చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో! | China Visit Sparks Debate, Professor’s Viral Post Questions India Infrastructure And Governance, Watch Video Inside | Sakshi
Sakshi News home page

చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో!

Sep 26 2026 8:36 AM | Updated on Sep 26 2026 9:41 AM

China Visit: Are Our Leaders Fooling Us Professors Post Goes Viral

రోజూ మన కళ్లముందు కనిపించే రోడ్లు.. ట్రాఫిక్‌.. నగరాల పరిస్థితి.. ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. కానీ, కొన్నిసార్లు మరో దేశంలోని నగరాలను చూసిన తర్వాత.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఓ విదేశీ పర్యటన.. తిరిగొచ్చాక చేసిన ఓ సోషల్‌ మీడియా పోస్ట్‌.. ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.

‘చైనాలోని సాధారణ నగరాలను సందర్శించి తిరిగి భారత వీధుల్లోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు, మొత్తం వ్యవస్థ మనల్ని ఎంతగా మోసం చేసిందో అర్థమవుతుంది’ అంటూ భారతీయ మూలాలున్న అమెరికన్‌ ప్రొఫెసర్‌ రాజేశ్వరి అయ్యర్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె పోస్టుకు భారీగా లైక్స్‌, షేర్లు, కామెంట్లు వచ్చాయి. చైనాలోని నగరాల దృశ్యాలతో కూడిన పోస్టులు కూడా సోషల్‌ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.

‘ఇలాంటి పోస్టులు పెడితే పరువునష్టం కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘చైనా అభివృద్ధిని మెచ్చుకునేవాళ్లు.. అక్కడి నియంత్రణల గురించి కూడా మాట్లాడాలి’ అని మరో వ్యక్తి బదులిచ్చారు. ఇంకొకరు స్పందిస్తూ.. ‘చైనాలో ఇలా బహిరంగంగా మాట్లాడితే.. ఉదయానికే కనిపించరు. భారత్‌లో మాత్రం యువత రోడ్డెక్కి నిరసనలు తెలిపేంత స్వేచ్ఛ.. ఇంత ప్రజాస్వామ్యం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

అంత దాకా ఎందుకు..
అయితే ఆమె వ్యాఖ్యలకు అందరూ ఏకీభవించలేదు. కొందరు నెటిజన్లు చైనాతో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని.. బ్యాంకాక్‌, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా వంటి దేశాల్లోని నగరాలను చూసినా భారత్‌లో మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సదుపాయాల్లో తేడా కనిపిస్తుందని కామెంట్‌ చేశారు. ‘చైనానే కాదు.. బ్యాంకాక్‌ వెళ్లినా అభివృద్ధి, పరిశుభ్రత, పౌరస్పృహలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది’ అంటూ ఒకరు స్పందించారు. మరికొందరు వియత్నాం, ఇండోనేషియా, మలేసియాలను కూడా ప్రస్తావించారు.

చైనా మోడల్‌పై మరో వాదన
మరోవైపు.. చైనా నగరాల్లో కనిపించే వేగవంతమైన రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైస్పీడ్‌ రైళ్లను ప్రశంసించిన కొందరు నెటిజన్లు.. వాటిని భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థతో నేరుగా పోల్చడం సరికాదని వాదించారు. చైనాలోని వేగవంతమైన అభివృద్ధి వెనుక ఒకే పార్టీ పాలన, కేంద్రీకృత నిర్ణయ వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయని కొందరు ప్రస్తావించారు. ప్రజా పర్యవేక్షణ, రాజకీయ స్వేచ్ఛ, సోషల్‌ క్రెడిట్‌ వ్యవస్థ వంటి అంశాలను కూడా వారు చర్చలోకి తీసుకొచ్చారు.

భిన్నాభిప్రాయాలు
చైనా హైస్పీడ్‌ రైళ్లను మెచ్చుకున్న ఒక నెటిజన్‌.. వాటి నిర్మాణానికి తక్కువ కార్మిక వ్యయం, జపాన్‌ నుంచి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు కూడా కారణమని వ్యాఖ్యానించారు. రైళ్ల నిర్మాణం ఒకవైపు ఉద్యోగాల కల్పన, మరోవైపు రవాణా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమంగా సాగిందని పేర్కొన్నారు. కేవలం రైళ్ల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని దేశాల మధ్య పోటీని అంచనా వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. దుబాయ్‌లాంటి చోట్ల రోడ్లు, భవనాల నిర్మాణానికి మన దేశం నుంచి కార్మికులు వెళ్తారని, వాళ్లనే ఉపయోగించి ఇక్కడ హైక్లాస్‌ రోడ్లను నిర్మించడం మన ప్రభుత్వాలకు చేత కాదా? అంటూ ఒకరు ప్రశ్నించారు.

నెహ్రూ.. మోదీని మాత్రమే నిందించాలా?
భారత్‌లో మౌలిక వసతుల సమస్యలకు రాజకీయ నాయకులను మాత్రమే బాధ్యులను చేయడం సరిపోదని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రభుత్వాలను నిందించడం కంటే.. దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం, అవినీతి, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రాజకీయ సంకల్పంతో పాటు అధికార వ్యవస్థలోనూ మార్పులు అవసరమని ఆ వ్యాఖ్య సారాంశం.

ఎవరీ రాజేశ్వరి అయ్యర్‌?
డాక్టర్‌ రాజేశ్వరి అయ్యర్‌ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ మూలాలున్న అమెరికన్‌ ప్రొఫెసర్‌. ఆమె ఎక్స్‌ ప్రొఫైల్‌లో ఎన్‌ఐటీ పుదుచ్చేరి, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థినిగా, డైరెక్టర్‌, ప్రొఫెసర్‌గా వివరాలు ఉన్నాయి. భారత్‌లో రిజర్వేషన్లు, పన్నులు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రజా మౌలిక వసతులు వంటి అంశాలపై ఆమె తరచూ పోస్టులు చేస్తుంటారు. గతంలోనూ భారత్‌ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లడానికి కారణాలను వివరిస్తూ ఆమె చేసిన పోస్టులు వార్తల్లో నిలిచాయి.

చైనా పర్యటన అనుభవం నుంచి మొదలైన ఈ పోస్టు ఇప్పుడు కేవలం చైనా-భారత్‌ నగరాల పోలికకే పరిమితం కాకుండా.. మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, అధికార యంత్రాంగం, అవినీతి, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం వంటి విస్తృత అంశాలపై సోషల్‌ మీడియా చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement