డీజిల్‌ ఎగుమతులపై తగ్గని భారత్ | US Fuel Restrictions India to Continue Diesel Exports Confirms Petroleum Minister | Sakshi
Sakshi News home page

డీజిల్‌ ఎగుమతులపై తగ్గని భారత్

Sep 26 2026 9:19 AM | Updated on Sep 26 2026 9:19 AM

US Fuel Restrictions India to Continue Diesel Exports Confirms Petroleum Minister

అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌లో సరఫరా కొరత, ధరల తీవ్రత నెలకొన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం భారత్ తన డీజిల్‌ ఎగుమతులను యథావిధిగా కొనసాగిస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్ పురి స్పష్టం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

న్యూఢిల్లీలో నిర్వహించిన 13వ పబ్లిక్ అఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (PAFI) వార్షిక సదస్సులో మాట్లాడిన మంత్రి ‘మేము చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం. ఎగుమతుల ఉపసంహరణ ప్రసక్తే లేదు’ అని తేల్చిచెప్పారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇటీవల మారిషస్‌తో కుదుర్చుకున్న ఐదేళ్ల ఇంధన సరఫరా ఒప్పందాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రపంచ డీజిల్‌ మార్కెట్‌లో భారత్‌ కీలక పాత్ర

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభాల వల్ల ప్రపంచవ్యాప్తంగా డీజిల్ సరఫరా వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి గురైంది. రష్యా ఎగుమతులు తగ్గడంతో సముద్ర మార్గం గుండా డీజిల్ ఎగుమతి చేసే దేశాల్లో రష్యాను వెనక్కి నెట్టి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద డీజిల్ ఎగుమతిదారుగా (దాదాపు 10% వాటాతో) నిలిచింది.

శుద్ధి సామర్థ్యం దిశగా వేగంగా అడుగులు

ప్రస్తుత సామర్థ్యం ఏడాదికి 267 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంటీపీఏ). సమీప లక్ష్యం.. రాబోయే ఏడాది కాలంలో 290 ఎంటీపీఏ. దీర్ఘకాలిక లక్ష్యం.. 2030-32 నాటికి 320 ఎంటీపీఏకి పెంచడం. యూరప్‌లోని పలు శుద్ధి కర్మాగారాలు మూతపడుతున్న తరుణంలో భారత్ తన శుద్ధి సామర్థ్యాన్ని (రిఫైనింగ్‌ కెపాసిటీ) భారీగా పెంచుకోవడం గమనార్హం.

గల్ఫ్‌ దిగ్గజాల ఆసక్తి

భారత మార్కెట్ వేగంగా విస్తరిస్తుండటంతో గల్ఫ్ ఇంధన దిగ్గజాలైన సౌదీ అరామ్‌కో, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ భారత రిఫైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. దేశీయ అవసరాలను తీర్చడమే కాకుండా విశ్వసనీయ ఇంధన సరఫరాదారుగా భారత్ తన అంతర్జాతీయ ప్రతిష్టను నిలబెట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆధార్ వ్యవస్థనే అబ్బురపరిచిన కవలలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement