భారత్‌ను రెండుగా చీల్చి.. జపాన్‌ దాకా క్లౌడ్‌ హైవే! | India Split in Two by Clouds Cloud Highway Reaches Japan | Sakshi
Sakshi News home page

భారత్‌ను రెండుగా చీల్చి.. జపాన్‌ దాకా క్లౌడ్‌ హైవే!

Sep 26 2026 10:30 AM | Updated on Sep 26 2026 10:46 AM

India Split in Two by Clouds Cloud Highway Reaches Japan

ఒకవైపు ఆకాశమంతా దట్టమైన మేఘాలు.. మరోవైపు అసలు మేఘాల జాడే కనిపించని ప్రాంతాలు! ఎందుకిలా ఉందని అనుకుంటున్న వేళ.. మరో అసాధారణ దృశ్యం కళ్లముందుకొచ్చింది. అంతరిక్షం నుంచి చూస్తే మన దేశాన్ని రెండుగా చీల్చినట్లుగా భారీ మేఘాలు కనిపించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన ఇన్‌శాట్‌-3డీఎస్‌ వాతావరణ ఉపగ్రహం తన కెమెరాలో బంధించింది.

అంతరిక్షం నుంచి భారత్‌ను చూస్తే వాతావరణం రెండు భాగాలుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. తూర్పు, ఈశాన్య, దక్షిణ భారత ప్రాంతాలపై దట్టమైన మేఘాలు కమ్ముకోగా.. పశ్చిమ, వాయవ్య భారత్‌ మాత్రం చాలావరకు మేఘరహితంగా కనిపించింది. సెప్టెంబర్‌ 25న ఇన్‌శాట్‌-3డీఎస్‌ తీసిన చిత్రంలో బంగాళాఖాతం నుంచి తూర్పు, ఈశాన్య భారత్‌ మీదుగా విస్తరించిన భారీ మేఘ సమూహం స్పష్టంగా కనిపించింది. దక్షిణ ద్వీపకల్పం, దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతాల్లోనూ మేఘాల పొరలు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లో ఆకాశం చాలావరకు నిర్మలంగా కనిపించింది.

ఉపగ్రహం 10.83 మైక్రోమీటర్ల తరంగదైర్ఘ్యంలోని థర్మల్‌ ఇన్‌ఫ్రారెడ్‌ ఛానల్‌ ద్వారా ఈ చిత్రాన్ని తీసింది. ఈ సాంకేతికతతో పగలు, రాత్రి అనే తేడా లేకుండా మేఘాల కదలికలు, విస్తరణను వాతావరణ నిపుణులు పరిశీలించగలరు.

అసలు కారణం ఏంటంటే..
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలోకి ప్రవేశిస్తున్నాయి. అదే సమయంలో బంగాళాఖాతం, మధ్య భారత ప్రాంతాల్లో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు వర్షాలను ప్రభావితం చేస్తున్నాయి. తూర్పు, ఈశాన్య భారత్‌పై కనిపిస్తున్న దట్టమైన మేఘాలకు తేమతో కూడిన గాలులు, అల్పపీడన వ్యవస్థలు, ఇతర వాతావరణ పరిణామాలు కారణమై ఉండొచ్చని నిపుణుల అంచనా.

ఇదే మేఘాలు.. జపాన్‌ దాకా!
ఇదిలా ఉండగా.. మరో తాజా ఉపగ్రహ చిత్రంలో భారత్‌ నుంచి జపాన్‌ వరకు విస్తరించిన భారీ మేఘాల పట్టీ కనిపించింది. తూర్పు, ఈశాన్య భారత్‌ నుంచి ప్రారంభమైన మేఘ సమూహాలు హిమాలయ ప్రాంతం, చైనా మీదుగా కొరియా ద్వీపకల్పం, జపాన్‌ వైపు విస్తరించినట్లు చిత్రాల్లో కనిపిస్తోంది.

బంగాళాఖాతం, తూర్పు భారత్‌ ప్రాంతాల్లో తేమతో కూడిన గాలులు భారీగా మేఘాలను ఏర్పరుస్తున్నాయి. ఆ తర్వాత ఉత్తరం వైపు చైనా దిశగా విస్తరించిన మేఘాల పట్టీ.. తూర్పు ఆసియా వరకు కొనసాగుతున్నట్లు కనిపించింది. అందుకే ఈ భారీ మేఘ సమూహాన్ని ‘క్లౌడ్‌ హైవే’గా అభివర్ణిస్తున్నారు.

మరోసారి రుతుపవనాల జోరు
ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దానికి ఆనుకుని ఉన్న ఒడిశా ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో మధ్య, తూర్పు భారతంలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో ఉత్తరాఖండ్‌లో విస్తారంగా వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోనూ వర్షాలు పడే అవకాశముంది.

దీనికి పశ్చిమ గాలుల వ్యవస్థ (వెస్ట్రన్‌ డిస్టర్బెన్స్‌) తోడైతే హిమాలయాల దిగువ ప్రాంతాల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రహదారులపై అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైనప్పటికీ.. వాతావరణ వ్యవస్థల ప్రభావంతో మరోసారి భారీ మేఘాలు, వర్షాలు దేశంలోని పలు ప్రాంతాలను పలకరిస్తున్నాయి. అంతరిక్షం నుంచి తీసిన ఈ చిత్రాలు మాత్రం భారత్‌లోని వాతావరణ వైవిధ్యాన్ని, ఆసియా స్థాయిలో మేఘాల విస్తరణను ఒక్కసారిగా కళ్లముందు ఉంచుతున్నాయి.

ఇదీ చదవండి: ఉప ఎన్నికల వేళ.. విజయ్‌ కామెంట్లకు అర్థమేంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement