తీవ్రమైన ఇంధన సంక్షోభం
ప్రభుత్వ వాహనాలకు 50% ఇంధన కోత
కొత్త కార్ల కొనుగోలుపై నిషేధం
పెళ్లిళ్లలో ఇక ఒక్కటే వంటకం
పెళ్లిళ్లు అంటే ఆ హడావుడి అంతా ఇంతా కాదు.. ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యం వంటలకే ఉంటుంది. లెక్కకు మించిన రకాల వంటకాలతో అతిథులకు విందుతో పసందు చేస్తారు. ఏదైనా పెళ్లి గొప్పగా జరిగిందంటే ఆ పెళ్లిలో వడ్డించిన వంటకాల గురించే మాట్లాడుకుంటారు. మరి అలాంటి పెళ్లిళ్లలో ఒకే రకం వంటకంతో సరిపెట్టుకోవాలంటే.. ఎక్కువ రకాల వంటకాలు వడ్డించకూడని పరిస్థితి వస్తే.. మన దాయది దేశం పాకిస్తాన్‌లో ప్రస్తుతం అలాంటి పరిస్థితే వచ్చింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి, ఎర్ర సముద్రం మార్గాల్లో పెరిగిన అంతరాయాల ప్రభావం పాకిస్తాన్‌పై పడుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, సరఫరాపై ఆందోళనల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వ వ్యయాలను కట్టడి చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలను ప్రకటించింది. సెప్టెంబర్ 17న క్యాబినెట్ డివిజన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. ప్రభుత్వ వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని 50 శాతం తగ్గించడంతో పాటు కొత్త ప్రభుత్వ వాహనాల కొనుగోలును నిలిపివేశారు. ఈ చర్యలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
ప్రభుత్వ వాహనాలకు సగం ఇంధనమే
కొత్త నిబంధనల ప్రకారం అధికారిక వాహనాల ఇంధన కేటాయింపును మూడు నెలల పాటు 50 శాతం తగ్గిస్తారు. అయితే సాయుధ దళాలు, సివిల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్, చట్ట అమలు సంస్థలు, కస్టమ్స్, ఎఫ్‌బీఆర్, ఇతర అత్యవసర సేవలకు చెందిన ఆపరేషనల్ వాహనాలకు ఈ కోత నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆయా విభాగాల్లోని పరిపాలనా, నాన్-ఆపరేషనల్ వాహనాలకు మాత్రం పరిమితులు వర్తిస్తాయి.
కొత్త ప్రభుత్వ వాహనాలతో పాటు ఐటీ పరికరాలను మినహాయించి ఇతర మన్నికైన వస్తువుల కొనుగోళ్లపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ సమావేశాలను సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ అతిథుల కోసం నిర్వహించే విందులను మినహాయించి అధికారిక డిన్నర్లను కూడా నిలిపివేశారు. ప్రభుత్వ నిధులతో సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణపైనా ఆంక్షలు విధించారు.
మూడు నెలలు విదేశీ పర్యటనలకు బ్రేక్
మంత్రులు, సలహాదారులు, ప్రత్యేక సహాయకులు, ఎంపీలు, ప్రభుత్వ అధికారుల విదేశీ పర్యటనలను మూడు నెలల పాటు నిలిపివేశారు. అయితే కొన్ని స్కాలర్‌షిప్‌లు, శిక్షణా కార్యక్రమాలు, అంతర్జాతీయ ఒప్పందాల కింద తప్పనిసరి పర్యటనలకు మినహాయింపులు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెళ్లిళ్లలో ‘వన్ డిష్’ రూల్
ఇంధన వినియోగాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా వివాహాలు, ఇతర పెళ్లి కార్యక్రమాల్లో ఒక్క వంటకం మాత్రమే వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఇస్లామాబాద్‌లో దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బజార్లు, డిపార్ట్‌మెంటల్, కిరాణా దుకాణాలను రాత్రి 9 గంటలకే మూసివేయాలి. వివాహ మందిరాలు, మార్క్యూలు, ఇతర వేడుకల వేదికలు రాత్రి 10 గంటలకు, రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్‌లెట్లు రాత్రి 11 గంటలకు మూసివేయాలి. టేక్‌అవే, హోం డెలివరీ సేవలకు మాత్రం ఈ సమయ పరిమితుల నుంచి మినహాయింపు ఉంది.
ఫార్మసీలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబొరేటరీలు, బేకరీలు, తందూర్లు, పాల దుకాణాలు, పెట్రోల్, సీఎన్‌జీ స్టేషన్లు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, జిమ్‌లు, క్రీడా సదుపాయాలు, ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లకు ఈ క్లోజింగ్ టైమింగ్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇతర ప్రావిన్సులు, ప్రాంతాలు కూడా ఇలాంటి ఇంధన పొదుపు, మితవ్యయ చర్యలను అమలు చేయాలని పాక్ ప్రభుత్వం సూచించింది.


