ముంబై: భోజ్‌పురి నటుడు, గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన తన రెండో భార్య సురభి తివారీతో కలిసి ‘పతి పత్నీ ఔర్ పంగా’ రెండో సీజన్‌లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఆయన పెద్ద కుమార్తె రిథి తివారీ ‘బిగ్ బాస్ 20’లో పాల్గొంటూ తన తల్లిదండ్రుల విడాకుల గురించి మాట్లాడారు. మనోజ్ తివారీ జీవితంలోకి సురభి వచ్చినప్పుడు తాను ఎంతో సంతోషించానని రిథి తెలిపారు.
2020లో మనోజ్ తివారీతో వివాహం
సురభి తివారీకి ప్రస్తుతం 30 ఏళ్ల ఉంటాయని తెలుస్తోంది. 2020లో ఆమె మనోజ్ తివారీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె సాన్విక అదే ఏడాది జన్మించింది. 2022లో చిన్న కుమార్తె మనోగ్య జన్మించింది.
సినీ రంగంలో తెరవెనుక బాధ్యతలు
సురభి తెరపై కనిపించరు. అయితే రెండు నిర్మాణ సంస్థల కార్యకలాపాలను ఆమె తెరవెనుక నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆమె పాటలు పాడటంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. పట్నాకు చెందిన సురభి మృదుల్ ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉన్నారు. అలాగే సాన్విక ఫిల్మ్స్, రిథి ప్రొడక్షన్స్ సంస్థలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
1999లో మొదటి వివాహం
మనోజ్ తివారీ 1999లో ప్రతిమా పాండేతో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె పేరు రాణి తివారీగా మారింది. ఈ దంపతులకు రిథి తివారీ జన్మించారు. అయితే 2011లో మనోజ్, రాణి విడిపోయారు. 2012లో వారికి విడాకులు లభించాయి.
తల్లిదండ్రుల విడిపోవడంపై రిథి వ్యాఖ్యలు
‘బిగ్ బాస్ 20’లో రిథి తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయే సమయానికి తనకు 8 ఏళ్ల వయసు అని, విడాకులు ఖరారైనప్పుడు తనకు 9 ఏళ్లు అని చెప్పారు. తన తల్లి రాణికే తన కస్టడీ లభించిందని తెలిపారు. తల్లిదండ్రులు మళ్లీ కలుస్తారని చాలా కాలం ఆశించానని రిథి పేర్కొన్నారు.
తండ్రి, కుమార్తె మధ్య దూరం
తన తండ్రిని కలిసిన సందర్భాల్లో తామిద్దరం భావోద్వేగానికి గురయ్యేవాళ్లమని రిథి చెప్పారు. ‘నా దగ్గర నాన్న లేరు.. ఆయన దగ్గర నేను లేను’ అనే బాధ ఉండేదని ఆమె వివరించారు. అయితే మనోజ్ తివారీకి సురభి జీవిత భాగస్వామిగా మారినప్పుడు తాను చాలా సంతోషించానని రిథి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి: ఢిల్లీపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్.. ‘జన్ సురాజ్’ విస్తరణకు సిద్ధం!


