల పూత, కాత బాగా వస్తుంది. భూసారాన్ని పెంపొందిస్తుంది. ఇసుక భూములకు కూడా నీటిని పట్టుకునే గుణం పెరుగుతుంది. భూమి మెత్తగా అయి, గాలిని పీల్చుకునే గుణం పెరుగుతుంది. దీన్ని వేయడం వల్ల చౌడు తగ్గి పంటలు బాగా వస్తాయి. సమృద్ధ ఎరువు ప్రభావం భూమిపై 2–3 ఏళ్ల వరకు ఉంటుంది. ప్రతి ఏటా ఎరువు ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. దీనితో పండించిన పంట ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రుచిగా ఉంటుంది. మంచి ధర పలుకుతుంది. వివరాలకు.. డీడీఎస్–90003 62144, డీడీఎస్–కృషి విజ్ఞాన కేంద్రం–90104 96756 -
పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది
ౖÐð రా కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కో ఆర్డినేటర్ హేమంత్‌కుమార్ ఏన్కూరు: పచ్చిరొట్ట ఎరువులు కలియదున్నడం ద్వార భూసారం పెరుగుతుందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం పోగ్రాం కో ఆర్డినేటర్ హేమంత్‌కుమార్ తెలిపారు. క్లస్టర్ స్థాయి జీవనోపాధుల వనరుల కేంద్రంలో ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పంట సమూహాల అభివృద్ధి పథకం కింద గురువారం జరిగిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తప్పనిసరిగా పచ్చిరొట్ట, ఎరువులు , పెసర, పిల్లిపెసర, జనుము, జిలుగులు సాగు భూమికి అందించలన్నారు. దీనివలన భూసారం పెరిగి అధిక దిగుబడులు వస్తాయన్నారు. వరిలో జింక్ రెండు పంటలకు ఒక్కసారి వేయాలన్నారు. వరిలో కాలిబాటలు తీయటం, యూరియాను తగిన మోతదులో వాడటం వలన దోమ ఉధృతిని నివారించవచ్చన్నారు. పత్తికి 45 రోజులకు మెగ్నిషియం, 60 రోజులకు బోరాన్ వేయలన్నారు. పత్తిలో అంతర్పంటగా కందిసాగు చేయాలన్నారు. మిర్చి, వేపపిండి, వేపనూనె వాడలన్నారు. మిర్చితోట చుట్టు జొన్న, మొక్కజొన్న పంటలు వేయాలన్నారు. తోటలో బంతి, ఆముదం వేయాలన్నారు. కార్యక్రమంలో ఖమ్మం రైతు శిక్షణ కేంద్రం ఏఓ శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి డి. బాలాజి పాల్గొన్నారు.


