source: X
ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ పతకాల వేట నిదానంగా కొనసాగుతోంది. ఏడో రోజు ఉదయానికి భారత్ ఖాతాలో కేవలం 25 పతకాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎడిషన్ మరో ఎనిమిది రోజుల్లో (అక్టోబర్ 4) ముగియనున్న నేపథ్యంలో భారత్ గత ఎడిషన్ పతకాల రికార్డును తాకగలుగుతుందా అన్న చర్చ మొదలైంది.
2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించింది. భారత్ ఆసియా క్రీడల చరిత్రలోనే ఇదే అత్యధికం (పతకాల పరంగా). అయితే ఈసారి భారత్ మళ్లీ 100 పతకాల మార్క్‌ను దాటగలదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.
భారత్ క్రితంసారి రికార్డును సమం చేయాలంటే ఇంకా 82 పతకాలు సాధించాలి. 100 మార్క్‌ను దాటాలంటే కనీసం 76 పతకాలు రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పై రెండు లక్ష్యాలను చేరుకోవడం అంత సులభం కాదనే అనిపిస్తుంది.
పలు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో భారత్ ఇప్పటికే పలు పతకాలు చేజార్చుకోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇకపై పతక అవకాశమున్న ప్రతి ఈవెంట్లో సత్తా చాటినా, భారత్ 107 పతకాల మార్కును తాకడం కష్టంగా కనిపిస్తుంది. అయితే ఇది అసాధ్యమైతే కాదు. ఎందుకంటే భారత్‌కు ఆ మార్కును దాటడానికి ఇంకా వీలైనన్ని అవకాశాలు ఉన్నాయి.
కొన్ని ఈవెంట్లలో ఇంకా క్వాలిఫికేషన్ దశనే నడుస్తుండటం భారత్ పతకాల వేగం నిదానించడానికి కారణం. తర్వాతి దశలో భారత్ షూటింగ్, ఆర్చరీ, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, స్క్వాష్, కబడ్డీ, హాకీ వంటి విభాగాల్లో మరిన్ని పతకాలు సాధించే అవకాశాలు ఉన్నాయి.
ఎక్కడి నుంచి ఎక్కువ పతకాలు రావొచ్చు..?
గత ఎడిషన్‌లో భారత్‌కు అత్యంత ఫలవంతమైన విభాగాల్లో షూటింగ్ ప్రధానమైంది. ఈసారి కూడా భారత్ ఈ క్రీడపై చాలా ఆశలు పెట్టుకుంది. అందుకు అనుగుణంగానే ఇప్పటికే పలు పతకాలు కూడా సాధించింది. మిగిలిన రోజుల్లో షూటింగ్‌లో భారత్ మరిన్ని పతకాలు సాధించవచ్చు.
అథ్లెటిక్స్:సావన్ బర్వాల్ రజతం (మారథాన్) ఇప్పటికే భారత్ ఖాతాలో చేరింది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ఇంకా పలు ఈవెంట్లు మిగిలి ఉన్నాయి. గత ఎడిషన్‌లో భారత్ అథ్లెటిక్స్‌లో ఏకంగా 29 పతకాలు సాధించింది.
ఆర్చరీ: కంపౌండ్, రికర్వ్ విభాగాల్లో భారత్‌కు వ్యక్తిగత, టీమ్ ఈవెంట్లలో అవకాశాలు ఉన్నాయి. ఏడో రోజు నుంచే క్వాలిఫికేషన్ రౌండ్లు కొనసాగుతున్నాయి.
కబడ్డీ: పురుషులు, మహిళల జట్లు రెండూ పతక పోటీలో ఉన్నాయి. ఇవాళే (సెప్టెంబర్ 26) ఈ రెండు ఫైనల్స్ జరగనున్నాయి. ఈ రెండు ఈవెంట్లలో భారత్ స్వర్ణ పతకాలు ఆశిస్తుంది.
స్క్వాష్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీ: నాకౌట్ దశల్లో భారత్‌కు మరిన్ని పతక అవకాశాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: షూటింగ్‌లో మరొకటి.. 25కు చేరిన భారత్ పతకాల సంఖ్య


